తెలంగాణ

telangana

ETV Bharat / state

'కొంత భూమి రోడ్డుకు పోయింది.. ఉన్నకొంచెం ఆన్​లైన్​ కాలేదు'

Khammam farmers land problems : వాళ్లంతా మార్కెట్‌ ధర కంటే తక్కువకే.. జాతీయ రహదారి కోసం భూములు ఇచ్చారు. తమ ప్రాంతం అభివృద్ధి చెందుతుందని భావించారు. రెండేళ్ల కిందట జాతీయ రహదారిలో పోయిన భూమిని మినహాయించి... మిగిలినది ఆన్‌లైన్‌లో నమోదు చేయించారు. ప్రస్తుతం మిగిలిన భూమికి రైతు బంధు రాకపోవడంతో... ధరణిలో నమోదు కాకపోవడాన్ని గుర్తించారు. రెవెన్యూ అధికారులు సహా.. కలెక్టర్‌కు ఫిర్యాదు చేసినా స్పందన లేదని అన్నదాతలు వాపోతున్నారు.

Khammam farmers land problems, farmers problems
భూమి ఆన్​లైన్​లో నమోదు కాలేదని రైతుల ఆందోళన

By

Published : Feb 5, 2022, 3:26 PM IST

భూమి ఆన్​లైన్​లో నమోదు కాలేదని రైతుల ఆందోళన

Khammam farmers land problems: కోదాడ - కురవి జాతీయ రహదారి నిర్మాణం కోసం... 2018-2019 వ సంవత్సరంలో భూసేకరణ జరిగింది. 80 కిలోమీటర్ల ఈ జాతీయ రహదారి.. ఖమ్మం గ్రామీణం, ముదిగొండ, నేలకొండపల్లి మండలాల మీదుగా వెళ్తుంది. 3 మండలాల్లోని రైతుల నుంచి 256 ఎకరాలు భూమి సేకరించారు. అప్పట్లో ఎకరాకు 12 లక్షల చొప్పున రైతులకు పరిహారం అందించారు. ఇందుకు రైతులంతా అన్యమనస్కంగానే అంగీకరించారు.

లబోదిబోమంటున్న అన్నదాతలు

పుష్కలమైన సాగు నీరు ఉండటం.. రహదారికి ఆనుకుని ఉన్న భూములు కావడంతో ఎకరాకు రూ.30 లక్షల వరకు ధర పలికే భూముల్ని తక్కువ ధరకే అప్పగించారు. ఇలా మూడేళ్ల కిందట భూసేకరణ జరగ్గా.. రహదారి కోసం పోయిన భూమిని తొలగించి.. మిగిలిన భూమిని రైతు పేరిట ఆన్‌లైన్‌లో పొందుపరిచారు. ఇటీవల మూడు మండలాలకు చెందిన పలువురు రైతుల భూమి.. ధరణి పోర్టల్‌లో కనిపిచకుండాపోయింది. ఒకేసారి రెండింతల భూమిని కోల్పోవాల్సి వచ్చింది. వాస్తవంగా భూమి తమ వద్దే ఉన్నప్పటికీ.. ఆన్ లైన్‌లో తొలగించడం చూసి.. రైతులంతా లబోదిబోమంటున్నారు.

'రైతు బంధు కూడా రాలేదు'

ధరణి పోర్టల్‌లో తలెత్తిన సమస్యల కారణంగానే... జాతీయ రహదారికి భూములు ఇచ్చిన రైతులకు ఈ దుస్థితి పట్టిందని.. పలువురు ఆరోపిస్తున్నారు. అధికారుల నిర్వాకం, తప్పుల తడకగా నమోదైన ఆన్​లైన్ వివరాల్లో తేడాల వల్లే.. రైతు బంధు కూడా రాకుండా పోయిందని.. అన్నదాతలు వాపోతున్నారు.

మాకు ఉన్న కొద్ది భూమిలో కొంచెం రోడ్డుకు పోయింది. మిగిలిన భూమికి నంబర్ లేదు. ఆన్​లైన్​లో నమోదు కాలేదు. ఆ భూమిని మేమే చేసుకుంటున్నాం. అయితే ఆన్​లైన్​లో లేకపోవడం వల్ల రైతుబంధు కూడా రాలేదు. అధికారుల చుట్టూ తిరుగుతున్నాం. ఇంతవరకు మా సమస్యకు పరిష్కారం దొరకలేదు.

-బాధిత రైతులు

కోదాడ-కురవి జాతీయ రహదారికి భూములు ఇచ్చిన రైతుల...... భూములు ఆన్‌లైన్‌లో రెండుసార్లు తొలగించినట్లు తమ దృష్టికి వచ్చిందని.. ఈ సమస్యను త్వరితగతిన పరిష్కరించేందుకు చర్యలు తీసుకుంటామని అధికారులు చెబుతున్నారు.

ఇదీ చదవండి:Telangana Loan: మరో రెండు వేల కోట్ల రుణం తీసుకోనున్న తెలంగాణ సర్కారు

ABOUT THE AUTHOR

...view details