Khammam Political Heat 2023 : అభ్యర్థుల ప్రకటన, పార్టీ మేనిఫెస్టో ప్రకటన నుంచీ అసెంబ్లీ ఎన్నికల పోరులో ఉమ్మడి ఖమ్మం జిల్లాలో బీఆర్ఎస్, ప్రతిపక్షాల కన్నా ఓ అడుగు ముందంజలోనే ఉంది. ఇప్పటికే నియోజకవర్గాల్లో గులాబీ దండు మోహరించి విస్తృతంగా ప్రజల్లోకి వెళ్తూ మద్దతు కూడగడుతోంది. ఓ వైపు ప్రచారపర్వాన్ని ఉద్ధృతంగా కొనసాగిస్తూనే.. వారానికోసారి మీడియా సమావేశాలు నిర్వహించాలని నిర్ణయించింది.
BRS Campaign in Khammam :అభ్యర్థులు, నియోజకవర్గాల పార్టీ సమన్వయకర్తల ఆధ్వర్యంలో ప్రచారం కొనసాగిస్తున్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రజా ఆశీర్వాద బహిరంగ సభలతో మరింత స్పీడు పెంచింది. తొలి బహిరంగ సభగా పాలేరు నుంచి ఎన్నికల సమరశంఖం పూరించి శ్రేణుల్ని ఎన్నికల కదనరంగంలోకి దింపింది. తొలి దఫాలో మిగిలిన రెండు నియోజకవర్గాల్లో నిర్వహించనున్న బహిరంగ సభ(BRS Public Meetings)లను విజయవంతం చేసేలా గులాబీ శ్రేణులు ప్రణాళికలు రూపొందిస్తున్నారు.
Khammam BRS Election Campaign 2023: అభ్యర్థుల ఎంపిక, ప్రకటన కాసింత ఆలస్యమైనప్పటికీ ప్రతిపక్ష కాంగ్రెస్ ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా ఆచితూచి అడుగులు వేస్తోంది. అభ్యర్థుల ఎంపికలో తీవ్ర జాప్యం చేస్తుందన్న అపవాదును మూటగట్టుకుంటున్నప్పటికీ.. ఎక్కడా అధికార పక్షానికి పైచేయి ఇవ్వకుండా వ్యూహాత్మక అడుగులు వేస్తోంది. జిల్లాలోని మొత్తం 10 అసెంబ్లీ నియోజకవర్గాల్లో 5 స్థానాల్లోనే ఇప్పటివరకు అభ్యర్థుల్ని ప్రకటించింది. మిగిలిన ఐదు స్థానాల్లో బలమైన అభ్యర్థుల కోసం అన్వేషణ చేస్తోంది. ఖమ్మం, పాలేరు నుంచి తుమ్మల, పొంగులేటిని వ్యూహాత్మకంగా రంగంలోకి దించింది. ఇద్దరు నేతలు పాత, కొత్త నాయకులను కలుపుకుంటూ రెండు నియోజకవర్గాల్లో ప్రచారం సాగిస్తున్నారు. అనూహ్యంగా ఖమ్మం నుంచి బరిలోకి దిగిన తుమ్మల నాగేశ్వరరావు అదే స్థాయిలో ప్రచారంలో స్పీడు పెంచారు.
"మళ్లీ అధికారంలోకి బీఆర్ఎస్ రావాలని ప్రజలు కోరుకుంటున్నారన్న విషయం ప్రజా ఆశీర్వాద సభల ద్వారా తెలుస్తోంది. కేసీఆర్ సభలకు పోటెత్తుతున్న ప్రజలను చూస్తుంటే మరోసారి బీఆర్ఎస్ను ఆశీర్వదించేందుకు వారంతా రెడీగా ఉన్నారని అర్థమవుతోంది. ఈ నెల 5వ తేదీన ఖమ్మం పట్టణంలో నిర్వహించనున్నాం. అదే రోజు కొత్తగూడెంలో కూడా సభ ఉంటుంది." - పువ్వాడ అజయ్ కుమార్, రవాణాశాఖ మంత్రి
Congress Election Campaign in Khammam 2023: పాలేరుకు ఆరు గ్యారంటీల పేరిట సరికొత్త నినాదంతో ప్రజల్లోకి వెళ్తున్న పొంగులేటి మద్దతు కూడగడుతున్నారు. సీఎల్పీ నేత భట్టి విక్రమార్క ఈనెల 4న ముదిగొండ నుంచి ఎన్నికల ప్రచారానికి శ్రీకారం చుట్టనున్నారు. భద్రాచలంలో పొదెం వీరయ్య, పినపాకలో పాయం వెంకటేశ్వర్లు ప్రచార పర్వం మొదలుపెట్టారు. అయితే.. మిగిలిన ఐదు స్థానాల్లో అభ్యర్థుల ప్రకటన(Congress MLA Candidate Release) రేపో, మాపో ఉంటుందంటూ ఊరిస్తున్నా.. అభ్యర్థిత్వాల లెక్కలు తేలకపోవడంతో నిరీక్షణ తప్పడం లేదు.