తెలంగాణ

telangana

ETV Bharat / state

ఎమ్మెల్సీ పోరు: ఊపందుకున్న ఓటరు నమోదు.. గెలుపు కోసం నేతల ఫీట్లు - ఖమ్మం జిల్లా వార్తలు

పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల పోరు రసవత్తరంగా మారుతోంది. వరంగల్-ఖమ్మం-నల్గొండ ఎమ్మెల్సీ ఎన్నికల కోసం రాజకీయ పక్షాలు వ్యూహప్రతివ్యూహాలు సిద్ధం చేసుకుంటున్నాయి. ప్రధాన పార్టీలైన తెరాస, కాంగ్రెస్‌, భాజపా నుంచి బరిలోకి దిగే అభ్యర్థుల ఎంపిక ఇంకా కొలిక్కి రాలేదు. అటు ఇతర పార్టీల నుంచి తలపడుతున్న అభ్యర్థులు గ్రాడ్యుయేట్లను ప్రసన్నం చేసుకునే పనిలో నిమగ్నమవడం వల్ల జిల్లాల్లో ఎన్నికల సందడి నెలకొంది.

ఎమ్మెల్సీ పోరు: ఊపందుకున్న ఓటరు నమోదు.. గెలుపు కోసం నేతల ఫీట్లు
ఎమ్మెల్సీ పోరు: ఊపందుకున్న ఓటరు నమోదు.. గెలుపు కోసం నేతల ఫీట్లు

By

Published : Oct 13, 2020, 6:24 AM IST

వరంగల్ -ఖమ్మం-నల్గొండ ఎమ్మెల్సీ పోరు రాజకీయ వేడి రాజేస్తోంది. ప్రధాన పార్టీలన్నీ ఎమ్మెల్సీ ఎన్నికను ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్నాయి. పట్టభద్రుల ఆశీర్వాదం పొందేందుకు ఇప్పటి నుంచే పావులు కదుపుతున్నాయి. అటు జిల్లాల్లో ఓటర్ల నమోదు ప్రక్రియ జోరుగా సాగుతుండడంతో... ఎన్నికల సందడి కనిపిస్తోంది. ఓటు నమోదు చేయించే నాటి నుంచే ఓటరును ప్రసన్నం చేసుకునేందుకు యత్నిస్తున్న రాజకీయ పార్టీలు.... ఆ ప్రక్రియలో తలమునకలయ్యాయి. పోటాపోటీగా ఓటరు నమోదు కార్యక్రమాలు నిర్వహిస్తున్నాయి. ఆన్‌లైన్‌తో పాటు ఆయా మండలాల తహసీల్దార్ కార్యాలయాల్లోనూ ఓటరు నమోదు దరఖాస్తులు స్వీకరిస్తుండటం వల్ల పట్టభద్రులు భారీగా తమ ఓటు హక్కు నమోదు చేసుకుంటున్నారు.

జోరుగా ఓటరు నమోదు

అక్టోబర్ 1 నుంచి ఓటరు నమోదు ప్రక్రియ ప్రారంభం కాగా... ఇప్పటి వరకు ఉమ్మడి జిల్లాల్లో కలిపి మొత్తం లక్షా 65 వేల 383 ఓటు దరఖాస్తులు నమోదయ్యాయి. వీటిలో ఆన్‌లైన్ ద్వారా లక్షా 38 వేల 618 మంది ఓటు హక్కు నమోదు చేసుకోగా... తహసీల్దార్ కార్యాలయాల్లో నేరుగా మరో 26 వేల 765 మంది ఓటు కోసం దరఖాస్తు చేసుకున్నారు. వీటిలో ఖమ్మం జిల్లాలో 26 వేల 754, భద్రాద్రి జిల్లాలో 14 వేల 456 మంది ఓటుహక్కు నమోదు చేసుకున్నారు.

మేధావులు, విద్యావంతులు, యువత, పట్టభద్రుల్ని తమవైపు తిప్పుకునేందుకు ఇప్పటి నుంచే ప్రధాన పార్టీలు ముమ్మరంగా ప్రయత్నిస్తున్నాయి. అధికార తెరాసతో పాటు కాంగ్రెస్, భాజపా, తెదేపా... నియోజకవర్గాలు, మండలాలు, గ్రామాల వారీగా కార్యాచరణ ప్రారంభించాయి. తెరాస అన్ని నియోజకవర్గాల్లో ఇప్పటికే సన్నాహక సమావేశాలు పూర్తి చేసి.... ఎక్కువ ఓట్లు నమోదు చేసుకునేలా గ్రామస్థాయిలో ఇంఛార్జీలను నియమించింది. సిట్టింగ్ ఎమ్మెల్సీగా ఉన్న పల్లా రాజేశ్వర్ రెడ్డి సైతం ఉమ్మడి జిల్లాలో విస్తృతంగా పర్యటిస్తున్నారు.

అభ్యర్థులపై రాని స్పష్టత

కాంగ్రెస్, భాజపా, తెదేపాలు ఇటీవలే ఎన్నికల సన్నాహక సమావేశాలను ప్రారంభించినప్పటికీ... ఇంకా బరిలోకి దిగే అభ్యర్థులెవరన్న అంశంపై స్పష్టత రాలేదు. ఈ ఎన్నికల్లో సత్తా చాటాలన్న సంకల్పంతో ఉమ్మడి అభ్యర్థిగా జయసారథిని రంగంలోకి దించుతున్నట్లు వామపక్షాలు ప్రకటించాయి. ఈ నెల 16 నుంచి ప్రచారం ప్రారంభించనున్నట్లు ప్రకటించాయి.

బరిలో దిగిన కోదండరాం... చెరుకు సుధాకర్​

తెలంగాణ రాజకీయ ఐకాస అధ్యక్షుడిగా తెలంగాణ ఉద్యమంలో క్రియాశీల పాత్ర పోషించిన ఆచార్య కోదండరాం.... ఈ ఎన్నికల ద్వారా తొలిసారి ప్రత్యక్ష ఎన్నికల్లో పోటీకి దిగుతున్నారు. గత అసెంబ్లీ ఎన్నికల్లో అనివార్య కారణాలతో ఆయన పోటీకి దూరంగా ఉన్నారు. పట్టభద్రుల స్థానం కావడం, మేధావులు, విద్యావంతులు ఓటు వేసే అవకాశమున్న నేపథ్యంలో.... కోదండరాం ఈ ఎన్నికల బరిలో నిలుస్తున్నారు. ఇప్పటికే ఉమ్మడి జిల్లాల వారీగా ప్రచారం ప్రారంభించారు. కాంగ్రెస్‌తో పాటు ఇతర పార్టీల మద్దతు కోరినప్పటికీ.... ఆ పార్టీల నుంచి సానుకూల స్పందనేమీ రాలేదు. తెలంగాణ ఇంటిపార్టీ నుంచి డాక్టర్ చెరుకు సుధాకర్ బరిలో నిలుస్తున్నట్లు ప్రకటించారు. ఉద్యమంలో పీడీ యాక్టు కేసు నమోదైన తొలి వ్యక్తిగా తనను గెలిపించాలంటూ ప్రచారం నిర్వహిస్తున్నారు. యువ తెలంగాణ పార్టీ ఉపాధ్యక్షురాలు రాణి రుద్రమ ఎన్నికల్లో పోటీకి దిగి ప్రచారాన్ని ప్రారంభించి నియోజకవర్గాలను చుట్టేస్తున్నారు. మరికొంత మంది స్వతంత్ర అభ్యర్థులు సైతం పోటీలో నిలుస్తున్నారు.

ఓటరు నమోదుకు విద్యావంతుల నుంచి భారీ స్పందన ఉండటంతో... ఈ ఎన్నికలు మరింత ఉత్కంఠ రేపుతున్నాయి. అన్ని పార్టీలు పూర్తిస్థాయిలో ప్రచార బరిలో దిగితే... మూడు ఉమ్మడి జిల్లాల్లో ఎన్నికల సందడి ఊపందుకోనుంది.

ఇదీ చూడండి:'రామలింగారెడ్డికి మంత్రి పదవి ఎందుకు ఇవ్వలేదు'

ABOUT THE AUTHOR

...view details