తెలంగాణ

telangana

ETV Bharat / state

ఖమ్మం పోరులో విజేత ఎవరు? - undefined

కాంగ్రెస్ నుంచి ఎక్కువ మంది టికెట్ కోసం పోటీ పడ్డ నియోజకవర్గం అది. కచ్చితంగా తమ ఖాతాలోనే పడుతుందని హస్తం పార్టీ లెక్కలేసుకుంది. లోక్​సభ పరిధిలో ఒక్కరే తెరాస ఎమ్మెల్యే గెలిచారు. పోరుపై ఉత్కంఠ రేపిన ఖమ్మం నియోజకవర్గంలో విజేత ఎవరు? మరి కొన్ని గంటల్లోనే అభ్యర్థుల భవితవ్యం తేలనుంది.

khammam

By

Published : May 22, 2019, 5:36 PM IST

ఖమ్మం పోరులో విజేత ఎవరు?

అనూహ్య ఫలితాలిచ్చే ఖమ్మం పార్లమెంట్ ఓటర్లు ఈ సారి ఎవరికి పట్టం కట్టారన్న అంశం సర్వాత్రా ఆసక్తి రేపుతోంది. 75 శాతం పోలింగ్ నమోదు కావడంతో... ఓటరు నాడి అంతుబట్టక రాజకీయ పార్టీలు ఫలితాలపై ఉత్కంఠతో ఎదురుచూస్తున్నాయి. ప్రధానంగా తెరాస-కాంగ్రెస్ మధ్యే పోరు సాగింది. అధికార పార్టీ తరఫున అనూహ్యంగా టికెట్ దక్కించుకుని బరిలో నిలిచిన నామ నాగేశ్వరరావు... గెలుపు తనదే అన్న ధీమాతో ఉన్నారు. ఫిరాయింపులు, ప్రభుత్వ వ్యతిరేకతే తనను గెలిపిస్తాయని కాంగ్రెస్ అభ్యర్థి రేణుకా చౌదరి విశ్వాసం వ్యక్తం చేస్తున్నారు.

వారి మద్దతు కలిసి వస్తుందా

అసెంబ్లీ ఎన్నికల్లో రాష్ట్రంలోనే ప్రభంజనం సృష్టించిన తెరాస... ఉమ్మడి ఖమ్మం జిల్లాలో కేవలం ఒక్క స్థానం మాత్రమే గెలిచింది. మారిన రాజకీయ పరిస్థితుల నేపథ్యంలో కాంగ్రెస్ నుంచి గెలిచిన పాలేరు, కొత్తగూడెం ఎమ్మెల్యేలు ఉపేందర్ రెడ్డి, వనమా వెంకటేశ్వరరావు, వైరా నుంచి స్వతంత్రంగా గెలిచిన రాములు నాయక్, సత్తుపల్లి తెదేపా ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్యలు గులాబీ తీర్థం పుచ్చుకుంటామని ప్రకటించడం, తమకు కలిసి వస్తాయని తెరాస ధీమాతో ఉంది.

పొంగులేటి వర్గం ప్రభావమెంత

అంతర్గత కుమ్ములాటలు తెరాసను కొంత ఆలోచనలో పడేస్తున్నాయి. సిట్టింగ్ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డికి టికెట్ రాకపోవడంపై గుర్రుగా ఉన్న ఆయన వర్గం... పార్టీ గెలుపు కోసం పనిచేసిందా లేదా అన్న అంశం సర్వత్రా ఆసక్తి రేపుతోంది. నామకు ఎంపీ పొంగులేటి మద్దతు ప్రకటించినప్పటికీ... ఆయన వర్గం ప్రచారంలో పూర్తిస్థాయిలో పాల్గొనకపోవడం ఆ పార్టీకి కొంత ప్రతికూలంగా ఉంది. ఆ ప్రభావం ఫలితాలపై ఎంతమేర ఉంటుందనేది ఉత్కంఠ రేపుతోంది. ఏదేమైనా... ఈసారి ఖమ్మం లోక్​సభ స్థానంపై తొలిసారిగా గులాబీ జెండా ఎగరడం ఖాయమని ఆ పార్టీ ధీమా వ్యక్తం చేస్తోంది.

ఫిరాయింపులే గెలిపిస్తాయని కాంగ్రెస్ ధీమా

నిశబ్దంగా సాగిన పోలింగ్ తమకే అనుకూలమని కాంగ్రెస్ లెక్కలు వేసుకుంటోంది. తాము ఓట్లేసి గెలిపించిన ఎమ్మెల్యేలు నెలలు కూడా గడవక ముందే... పార్టీ మారడం, ప్రజల తీర్పును అపహాస్యం చేయడం వంటి అంశాలు ప్రభావం చూపాయని కాంగ్రెస్ భావిస్తోంది. పార్టీ ఫిరాయింపులు, ప్రభుత్వ వ్యతిరేకతను తెలిపేందుకే ప్రజలు భారీగా పోలింగ్ కేంద్రాలకు తరలివచ్చి ఓటేశారని హస్తం నేతలు అంటున్నారు. ఖమ్మం ప్రజలు చరిత్రాత్మక తీర్పు ఇవ్వబోతున్నారని... ఆ తీర్పు కాంగ్రెస్​కు అనుకూలంగా ఉండబోతోందని రేణుకా చౌదరి ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.

సీపీఎం, భాజపా ఈ సారి ఆశించిన దానికంటే ఎక్కువ ఓట్లు వస్తాయని అంచనాలు వేస్తున్నాయి. ఇలా పార్టీలన్నీ ఎవరికి వారే వారి వారి అంచనాల్లో ఉన్నారు. జిల్లా ప్రజానీకంలోనూ లోక్​సభ గెలుపు ఎవరిదన్నదానిపై ఆసక్తికర చర్చ సాగుతోంది. అందరి ఉత్కంఠకు మరికొన్ని గంటల్లో తెరపడనుంది.

ఇదీ చూడండి: గుణాత్మక మార్పు ఉంటుందా!

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details