తెలంగాణ

telangana

ETV Bharat / state

ఎన్నికల రంగంలో పార్టీలు.. ఓటర్లను ప్రసన్నం చేసుకునేందుకు వ్యూహాలు - khammam graduate mlc elections

ఓ వైపు పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలు, మరోవైపు ముంచుకొస్తున్న ఖమ్మం బల్దియా ఎన్నికల పోరు.. వెరసి ఉమ్మడి ఖమ్మం జిల్లాలో ఎన్నికల వేడి క్రమంగా రాజుకుంటోంది. రాజకీయ పార్టీలన్నీ ఎన్నికల క్షేత్రంలోకి దిగేందుకు రంగం సిద్ధం చేసుకుంటున్నాయి. పట్టభద్రుల ఎమ్మెల్సీ పోరు కోసం పార్టీలన్నీ కార్యాచరణ మొదలుపెట్టి విద్యావంతులను ప్రసన్నం చేసుకునే పనిలో నిమగ్నమయ్యాయి. ఎమ్మెల్సీ ఎన్నికల ఓటరు నమోదు ప్రక్రియ పోటాపోటీగా చేపడుతున్నాయి. ఇక వచ్చే ఏడాది మార్చిలో జరిగే ఖమ్మం నగరపాలక పోరుకు అధికార, ప్రతిపక్ష పార్టీలన్నీ ఇప్పటి నుంచే వ్యూహరచన చేస్తున్నాయి. ఎన్నికల క్రతువులో ఓ అడుగు ముందంజలో ఉన్న అధికార తెరాస.. అంతర్గత సర్వేకు సైతం శ్రీకారం చుట్టింది.

khammam graduate mlc elections  2020
ఎన్నికల రంగంలో పార్టీలు.

By

Published : Oct 9, 2020, 2:11 PM IST

ఖమ్మం, భద్రాద్రి జిల్లాల్లో ఎన్నికల సందడి మొదలైంది. వరంగల్, ఖమ్మం, నల్గొండ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల కోసం రాజకీయ పక్షాలన్నీ కార్యాచరణ ముమ్మరం చేశాయి. అధికార పక్షం సహా ప్రతిపక్ష పార్టీలు తమ అభ్యర్థులను ప్రకటించకముందే.. రాజకీయ వేడి రాజుకుంది. ఇప్పటికే ఓటర్ల నమోదు ప్రక్రియ ప్రారంభం కాగా..అంతకుముందు నుంచే పట్టభద్రుల ఓట్ల కోసం పార్టీలన్నీ పోటాపోటీగా ప్రణాళికలు రచిస్తున్నాయి. ముఖ్యంగా ఓటరు నమోదుపై ప్రధానంగా దృష్టి సారిస్తున్నాయి. కొత్త ఓటర్ల జాబితా ఆధారంగా ఎన్నికలు జరగనున్నందున పట్టభద్రులతో గణనీయంగా ఓటు నమోదు చేయించే పనిలో పార్టీలన్నీ నిమగ్నమయ్యాయి. అధికార తెరాసతో పాటు కాంగ్రెస్, భాజపా, తెదేపా, వామపక్ష పార్టీలన్నీ విద్యావంతులను తమ వైపునకు తిప్పుకునేలా జిల్లా, నియోజకవర్గం, మండలం, గ్రామాల వారీగా కార్యాచరణ ప్రారంభించాయి.

ఓటరు నమోదుపై దృష్టి

తెరాస అన్ని నియోజకవర్గాల్లో ఇప్పటికే సన్నాహక సమావేశాలు పూర్తి చేసి ఎన్నికల బాధ్యతలను స్థానిక ఎమ్మెల్యేలకు అప్పగించింది. మంత్రి పువ్వాడ అజయ్ జిల్లా సమన్వయ బాధ్యతలు చూస్తున్నారు. ప్రధానంగా ఓటరు నమోదుపై ప్రత్యేక దృష్టి సారించి ఎక్కువ ఓట్లు నమోదు చేసుకునేలా గ్రామస్థాయిలో ఇంఛార్జీలను నియమించారు.

కాంగ్రెస్ పార్టీ ఇటీవలే ఎన్నికల సన్నాహక సమావేశాలు నిర్వహించింది. జిల్లాలో విస్తృతంగా పర్యటిస్తూ.. సీఎల్పీ నేత భట్టి విక్రమార్క ఎన్నికలకు పార్టీ నేతలను, శ్రేణుల్ని సన్నద్ధం చేస్తున్నారు. జిల్లా భాజపాకు ఇటీవలే కొత్త అధ్యక్షుని ప్రకటనతో ఆ పార్టీ కొత్త ఉత్సాహంతో ఎన్నికలకు సమాయత్తమవుతోంది. తెదేపా కూడా సన్నాహక సమావేశాలతో ఎన్నికలకు సై అంటోంది. వామపక్ష పార్టీలన్నీ ఈసారి సత్తా చాటాలన్న సంకల్పంతో పట్టభద్రుల ఎన్నికల కోసం కార్యక్షేత్రంలోకి దిగాయి.

బల్దియా పోరుకు పార్టీల సమాయత్తం

బల్దియా ఎన్నికల కోసం రాజకీయ పార్టీలన్నీ ఆరునెలల ముందు నుంచే సమాయత్తమవుతున్నాయి. ఎన్నికలు సమీపిస్తున్న వేళ ఎల్​ఆర్​ఎస్​లో ప్రభుత్వం పలు సడలింపులు చేయగా.. ప్రజలపై భారమంటూ ప్రతిపక్ష పార్టీలన్నీ ఆందోళనలు చేపట్టాయి. అధికార తెరాస ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని నగరంలో అభివృద్ధి పనులను మరింత వేగవంతం చేస్తోంది. ఆయా డివిజన్లలో పెండింగ్ లో ఉన్న రహదారుల నిర్మాణాలు, డ్రైన్ లు, విద్యుత్ దీపాలు, ఇతర అభివృద్ధి పనుల కోసం ప్రత్యేకంగా నిధులు కేటాయించి పనులు చేపడుతోంది.

ఆందోళనలు.. విమర్శలు

ఇక కాంగ్రెస్ తరపున సీఎల్పీ నేత భట్టి విక్రమార్క తరచూ సమావేశాలు ఏర్పాటు చేసి ఎన్నికలకు శ్రేణుల్ని సిద్ధం చేస్తున్నారు. ఇటీవల నగరంలోని రెండు పడక గదుల ఇళ్లను పరిశీలించి ప్రభుత్వం ఇచ్చిన హామీలు నెరవేర్చలేదంటూ విమర్శలు చేశారు. గోళ్లపాడు నిర్వాసితులతో కలిసి పలుమార్లు ఆందోళనలు చేపట్టిన భాజపా.. ఎన్నికల కార్యాచరణ మొదలుపెట్టింది. కొత్త జిల్లా అధ్యక్షుడి ఆధ్వర్యంలో త్వరలోనే నగర కమిటీలు ఏర్పాటు చేసి ఎన్నికలకు వెళ్లేలా వ్యూహాలు రూపొందిస్తోంది. తెదేపా కూడా కొత్త కమిటీలు వేసి పార్టీ శ్రేణుల్ని సన్నద్దం చేస్తోంది. సీపీఎం, సీపీఐ, న్యూడెమోక్రసీ నేతలంతా తరచూ ప్రజా సమస్యలపై ఆందోళనలు చేపడుతూ పార్టీల వారీగా శ్రేణుల్ని ఎన్నికల వైపు మళ్లిస్తున్నారు.

తెరాస అంతర్గత సర్వే

ఆరు నెలల ముందే ఖమ్మం నగరంలో ఎన్నికల హడావుడి మొదలైంది. మంత్రి పువ్వాడ అజయ్ ఈ ఎన్నికలపై ప్రత్యేక దృష్టి సారించి పార్టీని ముందుకు తీసుకెళ్తున్నారు. ఖమ్మం నగరంలో డివిజన్ల వారీగా సాగుతున్న అంతర్గత సర్వే ఎన్నికల వేడిని మరింత రాజేస్తోంది. ముఖ్యంగా తెరాస ప్రభుత్వ పనితీరు, పథకాల అమలు, డివిజన్ల వారీగా సాగుతున్న అభివృద్ధి, తెరాస పార్టీ పరిస్థితి, కార్పొరేటర్ల పనితీరు, కార్పొరేటర్ల వ్యక్తిగత ప్రవర్తన వంటి అంశాలపై సర్వే నిర్వహిస్తున్నట్లు తెలిసింది. నగరంలోని మొత్తం 50 డివిజన్ల వారీగా పలు రకాలుగా ఈ సర్వే కొనసాగుతోంది.

తెరాస అప్రమత్తం

అత్యంత గోప్యంగా సాగుతున్న ఈ సర్వే లో మహిళా ఓటర్ల ద్వారా ఎక్కవ వివరాలు సేకరిస్తున్నట్లు సమాచారం. ఆరునెలల ముందే ఈ సర్వే చేయడం ఉత్కంఠ రేపుతోంది. ఈ సర్వే ఆధారంగా ముఖ్యంగా పార్టీ కార్పొరేటర్ల పనితీరు అంచనా వేయొచ్చని తెరాస భావిస్తున్నట్లు తెలుస్తోంది. ఎవరెవరికి సర్వే అనుకూలంగా ఉంది. ఏయే డివిజన్లలలో ప్రతికూలంగా ఉందని తెలిస్తే.. సర్వే ఆధారంగా తెరాస ముందే అప్రమత్తమయ్యే అవకాశం కనిపిస్తోంది.

ABOUT THE AUTHOR

...view details