Khammam district students in Ukraine: ఉక్రెయిన్‌లో చిక్కుకుపోయిన తెలుగు విద్యార్థుల పరిస్థితి అత్యంత దయనీయంగా ఉంది. ఉన్నత చదువులు, ఉపాధి కోసం వెళ్లి.. యుద్ధ వాతావరణంలో చిక్కుకుని విలవిల్లాడుతున్నారు. ఉమ్మడి ఖమ్మం జిల్లా వ్యాప్తంగా పలువురు విద్యార్థులు, యువత.. వైద్య విద్య, ఉద్యోగాల కోసం ఉక్రెయిన్‌కు తరలివెళ్లారు. ప్రస్తుత పరిస్థితుల్లో స్వదేశానికి తరలివచ్చే మార్గం లేక.. అక్కడ సరైన సమాచారం ఇచ్చే వారు లేక అవస్థలు ఎదుర్కొంటున్నారు. గురువారం రాత్రి నుంచి నిద్రాహారాలు కరవై భయభయంగా కాలం వెళ్లదీస్తున్నారు.
తల్లిదండ్రుల ఆందోళన
ఖమ్మం జిల్లా తిరుమలయపాలెం మండలం మెడిదపల్లి పాలెం గ్రామానికి చెందిన రావుల మహేశ్ రెడ్డి.. ఆరు నెలల క్రితం హోటల్ మేనేజ్మెంట్ కోసం ఉక్రెయిన్ వెళ్లారు. ఉక్రెయిన్ మీద యుద్ధ మేఘాలు కమ్ముుకోవడంతో.. మహేశ్ తల్లిదండ్రులు ఉపేందర్ రెడ్డి, వెంకట నర్సమ్మ ఆందోళన చెందుతున్నారు. తమ కుమారుడిని క్షేమంగా ఇంటికి తీసుకురావాలని ఫిర్యాదు చేశారు. తమ కుమారుడిని క్షేమంగా ఇంటికి చేర్చేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు తగిన చర్యలు చేపట్టాలని మీడియాతో వేడుకున్నారు.
ఉక్రెయిన్‌లో భీకర పరిస్థితులతో ఆందోళన చెందుతున్నట్లు మహేశ్ సెల్ఫీ వీడియోలో వివరించారు. త్వరగా భారత ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని వేడుకున్నారు.
'గురువారం రాత్రి ఒడిశాలో క్లిష్ట పరిస్థితులు ఉండటంతో.. రైల్లో లెవీకి తరలివచ్చాం. ఇక్కడి నుంచి రవాణా సౌకర్యం ఉందన్నారు. కానీ ఇక్కడికి వచ్చాక మాకు ఎటువంటి సదుపాయాలు కల్పించడం లేదు. ఇక్కడ తలదాచుకోవడానికి కూడా స్థలం లేకపోవడంతో.. ఏం చేయాలో పాలుపోవడం లేదు. కనీసం క్యాబ్‌లు కూడా నడవడం లేదు. దాదాపు 300 మంది వరకు ఇక్కడే చిక్కుకుపోయాం. ఈ విషయంపై ఇండియన్ ఎంబసీ స్పందించి.. మమ్మల్ని త్వరగా స్వదేశానికి తరలించాలని వేడుకుంటున్నాం.' -మహేశ్, బాధితుడు