Khammam District Election Results 2023 : ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని 10 అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఓటరు తీర్పు ఎలా ఉండబోతుందన్నది రాజకీయ వర్గాల్లోనే కాకుండా జిల్లావ్యాప్తంగా ఆసక్తికరమైన చర్చకు దారి తీస్తోంది. ప్రధాన పార్టీలు, అభ్యర్థులు అత్యంత ప్రతిష్టాత్మంగా తీసుకున్న ఈ ఎన్నికల తీర్పు ఆదివారం వెల్లడికానుంది. ఓటరు మహాశయులు ఎవరివైపు మొగ్గు చూపారన్నది ఉత్కంఠ రేపుతోంది. నియోజకవర్గాల్లో గత ఎన్నికలతో పోలిస్తే.. ఈసారి పోలింగ్ శాతం తగ్గడం అభ్యర్థుల్ని కలవరపెడుతోంది. ఉమ్మడి ఖమ్మం జిల్లాలో 8 చోట్ల ద్విముఖ పోరు, మరో రెండు స్థానాల్లో త్రిముఖ పోరు కనిపిస్తోంది.
Polling Percentage In Khammam : ప్రధాన పార్టీలు, అభ్యర్థులు గెలుపు లెక్కలు వేసుకుంటున్నారు. నియోజకవర్గాల వారీగా పోలైన ఓట్లు, పోలింగ్ శాతంపై సమీక్షస్తున్నారు. పోలింగ్ బూత్‌ల వారీగా నాయకులు, ఇంఛార్జీలతో ఎడతెగని చర్చలు జరుపుతున్నారు. ఓటర్లను పోలింగ్ కేంద్రాలకు తీసుకొచ్చేందుకు అన్ని రకాల ప్రయత్నాలు చేసినప్పటికీ.. గత ఎన్నికల కన్నా ఈసారి తక్కువే పోలింగ్ నమోదు కావడంతో ప్రధాన పార్టీల అభ్యర్థుల్ని కలవరానికి గురిచేస్తోంది. తగ్గిన పోలింగ్ శాతం ప్రభావం తమపై ఏమైనా పడుతుందన్న భయం వెంటాడుతోంది.
గెలిచిన పార్టీకి హామీల అమలు కత్తిమీద సామే - అవసరాలకు తగిన రీతిలో ఆర్థిక రథాన్ని నడిపించడమెలా?
Paleru Election Results 2023 : బీఆర్ఎస్, కాంగ్రెస్ ముఖ్యనేతలతోపాటు సీపీఎం, సీపీఐ రాష్ట్ర కార్యదర్శులు తమ్మినేని వీరభద్రం, కూనంనేని సాంబశివరావు.. ఉమ్మడి ఖమ్మం జిల్లా నుంచి అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు. ఖమ్మం నియోజకవర్గం రాష్ట్రంలోనే అత్యంత హాట్ సీటుగా మారింది. ఇక్కడ బీఆర్ఎస్-కాంగ్రెస్ ఢీ అంటే ఢీ అన్నాయి. పువ్వాడ అజయ్-తుమ్మల నాగేశ్వరరావులో ఎవరుపై చేయి సాధిస్తారన్న అంశం సర్వత్రా ఉత్కంఠ రేపుతోంది. త్రిముఖ పోరు నెలకొన్న పాలేరు తీర్పు ఆసక్తికరంగా మారింది.
బీఆర్ఎస్ నుంచి కందాల ఉపేందర్ రెడ్డి, కాంగ్రెస్ నుంచి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, సీపీఎం నుంచి తమ్మినేని వీరభద్రం బరిలో ఉండగా.. విజయం ఎవరి వైపు నిలుస్తుందన్న అంశాలపై ఎవరికి వారే ధీమాతో ఉన్నారు. ప్రధాన పోటీ బీఆర్ఎస్-కాంగ్రెస్ మధ్య ఉన్నట్లు పోలింగ్ తీరు స్పష్టం చేస్తుంది. అయితే.. సీపీఎం చీల్చిన ఓట్లు ఎవరికి లాభం, ఎవరికి నష్టం అన్నదే ఇక్కడ ప్రధాన అంశం. వైరాలో ద్విముఖ పోరులో బీఆర్ఎస్ అభ్యర్థి మదన్‌లాల్, కాంగ్రెస్ అభ్యర్థి రాందాస్ నాయక్ ఎవరికి వారు గెలుపుపై ధీమాతో ఉన్నారు. కాంగ్రెస్ కార్యకర్తలు అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకోవడంతో ఇక్కడ గెలుపు వరిస్తుందని కాంగ్రెస్ భావిస్తుంది.