ఖమ్మం జిల్లా కేంద్ర సహకార బ్యాంకు-(డీసీసీబీ) సేవల చరిత్ర వందేళ్ల మైలురాయికి చేరింది. 1920 డిసెంబర్ 24న రామనారాయణ వ్యవస్థాపకుడిగా బ్యాంకు ఏర్పాటైంది. నిజాం కాలంలో అంజుమన్ బ్యాంకుగా ఖమ్మం బ్యాంకు ప్రాచుర్యంలో ఉండేది. రైతులకు విశేష సేవలు అందించేందుకు.. జాతీయ చట్టం 1904 ప్రకారం బ్యాంకును స్థాపించారు. గ్రామీణ రైతులకు పరపతి సేవలను అందించి... వారి వ్యవసాయ అవసరాలకు పెట్టుబడి పెట్టడమే దీని ముఖ్య ఉద్దేశం.
వందేళ్లుగా అన్నదాతకు దన్ను.. ఖమ్మం డీసీసీబీ - telangana news
వందేళ్లు పూర్తిచేసుకున్న ఖమ్మం జిల్లా కేంద్ర సహకార బ్యాంకు .. ఇంతింతై వటుడింతై అన్నట్లుగా అనేక మైలురాళ్లను అధిగమిస్తూ సాగుతోంది. దాదాపు 3 లక్షల మంది అన్నదాతలకు అనేక రకాలుగా సేవలందిస్తూ.. రెండున్నర వేల కోట్ల టర్నోవర్‌తో రాష్ట్రంలోనే రెండోస్థానంలో నిలిచింది.
1987 వరకు స్వల్పకాలిక అవసరాల కోసం కో-ఆపరేటివ్ బ్యాంకుల ద్వారా దీర్ఘకాలిక రుణాలను భూమి తనఖా బ్యాంకుల ద్వారా ఇచ్చేవి. జిల్లాకో బ్యాంకు అనే లక్ష్యంతో రాజమండ్రి కో-ఆపరేటివ్ బ్యాంకులో భాగంగా ఉన్న కూనవరం, కుక్కునూరు, భద్రాచలం, చర్ల, వెంకటాపురం బ్రాంచ్లను కూడా విలీనం చేయగా.. మొత్తం 22 శాఖలతో ప్రజలకు డీసీసీబీ సేవలందించింది.
పాలకవర్గాల చొరవతో జిల్లాలోని అన్ని మండల కేంద్రాల్లో శాఖలను ఏర్పాటు చేసి ప్రస్తుతం 50 శాఖల ద్వారా డీసీసీబీ సేవలు అందిస్తోంది. ఖమ్మం జిల్లాలోని 76 సహకార సంఘాలు, భద్రాద్రిలోని 21 సహకార సంఘాలు, మహబూబాబాద్ జిల్లాలోని 2 సహకార సంఘాలు ప్రస్తుతం ఖమ్మం డీసీసీబీ పరిధిలో ఉన్నాయి. వందేళ్ల స్ఫూర్తితో రైతులకు మరింత దన్నుగా ఉండేలా బ్యాంకును తీర్చిదిద్దాలన్న లక్ష్యంతో పాలకవర్గం ముందుకెళ్తోంది. ఖమ్మం డీసీసీబీ ఈ శతాబ్ద కాలంలో ఎందరినో రాజకీయ నేతలుగా తీర్చిదిద్దింది.
- ఇదీ చూడండి :గోల్డ్ బాండ్లు ఇలా కొంటే డబ్బు ఆదా...