Congress Leaders fires on BRS : ఖమ్మంలో నిర్వహిస్తున్న కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ సభకు జనాన్ని రాకుండా అడ్డుకుంటున్నారని ఆ పార్టీ నేతలు ఆరోపిస్తున్నారు. ఉమ్మడి ఖమ్మం జిల్లాలో పోలీసులు, రెవెన్యూ అధికారుల తనిఖీలు చేస్తున్నారని.. కాంగ్రెస్ సభకు వస్తున్న వాహనాల్ని అడ్డుకుంటున్నారని విమర్శించారు. వాహనాలకు సరైన ధ్రువపత్రాలు లేవని జప్తు చేస్తున్నారని కాంగ్రెస్ నేతలు అంటున్నారు. ఆర్టీసీ బస్సుల్ని బుక్ చేస్తే ఇవ్వలేదని... ప్రైవేటు వాహనాల్లో వస్తుంటే.... తనిఖీల పేరిట జప్తు చేస్తున్నారని మండిపడ్డారు.
Revanthreddy Complaint to DGP on Khammam Police : ఖమ్మం సభకు రాకుండా కాంగ్రెస్ శ్రేణులు, ప్రజల్ని పోలీసులు అడ్డుకుంటున్నారని డీజీపీ అంజనీకుమార్‌కు కాంగ్రెస్ ఫిర్యాదు చేసింది. ఈ మేరకు డీజీపీతో పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి, ప్రచార కమిటీ ఛైర్మన్ మధుయాస్కీ మాట్లాడారు. పోలీసుల తీరుపైరేవంత్ రెడ్డి తీవ్ర నిరసన వ్యక్తం చేశారు. గ్రామాల నుంచి సభకు బయలుదేరిన వాహనాలను అడ్డుకోవడంపై ఆందోళన వ్యక్తం చేశారు. పోలీసులు అత్యుత్సాహం ప్రదర్శిస్తున్నారని రేవంత్ అన్నారు. సభకు వచ్చే వాహనాలు, కాంగ్రెస్ శ్రేణులను అడ్డుకోకుండా ఆదేశాలివ్వాలని డీజీపీకి విజ్ఞప్తి చేశారు. అడ్డుగోడలు దాటుకునైనా సభను విజయవంతం చేస్తామని మధుయాస్కీ స్పష్టం చేశారు. సభకు వెళ్లే వాహనాలను అడ్డుకోకుండా ఆదేశాలిస్తామని డీజీపీ అంజనీకుమార్ రేవంత్‌రెడ్డికి తెలిపారు.
Khammam Congress Meeting :కాంగ్రెస్‌కు వస్తున్న ఆదరణను చూసి ఓర్వలేకే ఇలా చేస్తున్నారని ఆ పార్టీ నేత రేణుకా చౌదరి ఆరోపించారు.ఖమ్మం సభ అంటే బీఆర్ఎస్ నేతలు వణికిపోతున్నారన్న ఆమె... పోలీసులు బీఆర్ఎస్ కార్యకర్తల్లా ప్రవర్తిస్తున్నారని మండిపడ్డారు. ఆర్టీసీ బస్సులు ఇస్తే ఎంత.. ఇవ్వకపోతే ఎంత.. తమ పార్టీ కార్యకర్తలు నడిచైనా సరే సభకు వస్తారని వ్యాఖ్యానించారు. పోలీసులు బీఆర్ఎస్ ప్రైవేటు సైన్యంలా వ్యవహరించడం సరికాదని... కాంగ్రెస్ ఎమ్మెల్యేలు శ్రీధర్‌బాబు, సీతక్క ఖండించారు.