తెలంగాణ

telangana

ETV Bharat / state

డిజిటల్‌ చెల్లింపుల జిల్లాగా ఖమ్మం... అక్టోబర్​లోపు పూర్తి చేయాలని లక్ష్యం - rbi comments on digital transactions

రాష్ట్రంలో నగదు లావాదేవీలను తగ్గించి డిజిటల్‌ లావాదేవీలను పెంచడంపై ప్రభుత్వం దృష్టి సారించింది. మూడు నెలలకు ఒకసారి డిజిటల్‌ లావాదేవీల స్థితిగతుల పరిశీలన కోసం రాష్ట్ర స్థాయి బ్యాంకర్ల కమిటీ ప్రత్యేకంగా సబ్‌ కమిటీని ఏర్పాటు చేసింది. ఈ ఏడాది అక్టోబరు నాటికి ఖమ్మంను పూర్తి స్థాయి డిజిటల్‌ జిల్లాగా మార్చాలని ఎస్​ఎల్​బీసీ నిర్ణయించింది.

khammam become as digital transactions district after october said rbi
khammam become as digital transactions district after october said rbi

By

Published : Aug 11, 2020, 4:09 AM IST

డిజిటల్‌ చెల్లింపుల జిల్లాగా ఖమ్మం... అక్టోబర్​లోపు పూర్తి చేయాలని లక్ష్యం

పెద్ద నోట్లు రద్దు తరువాత క్రమంగా దేశంలో నగదు లావాదేవీలు తగ్గించి, డిజిటల్‌ లావాదేవీలను పెంచేలా కేంద్ర ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది. ఇందులో భాగంగా రాష్ట్రంలో గతేడాది సెప్టెంబరు 30న జరిగిన ఎస్​ఎల్​బీసీ సమావేశం డిజిటల్‌ లావాదేవీలు పెంచడంపైనే ప్రత్యేకంగా చర్చించింది.

సమస్యల పరిష్కారం కోసం ఉపకమిటీ...

ఈ ఏడాది అక్టోబరు నాటికి ఖమ్మంను పూర్తి డిజిటల్‌ లావాదేవీల జిల్లాగా మార్చాలని లక్ష్యంగా నిర్దేశించుకుంది. ఆ మేరకు అన్ని ప్రభుత్వ, ప్రభుత్వేతర, గ్రామీణ, సహకార బ్యాంకులకు లక్ష్యాన్ని పూర్తి చేసేందుకు కృషి చేయాలని ఎస్​ఎల్​బీసీ స్పష్టం చేసింది. ఇందుకోసం ప్రతి బ్యాంకుకు ఓ నోడల్‌ అధికారిని నియమించి ఖమ్మం జిల్లా లీడ్‌ బ్యాంకు మేనేజర్‌కు అనుసంధానం చేసింది. డిజిటల్‌ లావాదేవీలు వంద శాతం పూర్తి చేసే బాధ్యతను భారతీయ స్టేట్‌ బ్యాంకు తీసుకుంది. అన్ని బ్యాంకుల... బ్రాంచీల వారీగా వ్యాపార, వాణిజ్య సంస్థలను, సర్వీసు ప్రొవైడర్లను గుర్తించి పూర్తిస్థాయిలో సర్వే చేసింది. మౌలిక వసతులు లేకపోవడం, ఇతరత్రా సమస్యలు ఉత్పన్నమైనప్పుడు ఉపకమిటీ వాటి పరిష్కారానికి చర్యలు తీసుకుంటుంది.

ప్రయత్నంలో పురోగతి...

ఖమ్మంను వందశాతం డిజిటల్‌ లావాదేవీల జిల్లాగా మార్చే ప్రయత్నాలకు సంబంధించి ఎస్​ఎల్​బీసీ ఆరు నెలల పురోగతిని ఆర్బీఐకి నివేదించింది. ఖమ్మం జిల్లాలో గత ఏడాది సెప్టెంబరు నాటికి 25.30 లక్షల పొదుపు ఖాతాలు, 31,305 కరెంట్‌ ఖాతాలు ఉండగా.... ఈ ఏడాది మార్చి చివరినాటికి 25.54 లక్షల సేవింగ్స్‌, 39,455కు కరెంట్‌ ఖాతాలు ఉన్నట్లు పేర్కొంది. అందులో ఈ ఏడాది మార్చి చివరికి 64.03శాతం 16.35లక్షల సేవింగ్‌ ఖాతాదారులకు బ్యాంకులు రూపే డెబిట్‌ కార్డులు ఇచ్చాయి. 10.56శాతం ఖాతాదారులకు నెట్‌ బ్యాంకింగ్‌, మరో 12.38శాతం ఖాతాదారులకు మొబైల్‌ బ్యాంకింగ్‌ సౌకర్యం ఉన్నట్లు వెల్లడించాయి. కరెంటు ఖాతాల్లో 25.17 శాతం ఖాతాదారులకు నెట్‌ బ్యాంకింగ్‌, 10.88శాతం ఖాతాదారులకు పాయింట్‌ ఆఫ్‌ సేల్స్‌, క్యూఆర్‌ కోడ్‌ కవరేజి చేసినట్లు వెల్లడించారు. మార్చి చివరికి 2వేల 461 మంది వ్యాపార, వాణిజ్య సంస్థలకు పాయింట్‌ ఆఫ్‌ సేల్స్‌ మిషన్లు, క్యూఆర్‌ కోడ్ సౌకర్యం కల్పించాయి.

మూడు నెలలకోసారి ప్రగతి నివేదికలు...

రాష్ట్రంలో నగదు లావాదేవీలు తగ్గించి...డిజిటల్‌ లావాదేవీలు పెంచాలని రిజర్వ్‌ బ్యాంకు ఆఫ్‌ ఇండియా ఈ ఏడాది జనవరి 23న బ్యాంకర్లకు లేఖ రాసింది. రాష్ట్రవ్యాప్తంగా నెట్‌ బ్యాంకింగ్‌, మొబైల్‌ బ్యాంకింగ్‌, యూపీఐ పెనట్రేషన్‌, పాయింట్‌ ఆఫ్‌ సేల్స్‌, క్యూఆర్‌ కోడ్‌ తదితర వాటిని మరింత ప్రోత్సహించి పెంచాల్సి ఉందని పేర్కొంది. ప్రతి మూడు నెలలకు ఒకసారి బ్యాంకులు డిజిటల్‌ లావాదేవీలు పెంపు ప్రగతిపై నివేదికలు ఇవ్వాలని ఆర్బీఐ స్పష్టం చేసింది. ఎస్​ఎల్​బీసీ సబ్‌ కమిటీ డిజిటల్‌ లావాదేవీలు పెంచేందుకు తీవ్రంగా కృషి చేస్తోంది. ఇందుకు సంబంధించి ఆర్బీఐ మార్గదర్శకాలను బ్యాంకర్లకు పంపించి ఎప్పటికప్పుడు సమీక్షిస్తూ సలహాలు, సూచనలు అందిస్తోంది.

ఇవీచూడండి:ఐఐటీ విద్యార్థినికి మంత్రి కేటీఆర్ చేయూత

ABOUT THE AUTHOR

...view details