KCR Fires on BJP and Congress: భారత్ అన్ని విధాలా సుసంపన్నమైన దేశం అని సీఎం కేసీఆర్ పేర్కొన్నారు. జలవనరులు, సాగు భూమి విషయంలో మన దేశమే అగ్రగామిగా ఉందని తెలిపారు. కానీ కెనడా నుంచి కందిపప్పు దిగుమతి సిగ్గుచేటు కాదా అని ప్రశ్నించారు. దేశంలో 70 వేల టీఎంసీలు అందుబాటులో ఉన్నాయని చెప్పారు. కేవలం 20 వేల టీఎంసీలు మాత్రమే వాడుకుంటున్నామని అన్నారు. దేశానికి నిర్దిష్ట లక్ష్యం లేకుండా పోయిందని విమర్శించారు. ఖమ్మం బీఆర్ఎస్ బహిరంగ సభలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.
దేశంలో చైతన్యం తెచ్చేందుకు పుట్టిందే బీఆర్ఎస్:జింబాబ్వేలో 6 వేల టీఎంసీల సామర్థ్యం గల రిజర్వాయర్ ఉందని కేసీఆర్ అన్నారు. చైనాలో 5 వేల టీఎంసీల సామర్థ్యం గల రిజర్వాయర్ ఉందని పేర్కొన్నారు. కానీ దేశంలో అతిపెద్దదైన ఒక్క రిజర్వాయర్ ఉందా అని కేసీఆర్ ప్రశ్నించారు. దేశంలో చైతన్యం తెచ్చేందుకు పుట్టిందే బీఆర్ఎస్ అని స్పష్టం చేశారు. బకెట్ నీళ్ల కోసం చెన్నై నగరం అర్రులు చాచాలా అని ప్రశ్నించారు. రాష్ట్రాల మధ్య నీటి యుద్ధాల అవసరం ఎందుకు వచ్చిందని కేసీఆర్ నిలదీశారు.
చాటలో తవుడు పోసి.. కుక్కల కొట్లాట: కేంద్ర వైఖరి చాటలో తవుడు పోసి.. కుక్కల కొట్లాట పెట్టినట్లుందిగా తయారైందని కేసీఆర్ విమర్శించారు. డొల్ల మాటలు, కల్ల మాటలతో పొద్దుపుచ్చే పరిపాలన అని మండిపడ్డారు. దేశ దుస్థితికి కాంగ్రెస్, బీజేపీనే కారణమని ధ్వజమెత్తారు. కాంగ్రెస్ అధికారంలో ఉంటే బీజేపీని తిడుతుందని .. బీజేపీ అధికారంలో ఉంటే కాంగ్రెస్‌ను తిడుతుందని ఆరోపించారు. దేశంలో 4.10 లక్షల మెగావాట్ల విద్యుత్ సామర్థ్యం ఉందని.. ఎప్పుడూ 2 లక్షల మెగావాట్ల విద్యుత్‌కు మించి వాడలేదని పేర్కొన్నారు. రోజూ వేలాది రైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్నందుకు సిగ్గుపడాలని దుయ్యబట్టారు. ఎన్‌పీఏల పేరుతో రూ.14 లక్షల కోట్లు దోచిపెట్టారని కేసీఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారు.