తెలంగాణ

telangana

ETV Bharat / state

రాష్ట్రానికి ఏపీ తీరని అన్యాయం చేస్తోంది: ఎమ్మెల్యే సండ్ర - కల్యాణ లక్ష్మి చెక్కులు పంపిణీ చేసిన ఎమ్మెల్యే సండ్రా వెంకట వీరయ్య

రాష్ట్ర జల హక్కులను కాపాడుకునేందుకు సీఎం కేసీఆర్ చేస్తోన్న పోరాటంలో ప్రజలంతా అండగా నిలవాలని సత్తుపల్లి ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్య అన్నారు. ఖమ్మం జిల్లాలోని తల్లాడ మండల కేంద్రంలో నిర్వహించిన ఓ కార్యక్రమంలో పాల్గొన్న ఆయన పలువురు లబ్దిదారులకు కల్యాణ లక్ష్మి చెక్కులను పంపిణీ చేశారు.

Sattupalli MLA Sandra Ventaka Virayya distributed Kalyana Lakshmi checks
ఏపీ ప్రభుత్వంపై మండిపడ్డ సత్తుపల్లి ఎమ్మెల్యే

By

Published : Jun 26, 2021, 5:21 PM IST

నదీ జలాల ఒప్పందానికి విరుద్ధంగా కృష్ణాజలాల విషయంలో ఏపీ ప్రభుత్వం రాష్ట్రానికి తీరని అన్యాయం చేస్తోందని సత్తుపల్లి ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్య ఆరోపించారు. ఖమ్మం జిల్లా తల్లాడ మండల కేంద్రంలో నిర్వహించిన ఓ కార్యక్రమంలో పాల్గొన్న ఆయన 108 మంది లబ్దిదారులకు కల్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ చెక్కులను పంపిణీ చేశారు.

కేంద్రం ప్రేక్షకపాత్ర వహిస్తోంది

ఇప్పటికే కర్నాటక ప్రభుత్వం ఆల్మట్టి ప్రాజెక్టు నిర్మాణం చేపట్టి దిగువన ఉన్న ఏపీ, తెలంగాణకు నీటిని రాకుండా చేసిందని ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్య తెలిపారు. దీనిని అడ్డుకునేందుకు రెండు తెలుగు రాష్టాల ముఖ్యమంత్రులు సమస్టిగా కృషి చేయాల్సిన ఈ సమయంలో రాయసీమ ఎత్తిపోతల ప్రాజెక్టు పేరుతో ఏపీ ప్రభుత్వం మరో వివాదానికి తెరలేపిందని ఆరోపించారు. జాతీయ హరిత ట్రిబ్యునల్ ఇచ్చిన తీర్పును కూడా పట్టించుకోకుండా అధికారులు రాత్రికి రాత్రే నిర్మాణాలు చేపడుతున్నారని మండిపడ్డారు. ఈ విషయంపై స్పందించాల్సిన కేంద్ర ప్రభుత్వం ప్రేక్షకపాత్ర వహిస్తోందని విమర్శించారు.

కొద్దిపాటి నీరు కూడా రాదు

రెండు తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు చర్చలతో తేల్చుకోవాల్సిన కృష్ణాజలాల విషయంలో ఏపీ సీఎం జగన్మోహన్‌ రెడ్డి మూర్ఖంగా వ్యవహరిస్తున్నాని ఎమ్మెల్యే సండ్ర ఆరోపించారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్​లో​ మాజీ ముఖ్యమంత్రి వైఎస్‌ రాజశేఖర రెడ్డి జల దోపిడి చేశారన్న ఆయన ప్రస్తుతం ఏపీ ప్రభుత్వం కూడా అదే ధోరణిని ప్రదర్శిస్తోందని మండిపడ్డారు. ఈ చర్యల వల్ల ప్రధానంగా కృష్ణ జలాలపై ఆధారపడుతోన్న నల్గొండ, ఖమ్మం జిల్లాల రైతులకు తీరని అన్యాయం జరుగుతుందని పేర్కొన్నారు. ఆల్మట్టి ప్రాజెక్టు కారణంగా వర్షాలు లేని సమయంలో మూడేళ్ల పాటు కృష్ణ జలాలు రాని పరిస్థితి చూశామన్న ఎమ్మెల్యే రాయలసీమ ఎత్తిపోతల ప్రాజెక్టును నిర్మిస్తే.. వచ్చే కొద్దిపాటి నీటిని కూడా కోల్పోతామని ఆవేదన వ్యక్తం చేశారు.

కుట్రలను తిప్పికొట్టేందుకు సిద్దంగా ఉండాలి

రాష్ట్రానికి నీటి కొరత రాకూడదనే ఉద్దేశంతో ప్రభుత్వం కాళేశ్వరం, సీతారామ ప్రాజెక్టుల ద్వారా గోదావరి జలాలను మళ్లిస్తూ.. ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేస్తోందని ఎమ్మెల్యే సండ్ర తెలిపారు. ఏపీ ప్రభుత్వ కుట్రలను తిప్పికొట్టేందుకు రైతులంతా సిద్దంగా ఉండాలని ఆయన పిలుపునిచ్చారు. తెలంగాణకు అన్యాయం జరిగే విధంగా జగన్​ సర్కారు రూపొందిచిన జీఓను వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేశారు. జలాల విషయంలో రెండు రాష్ట్రాల మధ్య ఘర్షణ వాతావరణం నెలకొంటే రాష్టంలోని భాజపా నేతలు ప్రధాని దృష్టికి ఎందుకు తీసుకెళ్లడంలేదని ప్రశ్నించారు. ఈ కార్యక్రమంలో డీసీఎంఎస్‌ ఛైర్మన్‌ రాయల వెంకట శేషగిరిరావు, ఎంపీపీ దొడ్డా శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు.

ఇదీ చదవండి:Uttam Kumar Reddy: కేసీఆర్ ప్రభుత్వంలో ఎస్సీ, ఎస్టీలు మోసపోతున్నారు: ఉత్తమ్

ABOUT THE AUTHOR

...view details