అమ్మ ఒడిలో హాయిగా నిద్రించాల్సిన పసి మొగ్గలు... ఖమ్మం జిల్లా పోడు భూముల కేసులో న్యాయస్థానంలో తమ తల్లులతో పాటు గంట పాటు నిరీక్షించారు. గుక్కపెట్టి ఏడ్చారు. చివరికి తల్లులతో పాటే జైలుకు వెళ్లారు. సాక్షాత్తూ తల్లిపాల వారోత్సవాల ముగింపు సందర్భంలో శుక్రవారం ఖమ్మం కోర్టు ఆవరణలో ఈ దృశ్యం కనిపించింది. ఖమ్మం జిల్లా కొణిజర్ల మండలం ఎల్లన్ననగర్ పోడు భూములకు సంబంధించి అటవీ శాఖ అధికారుల ఫిర్యాదు మేరకు పోలీసులు పలువురిపై వివిధ సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు. దీనికి సంబంధించి పోలీసులు కొందరిని గురువారం రిమాండ్‌కు తరలించారు. శుక్రవారం మధ్యాహ్నం మరో 9 మంది మహిళలను నిందితులుగా పేర్కొంటూ జ్యుడిషియల్ రిమాండ్‌కు తరలించారు. ఇందులో ముగ్గురు చంటి పిల్లల తల్లులు ఉన్నారు.
కేసీఆర్కు నాయం అనిపిస్తాందా..!
మాయి అడవి భూములు. అవి నరుక్కోని చేన్లు ఎసినము. చేన్లేస్తే... అవి పత్తి సేన్లు. మనిషికి ముప్పై గుంటలు ఏశినం. మొత్తం ఊడబీకారు. మరి మేమెట్ల బతకాలి. మా పిల్లలు మేము. కేసీఆర్కు నాయం అనిపిస్తాందా..! వద్దని కాళ్లమీద పడ్డాను. నెట్టేసారు నన్నే. - మౌనిక, బాధితురాలు
మా పిల్లలన్నా మంచిగ బతకాలి..
మా శేను మాకు కావాలంటే... మా మీద దాడి చేశినారు. మా శేనంతా పీకేశినారు. అయిదారెకరాలు. మాకు పిల్లలున్నరు కాబట్టి, మేమిట్ల బతుకుతున్నం కాబట్టి... మా పిల్లలన్నా మంచిగ బతకాలి. మా భూమి మాకొచ్చేటట్టు కావాలి. - కవిత, బాధితురాలు
శిశువులను ‘మిల్క్‌బేబీ’గా..
వారిలో ఎత్తెర మౌనికకు 3 నెలల శిశువు, ఆలపాటి కవితకు 8 నెలల శిశువు ఉన్నారు. మరో మహిళ రాణికి ఏడాది వయసున్న చంటి పాప ఉంది. ఈ ముగ్గురు తల్లులతోపాటు మరో ఆరుగురు మహిళలను పోలీసులు ఖమ్మం మూడో అదనపు ప్రథమ శ్రేణి కోర్టులో ప్రవేశపెట్టారు. విచారణ అనంతరం న్యాయమూర్తి 14 రోజుల జ్యుడిషియల్ రిమాండ్ విధించారు. దీంతో నిందితులైన తల్లులతోపాటు నెలల వయసున్న శిశువులను దానవాయిగూడెంలోని జిల్లా జైలుకు తరలించారు. రిమాండ్ రిపోర్టులో శిశువులను ‘మిల్క్‌బేబీ’గా పేర్కొన్నారు.