తెలంగాణ

telangana

ETV Bharat / state

కాంగ్రెస్​లోకి రావాలని పొంగులేటికి ఆహ్వానం.. మరి ఆయన పయనమెటో!

Internal Discussions in Residence of Ponguleti: బీఆర్ఎస్​తో దూరం మరింత పెరుగుతున్న వేళ.. మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్​రెడ్డి భవిష్యత్తు కార్యాచరణపై అడుగులు వేస్తున్నారు. ఇటీవల ఖమ్మం వేదికగా బీఆర్ఎస్ నిర్వహించిన బహిరంగ సభకు దూరంగా ఉన్న పొంగులేటి శ్రీనివాస్​రెడ్డి.. ఆయన వర్గం ముఖ్య నేతలు, అనుచరగణంలో ఆత్మస్థైర్యం నింపేలా తదుపరి కార్యాచరణకు సన్నద్ధమవుతున్నారు. బీఆర్ఎస్​తో పొంగులేటి తెగదెంపులు దాదాపు ఖాయమన్న ప్రచారం విస్తృతంగా సాగుతుండటంతో, ఆయన రాజకీయ అడుగులు ఎటు వైపు పడతాయని సర్వత్రా ఆసక్తి నెలకొన్న వేళ నియోజకవర్గాల వారీగా మరిన్ని ఆత్మీయ సమావేశాలకు మాజీ ఎంపీ సిద్ధమవుతున్నారు.

Internal Discussions in Residence of Ponguleti
Internal Discussions in Residence of Ponguleti

By

Published : Jan 22, 2023, 11:07 AM IST

పొంగులేటిని కలిసి పార్టీలోకి ఆహ్వానించిన కాంగ్రెస్‌ నేతలు

Internal Discussions in Residence of Ponguleti: మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్​రెడ్డి తన తదుపరి రాజకీయ నిర్ణయంపై ఆచితూచి అడుగులు వేస్తున్నారు. ఇటీవల ఖమ్మం బహిరంగ సభకు ఆహ్వానం లేకపోవడం.. ఒకవేళ పిలిచినా సభకు హాజరు కాబోనంటూ ముఖ్య నేతలు, అనుచరులకు చెప్పిన పొంగులేటి.. ఇక బీఆర్ఎస్​తో తన రాజకీయ ప్రస్థానం ముగించాలని దాదాపు నిర్ణయానికి వచ్చినట్లు ఆయన వర్గంలో జోరుగా ప్రచారం సాగుతోది.

బీఆర్ఎస్​లో కొనసాగేందుకు ఏమాత్రం అవకాశం లేదని, ముఖ్య అనుచరుల భేటీలో ప్రస్తావించిన పొంగులేటి.. తదుపరి రాజకీయ నిర్ణయంపై అందరి అభిప్రాయాలు సేకరించే పనిలో నిమగ్నమైనట్లు తెలుస్తుంది. ఇందులో భాగంగానే శనివారం ఖమ్మంలోని ఆయన నివాసం తన వర్గం ముఖ్యనేతలు, వివిధ నియోజకవర్గాల నుంచి తరలివచ్చిన నాయకులు, కార్యకర్తలతో కోలాహలంగా మారింది.

Congress Leaders Invited Ponguleti to The Party: పలు నియోజకవర్గాలకు చెందిన నాయకులతో పొంగులేటి తన నివాసంలో ప్రత్యేకంగా సమావేశమై చర్చించినట్లు తెలుస్తోంది. ఉభయ జిల్లాల నుంచి వచ్చిన ముఖ్యనేతలతో అంతర్గతంగా చర్చలు జరిపి, పార్టీ మార్పు నిర్ణయంపై వారి అభిప్రాయం అడిగి తెలుసుకున్నట్లు ప్రచారం సాగుతోంది. పార్టీ మారడం ఖాయమని, అయితే ఏ పార్టీలోకి వెళ్లాలన్న అంశాలపై నాయకుల అభిప్రాయాలు అడిగి తెలుసుకుంటున్నట్లు సమాచారం.

10 అసెంబ్లీ నియోజకవర్గాలకు చెందిన ముఖ్య నేతలతో సమావేశాలు నిర్వహించనున్నట్లు సమాచారం. అంతేకాకుండా నియోజకవర్గాల వారీగా ఆత్మీయ సమావేశాలు కొనసాగించాలని నిర్ణయం తీసుకున్నారు. ఇప్పటికే ఈ నెల 10న పినపాకలో ఆత్మీయ సమ్మేళనం నిర్వహించిన పొంగులేటి ఇల్లెందు నియోజకవర్గంలో రెండో ఆత్మీయ సమావేశం నిర్వహించాలని నిర్ణయించినట్లు సమాచారం. ఈ నెల 23న ఇల్లెందులో కార్యకర్తలతో ఆత్మీయ భేటీకి సిద్ధమవుతున్నట్లు తెలిసింది.

ఆ తర్వాత మధిర, భద్రాచలం, అశ్వారావుపేట, సత్తుపల్లి, ఖమ్మం నియోజకవర్గాల్లో సమావేశాలు నిర్వహించేలా ప్రణాళికలు రూపొందిస్తున్నట్లు విశ్వసనీయంగా తెలిసింది. ఇలా ఫిబ్రవరి నెలాఖరు వరకు ఆత్మీయ సమావేశాలు, అంతర్గత భేటీలు నిర్వహించాలని నిర్ణయించినట్లు తెలిసింది. ఈ లెక్కన తన రాజకీయ నిర్ణయం ఫిబ్రవరి తర్వాతే ఉంటుందని నేతలు, కార్యకర్తలకు పొంగులేటి సంకేతాలు ఇస్తున్నట్లు ప్రచారం సాగుతోంది.

శనివారం పొంగులేటి నివాసంలో ఆసక్తికర పరిణామం చోటుచేసుకుంది. ఖమ్మం నగరానికి చెందిన పలువురు కాంగ్రెస్ కార్పొరేటర్లు, నాయకులు ఆయనని కలిసి తమ పార్టీలోకి రావాలని ఆహ్వానించడం చర్చనీయాంశంగా మారింది. పొంగులేటిని కలిసిన వారిలో పలువురు కాంగ్రెస్ కార్పొరేటర్లు, మహిళా కార్పొరేటర్ల భర్తలు ఉండటం విశేషం. ఆయన్ని కలిసిన వీరంతా కాంగ్రెస్ పార్టీలోకి రావాలని ఆహ్వానించారు. అయితే ఇంకా సమయం ఉందంటూ ఆయన వారిని సముదాయించినట్లు తెలిసింది.


ఇవీ చదవండి:

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details