ఖమ్మం జిల్లా మధిరలో వృద్ధ దంపతులపై గ్రామస్థులు మూడు రోజులపాటు అమానుషంగా దాడి చేశారు. చేతబడి చేస్తున్నారన్న అనుమానంతో కొట్టిన స్థానికులు... భార్య పన్నును భర్తతో బలవంతంగా పీకించారు. రిక్షా లాగుతూ జీవనం సాగించే గద్దల మోహన్‌రావు, సరోజిని దంపతులు ఎస్సీ కాలనీలో నివాసముంటున్నారు. చేతబడి చేస్తున్నారని అనుమానంతో వీరిపై స్థానికులంతా మూకుమ్మడిగా దాడి చేశారు. చెట్టుకు కట్టేసి కొట్టారు. మోహన్‌రావును చితకబాదుకుంటూ... అతడి చేతితోనే బలవంతంగా భార్య పంటిని పీకించారు.
Black magic: చేతబడి చేస్తున్నారన్న అనుమానంతో వృద్ధదంపతులపై విచక్షణారహిత దాడి
చేతబడి చేస్తున్నారన్న అనుమానంతో వృద్ధదంపతులపై అమానుషంగా దాడి చేసిన ఘటన ఖమ్మం జిల్లా మధిరలో చోటుచేసుకుంది. ఇద్దరిని ఇష్టారీతిన కొట్టటమే కాకుండా.. భర్తతో బలవంతంగా భార్య పన్ను పీకించారు. విషయం తెలుసుకున్న సీపీఎం నాయకులు.. బాధితులను పోలీస్‌స్టేషన్‌కు తీసుకెళ్లి ఫిర్యాదు చేయించారు.
వృద్ధ దంపతుల మనవడు కొంత కాలంగా అనారోగ్యంతో బాధపడుతూంటే మధుర సమీపంలోని పెనుగంచిప్రోలు పూజారి సలహాతో వారి ఇంట్లోనే పూజ చేశారు. సమీపంలోని ఇంట్లో ఏడాది క్రితం ఓ చిన్నారి మరణానికి వీరే కారణమని... వీరు చేసే పూజల వల్లే పిల్లలు చనిపోతున్నారని ఆరోపిస్తూ... మూడు రోజులుగా చిత్రహింసలు పెట్టారు. విషయం తెలుసుకున్న సీపీఎం నాయకులు పాపినేని రామనర్సయ్య ఘటనా స్థలికి వెళ్లి పరిశీలించారు. బాధితులకు అండగా నిలిచి పోలీస్ స్టేషన్‌కి తీసుకెళ్లి ఫిర్యాదు చేయించారు. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
గతంలోనే వీరిపై దాడి జరిగినప్పుడు ఫిర్యాదు చేశామని బాధితులు వెల్లడించారు. తమకు ఎలాంటి చేతబడులు తెలియవని... అకారణంగా కొట్టారని కన్నీరుమున్నీరయ్యారు. తమకు న్యాయం చేయాలని వేడుకుంటున్నారు.