ఖమ్మం నగరపాలకంలో అభివృద్ధి పనులు జోరందుకున్నాయి. అన్ని ప్రధాన రహదారులపై డివైడర్లు.. వాటిల్లో సెంట్రల్ లైటింగ్ ఏర్పాటు చేయాలని పాలకపెద్దలు ఆదేశాలు జారీచేయడం అందుకనుగుణంగా అధికారులు ఆగమేఘాల మీద టెండర్లు నిర్వహించడం, పనులు ప్రారంభించడం చకచకా జరిగిపోతున్నాయి. ప్రస్తుత నగరపాలక సంస్థ పాలకవర్గం గడువు వచ్చే ఏడాది మార్చి 15తో ముగియనుంది. గతేడాది మార్చిలో ఖమ్మం గ్రామీణ మండలంలోని ఆరు పంచాయతీలను నగరపాలక సంస్థలో విలీనం చేయడం, ఆ తరువాత ప్రస్తుతం ఉన్న 50డివిజన్లను 60 డివిజన్లుగా పెంచుతూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు రాజపత్రం కూడా విడుదల చేసింది.
అభివృద్ధి పనులపై సమీక్షలు
గత మూడు నెలలుగా దశలవారీగా ఖమ్మం నగరపాలకంలో చేపట్టిన అభివృద్ధి పనులపై మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్ సమీక్షలు నిర్వహిస్తున్నారు. అభివృద్ధి పనులను వేగవంతం చేయాలని ఆదేశాలు జారీచేశారు. ఇదే సమయంలో విలీన పంచాయతీలకు సైతం అభివృద్ధి నిధులు కేటాయించారు. చేపట్టిన అన్ని పనులు నిర్ధేశించిన సమయంలోగా పూర్తిచేయాలని స్పష్టమైన ఆదేశాలు కూడా జారీచేశారు. మేయర్, కమిషనర్‌లు కూడా ప్రతి వారం పనుల పురోగతిని సమీక్షిస్తున్నారు. మూడేళ్లుగా ముఖ్యమంత్రి ప్రత్యేక నిధుల నుంచి చేపట్టిన రూ.300కోట్ల పనులు, రూ.55కోట్ల ఎల్‌ఆర్‌ఎస్ నిధులు, రూ.25కోట్ల నగరపాలక సంస్థ సాధారణ నిధులతో చేపడుతున్న పనులను వేగవంతం చేస్తున్నారు. గోళ్లపాడు కాలువ ఆధునికీకరణ, మిషన్‌భగీరథ, నూతన బస్టాండ్, ఐటీహబ్, మార్కెట్‌ల నిర్మాణం, నగరపాలక సంస్థ నూతన భవన నిర్మాణం, ధంసలాపురం రైల్వే ఓవర్ వంతెన పనులు జోరుగా సాగుతున్నాయి.