illegal timber trafficking: ఉమ్మడి ఖమ్మం జిల్లాలో కలప అక్రమ రవాణా యథేచ్ఛగా సాగుతోంది. గతంలో అటవీ ప్రాంతాల్లో విలువైన వృక్షాలను నరికి అక్రమార్కులు రాత్రికి రాత్రే గుట్టుచప్పుడు కాకుండా రవాణా చేసేవాళ్లు. ఈ అక్రమ రవాణాకు అడ్డుకట్ట వేసేందుకు అటవీశాఖ సరికొత్త ప్రణాళికతో ముందుకెళ్తున్నా.. దందా మాత్రం ఆగడం లేదు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో సుమారు 10 లక్షల ఎకరాలు, ఖమ్మం జిల్లాలో నాలుగు లక్షల ఎకరాల అటవీ విస్తీర్ణం ఉంది. భద్రాద్రి జిల్లాలో ఆరు అటవీ డివిజన్లు, 23 రేంజ్‌లున్నాయి. ఖమ్మం జిల్లాలో 2 డివిజన్లు, ఆరు రేంజ్‌లు ఉన్నాయి. ఓ వైపు పోడు భూముల విస్తీర్ణం పెరుగుదల, మరోవైపు అక్రమ కలప రవాణాతో పూర్వ ఖమ్మం జిల్లాలో అటవీ విస్తీర్ణం గణనీయంగా తగ్గుతోంది.
స్మగ్లర్లతో చేతులు కలిపి..ప్రధానంగా ఏజెన్సీ ప్రాంతంలో అక్రమ కలప రవాణాకు అడ్డుకట్ట పడటం లేదు. ఈ వ్యవహారంలో అటవీ శాఖలోని కొందరు అధికారులు, సిబ్బంది అక్రమార్కులకు సహకరిస్తున్నారనే ఆరోపణలున్నాయి. కలప మాఫియా పగలు అడవిని జల్లెడ పట్టి విలువైన వృక్షాలను గుర్తిస్తున్నారు. రాత్రివేళల్లో ఆయా ప్రాంతాలకు కూలీలు, ముఠాలతో వెళ్లి వాటిని నేలమట్టం చేస్తున్నారు. ప్రధానంగా నారవేప, టేకు చెట్లపై కన్నేస్తున్నారు. మారుమూల అటవీ ప్రాంతాల్లో కోత యంత్రాలు పెట్టి మరీ భారీ చెట్లను నేలకూల్చేస్తున్నారు. అక్కడే దుంగలుగా చేసి అక్రమంగా తరలిస్తున్నారు. ఆయా రేంజ్‌లు, చెక్ పోస్టుల పరిధిలో వాహనాలు ఆపకుండా ముందే జాగ్రత్త పడుతున్నారు.
డిపోల నుంచే తరలింపు..చాలాచోట్ల టింబర్ డిపోల నుంచే నేరుగా ఇటుక బట్టీలకు కలప తరలిస్తున్నారు. భద్రాద్రి జిల్లాలో టేకులపల్లి, గుండాల, ఆళ్లపల్లి, ఇల్లెందు, భద్రాచలం, అశ్వారావుపేట, అశ్వాపురం, మణుగూరు, చర్ల, దుమ్ముగూడెం మండలాల్లో ఈ అక్రమ రవాణా జోరుగా సాగుతోంది. ఖమ్మం జిల్లాలోని కొన్ని మండలాల్లో విచ్చలవిడిగా కలప రవాణా చేస్తూ అక్రమార్కులు సొమ్ము చేసుకుంటున్నారు. కొన్నిచోట్ల ఈ వ్యవహారం అధికారుల కనుసన్నల్లోనే జరుగుతోందన్న ఆరోపణలూ ఉన్నాయి.
ఇంటి దొంగల బాగోతమిలా..
*టేకులపల్లి పరిధి చాతకొండ రేంజ్‌లోని సిద్ధారం, ఇల్లెందు రేంజ్ కొల్లాపురం బీట్ పరిధిలో నారవేప దుంగల నరికివేత వెనుక అటవీశాఖలోని కొందరి ప్రమేయం ఉందన్న వాదనలున్నాయి. ఇవే ఆరోపణలతో ఇటీవల నలుగురిపై వేటు పడింది.
*సిద్ధారం అడవుల్లో నుంచి రెండు వాహనాలలో నారవేప దుంగలను తరలిస్తుండగా అధికారులు పట్టుకున్నారు. ఆ తర్వాత అక్రమార్కులతో మిలాఖత్ అయిన వ్యవహారం సీసీ కెమెరాల్లో నిక్షిప్తం కావడంతో వారిపై వేటు పడింది.
* చర్ల మండలం వెంకటచెరువు అటవీ ప్రాంతాల్లో వందేళ్ల టేకు చెట్లను నరుకుతుండగా కూంబింగ్‌కు వెళ్లిన పోలీసులు పట్టుకున్నారు. సంబంధిత అటవీ సిబ్బందిపై వేటు పడింది.
* దుమ్ముగూడెం మండలం పర్ణశాల బీట్ పరిధిలో అక్రమంగా కలప తరలిస్తున్న వాహనాలను పట్టుకోగా ఇద్దరు సిబ్బంది పాత్ర ఉన్నట్లు తేలడంతో సస్పెన్షన్‌కు గురయ్యారు. అశ్వాపురం మండలం గొందిగూడెం, రామవరం రేంజ్‌ల పరిధిలో అక్రమ కలప రవాణాకు సహకరిస్తున్నారన్న ఆరోపణలపై పలువురు సిబ్బందిపై వేటు పడింది.
అడవుల్లో చెట్లు నరికివేతకు తావులేకుండా రేంజ్‌ల వారీగా చర్యలు చేపట్టాం. రెవెన్యూ పట్టాలున్న భూములు, ఆర్‌వోఎఫ్‌ఆర్ పట్టాలున్న భూముల్లోనూ చెట్లు నరికినా చర్యలు తప్పవు. అక్రమ కలప రవాణాలో అధికారులు, సిబ్బంది పాత్ర ఉంటే చర్యలు తీసుకుంటున్నాం. - లక్ష్మణ్ రంజిత్ నాయక్, జిల్లా అటవీశాఖ అధికారి