భారీ వర్షాలకు వాగుల్లో కొట్టుకొచ్చిన ఇసుకను కుప్పగా చేసి కొందరు అక్రమార్కులు దందా కొనసాగిస్తున్నారు. ఖమ్మం జిల్లా కొణిజర్ల మండలం అంజనాపురం అడ్డగా కొన్ని రోజులుగా ఈ దందా కొనసాగుతున్నా అధికారులు పట్టించుకోవడం లేదని స్థానికులు అంటున్నారు. ఏటిలో పట్టపగలు ఇసుక తోడుతున్నా అధికారులు నిర్లక్ష్యం వహించడం పట్ల సర్వత్రా అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఆ గ్రామంలో కూడళ్లు, ఇళ్ల వద్ద ఇసుక కుప్పలుగా పోసి అనధికారంగా నిల్వ చేస్తున్నా.. అధికారులు తనిఖీలు చేయడం లేదు. ఇటీవల ఏటి వద్ద అధికారులు దాడులు చేసి ట్రాక్టర్లు వదిలేసినట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి.
ప్రతి రోజు 50 వరకు ట్రాక్టర్లు ఇసుక తరలిస్తున్నారు. గ్రామ కూడలిలో ఇతర ప్రాంతాల నుంచి వచ్చిన ట్రాక్టర్లకు నింపుతున్నారు. గ్రామపంచాయతీలలో అభివృద్ధి పనులు జోరుగా సాగడం వల్ల ఇసుకకు భారీగా గిరాకీ పెరిగింది. దీన్ని అదునుగా చేసుకొని అంజనాపురంలో కొందరు వ్యక్తులు గ్రూపుగా ఏర్పడి దందా కొనసాగిస్తున్నారు. ఇతర గ్రామాల నుంచి వచ్చే ట్రాక్టర్లను అడ్డుకోవడం తాము అధికారులకు నెలవారీ మామూళ్లు ఇస్తున్నామని బెదిరంపులకు పాల్పడుతున్నారు.
ఆ ఆరు ట్రాక్టర్లే ఎక్కువగా....
అంజనాపురంలో ఆరు ట్రాక్టర్లు నిత్యం ఇసుకను రవాణా చేస్తున్నాయి. నీళ్లు వచ్చే సమయంలోనే కూలీల ద్వారా ఒడ్డుపై కుప్ప పోయించి గ్రామానికి తరలిస్తున్నారు. అక్కడ డంప్ చేసిన ఇసుకను రూ.6వేలకు విక్రయిస్తున్నారు. ఒక్కో ట్రాక్టర్ అనేకసార్లు పట్టుబడినా పోలీస్, రెవెన్యూ అధికారులు నామమాత్రంగా జరిమానాలు విధిస్తున్నారు. రెండోసారి పట్టుబడిన ట్రాక్టర్‌ను సీజ్ చేయాల్సి ఉండగా అలా చర్యలు తీసుకోవడం లేదు.