తెలంగాణ

telangana

ETV Bharat / state

ఆ మార్కెట్‌లో.. కమీషన్‌దారులు.. ఆడిందే ఆట పాడిందే పాట - Khammam agricultural market is full of commissions

Khammam Agricultural Market: ఖమ్మం వ్యవసాయ మార్కెట్‌లో రైతులను కమీషన్‌ జలగలు పట్టిపీడిస్తున్నాయి. వ్యాపారులు తాము ఆడిందే ఆట పాడిందే పాట అన్నట్లుగా పరిస్థితి మారింది. రైతుకు దక్కే ధర మాటేమోగానీ కమీషన్‌, ఇతర ఖర్చులే తడిసి మోపెడవుతున్నాయి. ఖరీదుదారులకు - రైతుకు మధ్య అనుసంధానకర్తలుగా ఉన్న కమీషన్‌దారులపై పెట్టుకున్న నమ్మకమే వీరికి కాసులు కురిపిస్తోంది.

Illegal collection by commission agents in Khammam agricultural market
Illegal collection by commission agents in Khammam agricultural market

By

Published : Nov 5, 2022, 8:18 PM IST

ఆ మార్కెట్‌లో.. కమీషన్‌దారులు.. ఆడిందే ఆట పాడిందే పాట

Khammam Agricultural Market: అసలే ఆశించిన దిగుబడి రాక అల్లాడుతున్న రైతుకు కమీషన్లు, ఛార్జీలు మరింత గండి పెడుతున్నాయి. అక్రమాలను అరికట్టాల్సిన అధికారులు చూసీచూడనట్లుగా వ్యవహరిస్తుండటంతో కమీషన్‌దారుల ఆగడాలకు అడ్డూ అదుపులేకుండా పోతోంది. ఖమ్మం వ్యవసాయ మార్కెట్‌కు తమ ఉత్పత్తులను తీసుకొచ్చిన అన్నదాతలు దగాకు గురవుతున్నారు. కొనుగోలుదారుడికి, రైతుకు మధ్య సమన్వయం చేసే కమీషన్‌ వ్యాపారికి నూటికి 2 రూపాయల చొప్పున రైతు చెల్లిస్తుంటాడు.

నష్టపోతున్న పత్తి, మిర్చి రైతులు:ఇందుకు సిద్ధంగా ఉన్నా 2 రూపాయలకు బదులు 5 రూపాయలు వసూలు చేస్తుండడంతో రైతులు తీవ్రంగా నష్టపోతున్నారు. ఈ మార్కెట్​లో మొత్తం 181 మంది ఖరీదుదారులు ఉండగా.. 463 మంది కమీషన్‌దారులు ఉన్నారు. ప్రధానంగా పత్తి, మిర్చి రైతులు కమీషన్‌రూపంలో తీవ్రంగా నష్టపోతున్నారు. మిర్చి ధర ప్రస్తుతం క్వింటా రూ. 20 వేలు పలుకుతోంది. ఇందులో కమీషన్ వ్యాపారి రూ.100కు 5 రూపాయల చొప్పున తీసుకుంటే రూ.1000 నుంచి రూ.1100 వరకు కమీషన్‌కే పోతోంది.

మిగిలిన ఛార్జీలనూ భరించాల్సిందే: ఇక పత్తి క్వింటా రూ. 7000 చొప్పున వేసుకున్నా కమీషన్‌ వ్యాపారికి రూ.350 నుంచి రూ.400 చొప్పున చెల్లించాల్సి వస్తుంది. మార్కెట్‌కు వచ్చే రైతులు పంట ఉత్పత్తులను అమ్ముకోవాలంటే కమీషన్‌తో పాటు మిగిలిన ఛార్జీలనూ భరించాల్సిందే. పంట ఉత్పత్తుల కొనుగోలుకు మార్కెట్‌లో హమాలీ, దడవాయి, స్వీపర్‌, ఛార్జీలు ఉంటాయి. పంట, బస్తా బరువును అనుసరించి ఈ ధరలను రెండేళ్లకోసారి సవరిస్తారు. మార్కెట్‌లో ఒక బస్తాను దిగుమతి చేయడం, బస్తాను తెరవడం.. మళ్లీ కుట్టడం చేసినందుకు 50 కేజీలలోపు బస్తాకు 11 రూపాయలు, 50 కేజీలకుపైగా ఉన్న బస్తాకు 15 రూపాయలు చెల్లించాలి.

రైతు శ్రమకు గండి:ఇలా మొత్తం మార్కెట్‌లో ఒక బస్తాకు రైతు చెల్లించాల్సిన ఛార్జీలు కలిపి సుమారు 25రూపాయలకు పైగానే అవుతోంది. ఓ పక్క పంట ఆశించిన దిగుబడి రాక మార్కెట్‌లో గిట్టుబాటు ధర పలకడం లేదు. దీనికి తోడు కమీషన్లు, ఛార్జీల రూపంలో రైతు శ్రమకు గండిపడుతోంది. మార్కెట్‌లోని కమీషన్‌ వ్యాపారులు ఏటా పంట సాగు సమయాన అన్నదాతలకు రుణాలు ఇస్తారు. ఈ రుణంపై 2రూపాయలు వడ్డీ వసూలు చేస్తుండగా, పంట చేతికి రాగానే రైతులు కమీషన్‌ వ్యాపారుల వద్దకు తీసుకొస్తారు.

ప్రశ్నిస్తే మళ్లీ అప్పులు పుట్టవనే ఆందోళన: దీనిని అదునుగా తీసుకుని వడ్డీకి తోడు నూటికి 2 రూపాయలకు బదులుగా 5 రూపాయలు కమీషన్‌ వసూలు చేస్తుండటం మార్కెట్​లో ఏళ్ల తరబడి సాగుతోంది. ఇదేంటని ప్రశ్నించే పరిస్థితి రైతులకు లేకుండా పోయింది. కమీషన్ వ్యాపారులను ప్రశ్నిస్తే మళ్లీ అప్పులు పుట్టవనే ఆందోళనతో మిన్నకుండి పోతున్నారు. కమీషన్‌దారుల వద్ద అప్పు తీసుకున్న అన్నదాతలు వారు చెప్పిన రేటుకు ఖరీదుదారులకే పంట ఉత్పత్తులను విక్రయించాల్సి ఉండడంతో ధర విషయంలోనూ నష్టపోవాల్సి వస్తోంది.

ఇంత జరుగుతున్నా మార్కెట్ పాలకవర్గం కళ్లప్పగించి చూస్తున్నారే తప్పితే ఎలాంచి చర్యలు తీసుకోవడం లేదన్న విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఇప్పటికైనా పాలకవర్గం స్పందించి మార్కెట్‌లో సాగుతున్న కమీషన్ దందాకు అడ్డుకట్ట వేసి.. తమకు న్యాయం జరిగేలా చూడాలని రైతులు కోరుతున్నారు.

"పంట సాగు సమయంలో మాకు అప్పులు ఇస్తారు. ఈ రుణంపై 2రూపాయలు వడ్డీ వసూలు చేస్తారు. పంట చేతికి రాగానే కమీషన్​ వ్యాపారుల వద్దకు తీసుకువస్తాం. వారు చెప్పిన రేటుకే పంటను అమ్ముకుంటాం. కాదని వేరే దగ్గరకి వెళ్లితే తిరిగి అప్పు పుట్టదు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి తమకు న్యాయం జరిగేలా చూడాలని కోరుతున్నాం." -బాధిత రైతులు

ఇవీ చదవండి:పెరుగుతున్న ధాన్యం కొనుగోళ్లు.. నిల్వలు ఏం చేయాలి..?

నిరసన చేస్తుండగా కాల్పులు.. పంజాబ్​ శివసేన నేత దారుణ హత్య

ABOUT THE AUTHOR

...view details