మహబూబాబాద్‌లోని పత్తిపాక, బాబు నాయక్ తండా, రెడ్యా నాయక్ కాలనీలలో ఉన్న ప్రభుత్వ అసైన్డ్ భూములలో నిర్మించుకున్న ఇళ్లను అధికారులు కూల్చేశారు. పోలీసుల ఆధ్వర్యంలో రెవెన్యూ సిబ్బంది కూల్చివేత ప్రక్రియ చేపట్టారు. ఈ క్రమంలో ఓ మహిళ బాధితురాలు ఆత్మహత్యకు యత్నించగా... పోలీసులు అడ్డుకున్నారు.
పర్మిషన్లు ఇచ్చినప్పుడు తెలీదా...?
ప్రభుత్వ భూములను ఆక్రమించలేదని... గతంలో ఆ స్థలాలను తాము కొనుగోలు చేసినట్లు బాధితులు స్పష్టం చేశారు. నిర్మాణాలు పూరై.... ఇంటి నంబర్లు, విద్యుత్ కనెక్షన్లు సైతం తీసుకున్నాక... ఇప్పుడు కూల్చివేయడమేంటని ప్రశ్నించారు. అప్పుడు రిజిస్ట్రేషన్లు చేసి... ఇళ్లకు పర్మిషన్లు ఇచ్చి... ఇన్ని రోజులు నివాసమున్నాక ఇప్పుడు కూల్చేస్తే ఎక్కడికెళ్లాలంటూ... బాధితులు ఆవేదన వ్యక్తం చేశారు. ఉన్న డబ్బులతో నిర్మించుకున్న గూడు కూల్చేస్తే... తమ బతుకులు రోడ్డున పడినట్లేనని... కలెక్టర్ ఈ విషయంపై దృష్టిసారించి తమకు న్యాయం చేయాలని వేడుకున్నారు.