తెలంగాణ

telangana

ETV Bharat / state

అమ్మకు ఎంత కష్టం.. ఆరు గంటలపాటు ఆస్పత్రులన్నీ తిరిగినా.. - ఖమ్మలో కరోనా ఆస్పత్రులు

పురిటి నొప్పులతో ఆ అమ్మ నరక యాతన పడింది. బిడ్డకు జన్మనిచ్చేందుకు అష్టకష్టాలు పడాల్సి వచ్చింది. సుమారు 6 గంటల పాటు ఆస్పత్రులన్నీ తిరిగి చివరకు ఇంట్లోనే బిడ్డకు జన్మనిచ్చింది. ఇదంతా జరిగింది ఏ మారుమూల ప్రాంతంలోనో కాదు. ఖమ్మం జిల్లా కేంద్రంలోనే.. కరోనా మహమ్మారీతో వైద్య సేవలు అందకుండా ఇబ్బంది పడుతున్న వారి జాబితాలో ఇప్పుడు అమ్మలు చేరారు.

khammam news
అమ్మకు ఎంత కష్టం.. ఆరు గంటలపాటు ఆస్పత్రులన్నీ తిరిగినా..

By

Published : Aug 24, 2020, 10:19 AM IST

అమ్మకు ఎంత కష్టం.. ఆరు గంటలపాటు ఆస్పత్రులన్నీ తిరిగినా..

కరోనా ప్రభావం లేకుండా గర్భిణులకు వైద్య సేవలందిస్తామని ప్రభుత్వం చెబుతున్నా క్షేత్రస్థాయిలో పరిస్థితులు మాత్రం అందుకు భిన్నంగా ఉన్నాయి. కొవిడ్‌తో ఆసుపత్రుల్లో వైద్యం అందక.. ఇంట్లోనే కాన్పు జరుగుతున్న ఘటనలు పరిస్థితి తీవ్రతకు అద్దం పడుతున్నాయి.

ఖమ్మం రమణగుట్ట ప్రాంతంలో ఓ చిన్న ఇంట్లో లలిత, రమేష్ దంపతులు నివాసం ఉంటున్నారు. రమేష్‌.. ఖమ్మం రైల్వే స్టేషన్‌లో ఒప్పంద పారిశుద్ధ్య కార్మికుడు. లలిత కూడా అక్కడే పనిచేసేది. నెలలు నిండటంతో గత రెండు నెలలుగా ఇంట్లోనే ఉంటుంది. ఈనెల 13న లలితకు పురిటి నొప్పులు వచ్చాయి. ఉమ్మ నీరు సైతం ఎక్కువ పోయింది. సాయంత్రం 6 గంటల ప్రాంతంలో 108 ద్వారా ఖమ్మం జిల్లా ప్రధాన ఆస్పత్రికి వెళ్లారు. కనీసం అంబులెన్స్‌ కూడా దిగక ముందే ఇక్కడ వైద్యులు లేరు...అని సమాధానం వచ్చింది. నర్సులు మాత్రమే ఉన్నామని.... వేరే ఆస్పత్రికి వెళ్లమని చెప్పారు.

చేసేదేమి లేక ఖమ్మంలోని ఓ ప్రైవేటు వైద్య కళాశాలకు వెళ్లారు. అక్కడ ఆమె ఆయసపడటం.. కరోనా భయం.. వరంగల్‌ వెళ్లమని చెప్పారు. ఓ ప్రైవేటు అంబులెన్స్‌ మాట్లాడుకొని.. ఖమ్మంలోనే నాలుగు ఆస్పత్రులకు వెళ్లారు. ఒక్కరు కూడా చేర్చుకోలేదు. మరో ఆసుపత్రికి తాళం వేసి ఉంది. మరో రెండు ఆస్పత్రుల్లో వైద్యులు.. చూసేందుకు సైతం భయపడ్డారు. ఈ పరిస్థితుల్లో చేసేదేమి లేక అర్ధరాత్రి ఇంటికి తిరిగి వచ్చారు. నొప్పులు ఎక్కువ కావటంతో తెల్లవారుజామున ఇరుగు పోరుగు వారు వచ్చారు. అందులో ఒకరు ప్రైవేటు ఆస్పత్రిలో నర్సుగా పనిచేస్తున్నారు. ఆమె కాన్పు చేసింది. ప్రస్తుతం తల్లి బిడ్డ క్షేమంగా ఉన్నారు.

జోరు వానలో..

జోరు వానలో రాత్రి సమయంలో ఎంతో నమ్మకంతో ప్రభుత్వ ఆస్పత్రికి వెళ్తే.. వైద్యులు లేకపోవడం విచారకరమని భర్త రమేష్ ఆవేదన వ్యక్తం చేశాడు. పుట్టిన బిడ్డ సైతం బరువు తక్కువగా ఉన్నాడని తెలిసి ప్రభుత్వ ఆస్పత్రికి తీసుకువెళ్తే బిడ్డను చేర్చుకోలేదని..ప్రైవేటు ఆస్పత్రిలో చేర్పిస్తే.. రూ. 28 వేలు అయిందని తెలిపాడు.

కరోనా భయంతో ప్రైవేటు ఆస్పత్రిలో వైద్యులు చూడటం లేదని..కనీసం ప్రభుత్వ దవాఖానాలో వైద్యుల కొరత లేకుండా అత్యవసరమైన కాన్పులు చేయాలని బాధితులు కోరుతున్నారు.

ఇవీచూడండి:మృత్యువు ముంచుకొస్తున్నా... సడలని సంకల్పం

ABOUT THE AUTHOR

...view details