రాష్ట్రంలో రోజురోజుకు పెరుగుతున్న కరోనా కేసులతో ప్రజలు భయాందోళనకు గువుతున్నారు. ఇదిలా ఉండగా ఉమ్మడి ఖమ్మం జిల్లాలో మాత్రం పరిస్థితి వేరుగా గోచరిస్తోంది.
చిన్న జలుబు, దగ్గూ వచ్చిన వైరస్ ఏమోనన్న అనుమానంతో చచ్చిపోతున్నా..!
వైరా మండల కేంద్రానికి చెందిన ఓ వ్యక్తికి కరోనా పాజిటివ్ సోకింది. తీవ్ర లక్షణాలేమీ లేకపోవడం వల్ల ఇంట్లో ఐసోలేషన్లోనే ఉండాలని అధికారులు సూచించారు. తన నుంచి కుటుంబ సభ్యులకు వైరస్ సోకుతుందేమోనన్న భయంతో వారందరికీ దాదాపు 20 రోజుల పాటు దూరంగా ఉన్నారు. ఐసోలేషన్ గడువు ముగియడం వల్ల మరోసారి తనకు కరోనా నిర్దరణ పరీక్ష చేయాలని స్థానిక వైద్యశాఖ అధికారులు, సిబ్బందిని కోరగా.. మళ్లీ పరీక్ష అవసరం లేదని వైద్యసిబ్బంది తేల్చేశారు. ఇక పరీక్ష లేమీ లేవని ఉచిత సలహా ఇచ్చారు. నిర్భయంగా బయట తిరగొచ్చని సూచించారు. సదురు బాధితుడు కూడా సాధారణ జీవితం ప్రారంభించారు. కానీ చిన్నపాటి దగ్గు, జలుబు వచ్చినా ఒంట్లో కాస్త నలతగా అనిపిస్తే చాలు ఆ బాధితుడిలో ఒకటే ఆందోళన. అసలు తన నుంచి వైరస్ వెళ్లిందా ఇంకా ఉందా అన్న ప్రశ్నలతో బాధితుడు తీవ్ర మనోవేదనకు గురవుతున్నాడు.
రెండోసారి పరీక్షకు వేలకువేలు ఖర్చు పెట్టా!
కొత్తగూడెం పట్టణానికి చెందిన వ్యక్తికి 15 రోజుల క్రితం కరోనా సోకింది. పాజిటివ్‌గా నిర్ధారణ అయినప్పటి నుంచీ హోం ఐసోలేషన్లోనే ఉన్నారు. 17 రోజుల ఐసోలేషన్ గడువు ముగిసిన తర్వాత ఆరోగ్య పరిస్థితి కూడా బాగానే ఉందనుకున్నాడు. చిన్నపాటి జలుబు, ఒంట్లో ఏదో కొంత ఇబ్బందిగా ఉండటం వల్ల మరోసారి పరీక్ష చేయించుకుంటే అనుమానం తీరుతుంది కదా అనుకుని ఆస్పత్రి సిబ్బందిని సంప్రదించగా రెండోసారి పరీక్ష చేయాలంటే అనుమతి తప్పనిసరని సెలవిచ్చారు. చేసేదేమీ లేక ప్రాణంమీద తీపితో హైదరాబాద్లోని ప్రైవేటు ఆస్పత్రిని ఆశ్రయించి వేలకు వేలు ధారపోసి అనుమానాలు నివృత్తి చేసుకోవాల్సిన పరిస్థితి తలెత్తింది.
మందులిచ్చి పంపి.. రోజు వస్తామని చెప్పి అంతే సంగతి..!
ఖమ్మం నగరానికి చెందిన వ్యక్తికి గతనెల చివరి వారంలో వైరస్ పాజిటవ్‌గా నిర్ధారణ అయ్యింది. తీవ్ర లక్షణాలేమీ లేకపోవడం వల్ల హోం ఐసోలేషన్లో ఉండాలని వైద్యాధికారులు సూచించారు. వారానికి సరిపడా మందులు ఇచ్చి పంపారు. ప్రతీ రోజూ వైద్య సిబ్బంది వచ్చి ఎప్పటికప్పుడు ఆరోగ్య పరిస్థ్థితిని సమీక్షిస్తారని చెప్పారు. కానీ ఆ బాధితుడు హోం ఐసోలేషన్‌కు వెళ్లినప్పటి నుంచీ పట్టించుకున్న నాథుడే కరవయ్యాడు. అటుగా వెల్లి అతన్ని చూసే సిబ్బందే లేరు. ఆరోగ్య స్థితిని సమీక్షించిన దాఖలాలూ లేవు. చేసేదేమీ లేక తెలిసిన డాక్టర్ల నుంచి జాగ్రత్తలు తీసుంటూ ఆ బాధితుడు ఐసోలేషన్ కాలం వెళ్లదీస్తున్నాడు.
వైద్యసిబ్బంది నిర్లక్ష్యం ఖరీదు మా ఆయన ప్రాణం
బోనకల్లు మండలానికి చెందిన 47 ఏళ్ల వ్యక్తి కరోనా బారినపడి గత ఆదివారం మృత్యువాతపడ్డాడు. అంతకు వారం ముందే కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ కావడం వల్ల ప్రభుత్వ ఆస్పత్రిలో చేరారు. ఆ తర్వాత ఆస్పత్రిలో మందులు ఇచ్చి హోం ఐసోలేషన్లో ఉండమని వైద్యాధికారులు చెప్పారు. వారు చెప్పిన విధంగానే ప్రత్యేక గదిలో ఉన్నారు. ఆకస్మాత్తుగా తీవ్ర ఆయాసం వచ్చి శ్వాస తీసుకునేందుకు ఇబ్బందులు పడగా హుటాహుటిన మళ్లీ ఆస్పత్రికి తరలించారు. 4 గంటల తర్వాత బాధితుడు మృత్యువాతపడ్డాడు. ఐసోలేషన్ లో ఉన్న సమయంలో వైద్యసిబ్బంది సరైన పర్యవేక్షణ చేసి, తగిన సలహాలు సూచనలు ఇస్తే తన భర్త దూరమయ్యేవాడు కాదని మృతుడి భార్య వేదన వ్యక్తం చేసింది.
రెండోసారి పరీక్షలు చేయరట:
ఖమ్మం, భద్రాద్రి జిల్లాల్లో ఆస్పత్రి, హోం ఐసోలేషన్లో ఉన్న వారు మొత్తం దాదాపు 2 వేల మంది వరకు ఉన్నారు. వీరిలో ఖమ్మం జిల్లాలో 1026 మంది ఉండగా భద్రాద్రి జిల్లాలో 993 మంది ఉన్నారు. రెండు జిల్లాల్లో కలిపి హోం ఐసోలేషన్లో ఉన్న వారు దాదాపు 1400 మంది ఉన్నారు. వీరిలో ఎక్కువ మంది కరోనా బాధితులు కాగా...కాంటాక్టు వ్యక్తులు, ఫలితాల కోసం వేచిచూస్తున్న వారు ఉన్నారు. చిన్నపాటి లక్షణాలతో ఉన్నవారే అధికంగా ఉన్నారు. ఇటువంటి వారిని ఇంట్లోనే ప్రత్యేక గదుల్లో హోం ఐసోలేషన్లో ఉండాల్సిందిగా వైద్యాధికారులు, సిబ్బంది సూచించారు. ఐసోలేషన్ సమయం ముగిసినవారిలో అసలు వైరస్ ఉందో లేదో తెలియక తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు. పోనీ అనుమానం తీర్చుకుందామని ఆసుపత్రికి వెళ్తే రెండోసారి వైద్య పరీక్షలు నిర్వహించబోమని అంటున్నారు. దీంతో.. తమలో వైరస్ ఉన్నట్టా లేనట్టా అన్నది తేలక బాధితులు మానసికంగా ఇబ్బందులకు గురవుతున్నారు.
తిరగబడితే తిప్పలే:
ఒకసారి కరోనా నుంచి కోలుకున్న బాధితులకు కొన్నిసార్లు మళ్లీ ఆరోగ్య సమస్యలు ఉత్పన్నమవుతున్నాయి. ప్రభుత్వ ఆస్పత్రుల చుట్టూ తిరిగినా ఫలితం ఉండటం లేదు. దీంతో ప్రైవేటు ఆస్పత్రుల చుట్టూ తిరుగుతున్నారు. వేలకు వేలు వైద్యం కోసం ధారపోస్తున్నారు. ఓ వైపు కొత్త కేసులు వస్తున్నాయి. మరోవైపు పాత కేసులన్నీ తిరగబడుతున్నాయి. ఈ పరిస్థితుల్లో హోం ఐసోలేషన్లో ఉన్న బాధితుల్లో ఆందోళన మరింత రెట్టింపవుతోంది. ఐసోలేషన్లో ఉన్న బాధితులకు అన్నివిధాలా వైద్యారోగ్య శాఖ సిబ్బంది అండగా ఉండాలని ప్రభుత్వం పదేపదే చెబుతోంది. ఇటీవల జిల్లా పర్యటకు వచ్చిన ఆరోగ్యశాఖ మంత్రి ఈటల రాజేందర్ వైద్యాధికారులకు ఇదే అంశంపై హితోపదేశం చేశారు. కానీ ఉమ్మడి జిల్లాలో ఐసోలేషన్ బాధితులకు అందుతున్న వైద్య సేవలు అంతంత మాత్రంగా ఉన్నాయని బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కరోనా బాధితుల దగ్గరికి వచ్చేందుకు తమకు కనీసం పీపీఈ కిట్లు అందుబాటులోలేవని కొంతమంది వైద్యసిబ్బంది బాధితులకు చెప్పడం గమనార్హం.
పర్యవేక్షణ లోపమే శాపం:
కరోనా పాజిటివ్ వచ్చి, హోం ఐసోలేషన్ ఉన్నవారు, కాంటాక్టు వ్యక్తులుగా ఉన్నవారికి ఈ సమయంలో వైద్యారోగ్యశాఖ అధికారులు, సిబ్బంది చేయూత కొండంత అవసరం. బాధితులు ఈ సమయంలో ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఏఏ ఆహారం అవసరం, వైరస్‌ను అధిగమించేందుకు పాటించాల్సిన జాగ్రత్తలపై నిరంతరం వారిని అప్రమత్తం చేయాలి. కానీ ఉభయ జిల్లాల్లో అంతకంతకూ పెరుగుతున్న కేసుల సంఖ్యతో ఉన్నతాధికారులు, వైద్యులు హోం ఐసోలేషన్లో ఉన్న వారి పరిస్థితిని పట్టించుకోవడం లేదు. దీనితో బాధితుల్లో ఆందోళన పెరిగుతోంది.
కరోనా పాటిటివ్ సోకిన వారి ఐసోలేషన్ ముగిసిన తర్వాత మళ్లీ పరీక్ష చేయాలంటే ప్రభుత్వ అనుమతి తప్పనిసరని భద్రాద్రి కొత్తగూడెం జిల్లా వైద్యారోగ్యశాఖ అధికారి ఎల్ భాస్కర్ నాయక్ తెలిపారు. ఒక సారి వైరస్ నుంచి బయటపడ్డాక మళ్లీ తీవ్ర లక్షణాలు ఉంటే తప్ప నిర్ధారణ పరీక్షలు అవసరం లేదు. ఒకవేళ ఎవరికైనా మళ్లీ తీవ్ర లక్షణాలు ఉండి సమస్య తీవ్రమైతే అనుమతి తీసుకుని మళ్లీ పరీక్షలు చేస్తామని వెల్లడించారు. హోం ఐసోలేషన్లో ఉన్న వారికి అన్ని విధాలా అండగా ఉండాలని సిబ్బందిని ఆదేశించామని పేర్కొన్నారు.
ఏది ఏమైనప్పటికీ కరోనా లాంటి విపత్కర సమయంలో రియల్ హీరోల్లా పోరాడుతున్న వైద్యులు, సిబ్బంది వెనుకడువేయకుండా అన్నివిధాలా అండగా ఉండి ఆదుకోవాలని ప్రజలు కోరుతున్నారు. ప్రభుత్వం కూడా రెండోసారి కొవిడ్ పరీక్ష నిర్వహించేలా ఉత్తర్వులివ్వాలని విజ్ఞప్తి చేస్తున్నారు.
ఇవీచూడండి:భారత్ బయోటెక్ ల్యాబ్‌ను సందర్శించిన మంత్రి కేటీఆర్