Electricity Bill: ఖమ్మం జిల్లా కేంద్రంలో పేద ప్రజలను విద్యుత్ శాఖ సిబ్బంది ఆందోళనకు గురిచేసింది. వందల్లో వచ్చే కరెంట్ బిల్లులు ఒక్కసారిగా వేలల్లో రావడం చూసి పేద ప్రజలు అవాక్కయ్యారు. సిబ్బంది నిర్లక్ష్యం కారణంగా ఎప్పుడు కూడా 100 దాటని బిల్లులు వేలల్లో వచ్చిందని స్థానికులు వాపోయారు. ఈ కరెంటు బిల్లుల విషయమై సిబ్బందిని అడిగితే విద్యుత్ శాఖ కార్యాలయానికి వెళ్లి అడగండి అంటూ సమాధానం చెబుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.
ఖమ్మం నగరంలోని రస్తోగీనగర్ పేదలు నివాసం ఉండే బస్తీ. ఇక్కడ ఎప్పుడు వందల్లో బిల్లు కట్టే వారికి సైతం ఈసారి వేలల్లో బిల్లులు వచ్చాయి. అభివృద్ధి ఛార్జీల పేరున బిల్లులు వేశారని వారంతా చెబుతున్నారు. రెండు గదుల్లో నివాసం ఉండే ఓ పేద వృద్ధ దంపతులకు రూ.3వేలకు పైగా బిల్లు వచ్చిందని చెప్పారు. తాము ఇద్దరం వృద్ధులమని.. ఒక్కరికే పింఛన్ వస్తుందని.. దానితోనే జీవిస్తున్నామని వారు పేర్కొన్నారు. తమకు ఎప్పుడు రూ.70, 80 బిల్లు మాత్రమే వచ్చేదని ఈసారి వేలల్లో వచ్చిందని వాపోయారు. పేదవారైన తాము ఈ బిల్లు ఎలా కట్టాలని ఆందోళన చెందుతున్నారు.