రెండ్రోజుల నుంచి కురుస్తున్న వర్షాలతో.. ఉమ్మడి ఖమ్మం జిల్లాలో వరద నీరు పోటెత్తుతోంది. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచలో వర్షం కారణంగా పట్టణంలోని కేసీఆర్ నగర్ నీటమునిగింది. వరద నీరు ఇళ్లలోకి రావడం వల్ల ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. ఖమ్మం జిల్లా మధిర నియోజకవర్గంలో వాగులు ఉద్ధృతంగా ప్రవహిస్తున్నాయి. మధిర వైరా నది నుంచి ఎర్రుపాలెం కట్టలేరుకు భారీగా నీరు చేరింది. ఎర్రుపాలెం మండలం రేమిడిచర్ల వద్ద కొండవాగు పొంగి రోడ్డుపై నీరు భారీగా పొర్లుతోంది. ఈ నేపథ్యంలో ఎర్రుపాలెం నుంచి గంగినేని వైపు రాకపోకలు నిలిచిపోయాయి.
వాగులు, వంకలు
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ములకలపల్లి మండలంలో వాగులు, వంకలు పొంగిపొర్లుతున్నాయి. ములకలపల్లి-దమ్మపేట రహదారిలో గన్నేరు చెరువు నిండిపోయి రహదారిపైకి నీరు చేరింది. వాహనాల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. అశ్వారావుపేట నియోజకవర్గంలోని ములకలపల్లిలోని మూకుమ్మడి ప్రాజెక్టులోకి, అశ్వారావుపేట మండలంలో ప్రాజెక్టులోకి భారీగా వరద నీరు చేరుతోంది.