ఉమ్మడి ఖమ్మం జిల్లా వ్యాప్తంగా ఎడతెరిపిలేకుండా వర్షాలు కురుస్తున్నాయి. రోడ్లన్నీ జలమయం అయ్యాయి. ఖమ్మం, తిరుమలాయపాలెం, కూసుమంచి, కారేపల్లి, భద్రాచలం, చర్ల, దుమ్ముగూడెం, బూర్గంపాడు మండలాల్లో వర్షం జోరుగా పడుతోంది.
మరోవైపు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచ కిన్నెరసాని ప్రాజెక్టుకు వరదనీరు భారీగా వచ్చి చేరుతుంది. ఇన్‌ఫ్లో 12 వేల క్యూసెక్కులు కాగా.. రెండు గేట్లు ఎత్తి 7 వేల క్యూసెక్కుల నీరు దిగువకు విడుదల చేశారు.
మధిరలో కుండపోతగా వర్షం కురుస్తోంది. ఉదయం 9 గంటల నుంచి రెండు గంటలకు పైగా ఆగకుండా వర్షం కురుస్తూనే ఉంది. ప్రాంతాల్లో కురుస్తున్న వర్షాలకు ఇప్పటికే పెద్ద చెరువులు పొంగి పొర్లుతున్నాయి. మధిర నియోజకవర్గంలోని వైరా నది కట్టలేరు మున్నేరులో భారీగా నీరు చేరింది. చెరువులు 80 శాతానికి పైగా నీటితో నిండి కళకళలాడుతున్నాయి.
ఇల్లందు నియోజకవర్గంలో ఇల్లందు టేకులపల్లి మండలాల్లో తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షం పడింది. వర్షం కారణంగా జేకే 5, కోయగూడెం, సింగరేణి ఉపరితల బొగ్గు ఉత్పత్తికి అంతరాయం కలిగింది. ఇల్లందులో బొగ్గు ఉత్పత్తి నిలిచిపోయింది. ఉపరితల గని లోనికి వాహనాలను అనుమతించలేదు.