Harish Rao on Khammam Public Meeting: ఈ నెల 18న ఖమ్మంలో నిర్వహించే భారాస ఆవిర్భావ సభ దేశ రాజకీయాలను మలుపుతిప్పే దశగా నిలువబోతోందని రాష్ట్ర ఆర్థిక శాఖమంత్రి తన్నీరు హరీశ్‌రావు అన్నారు. ఖమ్మంలో జరిగే బహిరంగ సభకు సన్నాహంగా కూసుమంచిలో శుక్రవారం పాలేరు నియోజకవర్గ స్థాయి సన్నాహాక సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి హరీశ్‌రావు పాల్గొని మాట్లాడారు.
ఖమ్మం సభ బీఆర్ఎస్కు చాలా ముఖ్యమని మంత్రి హరీశ్‌రావు పేర్కొన్నారు. జాతీయనాయకులు సభకు వస్తున్నందున... విజయవంతానికి పార్టీ శ్రేణులు కృషిచేయాలని సూచించారు. దేశవ్యాప్తంగా తెలంగాణ నమూనాపై చర్చ జరుగుతున్న తరుణంలో జరుగుతున్న చారిత్రక సభకు ఎనలేని ప్రాధాన్యం ఉందని తెలిపారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు దేశానికే ఆదర్శంగా నిలుస్తున్నాయని చెప్పారు.
ఈ క్రమంలో దేశ ప్రజలంతా బీఆర్ఎస్ అవసరాన్ని కోరుతున్నారని మంత్రి హరీశ్‌రావు అన్నారు. భారాస ఆవిర్భావ సభ ద్వారా తమ సత్తా చాటాలని పిలుపునిచ్చారు. రైతు రుణమాఫీ, 24 గంటల విద్యుతు లాంటి పథకాలను ప్రవేశపెట్టి రైతులను ఆదుకున్న ప్రభుత్వం తమదని పేర్కొన్నారు. కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం నల్ల చట్టాలను తీసుకువచ్చి వ్యవసాయాన్ని నిర్వీర్యం చేయాలని చూసిందని మండిపడ్డారు. పాలేరు నియోజకవర్గం అన్ని విధాల అభివృద్ధి చెందిందన్నారు. భక్త రామదాసు ప్రాజెక్టుతో సాగర్ జలాల అభివృద్ధి జరిగిందని ఆయన అన్నారు. సమావేశంలో ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వరరెడ్డి, పాలేరు ఎమ్మెల్యే కందాల ఉపేందర్‌రెడ్డి, పలువురు నాయకులు మాట్లాడారు.