అవును మీరు వింటుంది నిజమే. 5వ తరగతి నుంచి ప్రభుత్వ పాఠశాలలో చదువుకున్న ఈ విద్యార్థే.. ఐఐటీ బాంబేలో(IIT BOMBAY) అడుగుపెట్టనుంది. ఈ వాడలో ఎదిగిన ఈ విద్యార్థే ఇప్పుడు బాంబే ఐఐటీ క్యాంపస్‌లో(IIT CAMPUS) ఉన్నత విద్య అభ్యసించనుంది. ఈ చిన్న ఇంట్లో నివసించే ఈ పేదింటి బిడ్డే... సివిల్ ఇంజినీర్‌గా మారి పెద్ద పెద్ద బిల్డింగులు కట్టనుంది.
చదువంతా ప్రభుత్వ పాఠశాలలోనే..
ఖమ్మం జిల్లాలోని వల్లభికి చెందిన(khammam) చెందిన సహజ కుటుంబం పొట్టకూటి కోసం హైదరాబాద్‌కు(hyderabad) వలసవచ్చారు. తండ్రి గోపాల్‌రావు ఓ చిన్న ఉద్యోగి. తల్లి ప్రగతి చుట్టుపక్కల ఇళ్లలో వంటపని చేస్తూ కుటుంబా న్ని నడిపిస్తున్నారు. ఈ పరిస్థితుల నుంచి కుటుంబాన్ని గట్టెక్కించాలంటే చదువొక్కటే మార్గమని భావించింది సహజ. టాప్ మార్కులతో 5 వ తరగతి నుంచే ప్రభుత్వ విద్యాసంస్థల్లో చదవుకునేలా ప్రవేశాలు సంపాదించింది.
అనవసర ఖర్చులు మాని పుస్తకాలకే ప్రాధాన్యం
తోటి విద్యార్థులు ఆట, పాటలు వంటి సరదాలకు సమయం కేటాయిస్తుంటే.. సహజ మాత్రం చదువుపైనే మెుత్తం దృష్టి పెట్టింది. పుట్టిన రోజు సందర్భంగా పార్టీలనే పేరుతో వృథా ఖర్చులు చేయకుండా.. పుస్తకాల కొనుగోలుకే ప్రాధాన్యమిచ్చేది. ఒక్కోసారి కావాల్సిన మెటీరియల్స్‌కు ఎక్కువ డబ్బులు కావాల్సి వచ్చినా... తండ్రి ఏ మాత్రం సంకోచింకుండా డబ్బులు ఇచ్చేవారని సహజ చెబుతోంది.