ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాల్లో పట్టభద్రుల ఎమ్మెల్సీ పోలింగ్ ప్రశాంతంగా ముగిసింది. పట్టణ ప్రాంతాల్లోనే కాకుండా మండల, గ్రామీణ, ఏజెన్సీ ప్రాంతాల నుంచి ఓటు హక్కు వినియోగించుకునేందుకు ఓటర్లు పోలింగ్ కేంద్రాలకు భారీగా తరలొచ్చారు. హైదరాబాద్, బెంగళూరు, ముంబయిలో ఉద్యోగం చేస్తున్నవారు.. ప్రస్తుతం వర్క్ ఫ్రం హోంలో భాగంగా ఇళ్ల వద్ద ఉంటున్నారు. వారందరూ ఓటు హక్కు వినియోగించుకున్నారు. ఉభయ జిల్లాల్లోనూ ఉత్సాహంగా పోలింగ్ కేంద్రాలకు తరలివచ్చిన ఓటర్లకు కష్టాలు తప్పలేదు. అడుగడుగునా పోలీసు ఆంక్షలు ఎదురవటంతో పలుచోట్ల పట్టభద్రులంతా తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు.
ప్రేమేందర్ రెడ్డిపై దాడి!
ఖమ్మం ఎస్‌ఆర్‌అండ్‌బీజీఎన్‌ఆర్ కళాశాల పోలింగ్ కేంద్రం సమీపంలో తన అనుచరులతో కలిసి ఉన్న కాంగ్రెస్ నాయకుడు మిక్కిలినేని నరేందర్‌ను రెండో పట్టణ పోలీసులు స్టేషన్‌కు తీసుకెళ్లడం వివాదానికి దారితీసింది. నరేందర్‌ను స్టేషన్‌కు తీసుకెళ్లారన్న సమాచారంతో సీఎల్పీ నేత భట్టి విక్రమార్క, ఇతర నేతలంతా పోలీస్ స్టేషన్‌కు వేళ్లారు. ఏసీపీ ఆంజనేయులు, ఇతర పోలీసు అధికారులతో వాగ్వాదానికి దిగారు. అనంతరం పోలీసులు నరేందర్‌ను స్టేషన్ నుంచి బయటకు పంపటంతో వివాదం సద్దుమణిగింది. మహబుబాబాద్ జిల్లా నెల్లికుదురులో జరిగిన దాడిలో గాయపడ్డ భాజపా ఎమ్మెల్సీ అభ్యర్థి గుజ్జుల ప్రేమేందర్ రెడ్డిని ఆ పార్టీ నాయకులు ఖమ్మం ప్రభుత్వ ఆస్పత్రికి తీసుకొచ్చారు. డబ్బులు పంచుతుంటే అడ్డుకునేందుకు ప్రయత్నించగా తెరాస కార్యకర్తలు తనపై విచక్షణారహితంగా దాడి చేశారని ప్రేమేందర్ రెడ్డి పేర్కొన్నారు. ఆయనపై దాడిని భాజపా నేతలు తీవ్రంగా ఖండించారు.
డబ్బులు పంపిణీ
ఇల్లందు సింగరేణి సీఈఆర్ క్లబ్లో అధికార పార్టీ నేతలు డబ్బులు పంపిణీ చేస్తున్నారంటూ ప్రతిపక్ష పార్టీల నాయకులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. అక్కడికి చేరుకున్న పోలీసులు.. అక్కడి నుంచి ఓటర్లను పంపించేశారు. చెరువుకట్ట మామాడి తోటలో గ్రామాల నుంచి వచ్చే ఓటర్లకు డబ్బులు పంపిణీ చేస్తుండగా పోలీసులు రంగప్రవేశం చేసి వారిని చెదరగొట్టారు.