తెలంగాణ

telangana

ETV Bharat / state

అధికారులకు గ్రామస్థులు తోడయ్యారు.. అందరికీ ఆదర్శమయ్యారు! - 30రోజుల ప్రత్యేక కార్యచరణ ప్రణాళికలో 100 శాతం సాధించిన గొల్లగూడెం

గ్రామాభివృద్ధే లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన 30 రోజుల ప్రణాళికలో ఖమ్మం జిల్లా గొల్లగూడెం పంచాయతీ ఆదర్శంగా నిలుస్తోంది. అక్కడ అధికారుల సంకల్పానికి గ్రామస్థుల సహకారం తోడవడంతో ఆ ఊరి దశే మారిపోయింది.

పల్లె ప్రగతిలో ముందున్నారు.. 100 శాతం సాధించారు..

By

Published : Oct 10, 2019, 7:24 AM IST

పల్లె ప్రగతిలో ముందున్నారు.. 100 శాతం సాధించారు..

పల్లె ప్రగతి కోసం రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన 30రోజుల ప్రత్యేక కార్యచరణ ప్రణాళికతో చాలా గ్రామాల్లో దీర్ఘకాలిక సమస్యలు పరిష్కారానికి నోచుకున్నాయి. కొన్నిచోట్ల సర్పంచి, గ్రామస్థులు సమష్టిగా ముందుకు వచ్చి గ్రామాలను అభివృద్ధి చేసుకున్నారు. ఖమ్మం జిల్లా తల్లాడ మండలం గొల్లగూడెం వాసులు ప్రణాళికలో రూపొందించిన అన్ని అంశాలు నూరుశాతం పాటించి వసతులు సమకూర్చుకున్నారు.

పాత భవనాల సుందరీకరణ...

పాఠశాల, అంగన్​వాడీకేంద్రం, పంచాయతీ భవనంతోపాటు అన్ని సామాజిక భవనాలను సుందరంగా తయారు చేశారు. ఎక్కడా మురుగునీరు నిల్వకుండా పక్కాగా కాలువలు తవ్వించారు. తడిచెత్త, పొడిచెత్త సేకరించి పంచాయతీ భవనంలో నిల్వ చేసి.. వాటి ద్వారా వచ్చే ఆదాయంతో గ్రామాభివృద్ధి చేపట్టడం వంటి కార్యక్రమాలు చేశారు.

హరితహారంలోనూ ఆదర్శం..

గ్రామ ముఖద్వారం నుంచి మొక్కలు నాటించి వాటికి రక్షణ బుట్టలు ఏర్పాటు చేశారు. అవకాశం లేని ప్రాంతాల్లో ముళ్లకంపతో రక్షణ చేపట్టారు. గతంలో నాటిన మొక్కలకు ప్రత్యేక పర్యవేక్షణతో పెంచుతున్నారు. ఇంటింటికీ తిరిగి ప్లాస్టిక్‌ రహిత గ్రామాన్ని తీర్చిదిద్దుకోవాలని ప్రజలకు అవగాహన కల్పించారు.

ప్రశంసల వర్షం...

తమ గ్రామాన్ని అన్నిరంగాల్లో అభివృద్ధి చేసుకోవాలని సర్పంచితోపాటు స్థానికుల లక్ష్యంగా భావించారు. మద్యపాన నియంత్రణ, ప్లాస్టిక్ వినియోగాన్ని నిషేధించేందుకు శ్రీకారం చుట్టారు. ప్రణాళిక పనులు ముగింపు సభకు విచ్చేసిన ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య, కలెక్టర్‌ ఆర్​వీ కర్ణన్‌లు గ్రామాభివృద్ధిని చూసి వీరిపై ప్రశంసల వర్షం కురిపించారు.

గొల్లగూడెం గ్రామంలో కాలినడకన వెళ్తూ కలెక్టర్‌ ఓ ఇంట్లో పరిశుభ్రత తనిఖీ చేసి అబ్బురపోయారు. ప్రజల్లో వచ్చిన చైతన్యానికి అభినందనలు తెలిపారు. 30 రోజులే కాకుండా ఇదే స్ఫూర్తిని కొనసాగిస్తూ ఆదర్శంగా ఉండాలని సూచించారు. గొల్లగూడెం గ్రామాన్ని స్ఫూర్తిగా తీసుకుని ప్రతి ఒక్కరూ తమ సొంతూరు అభివృద్ధికి కృషిచేయాలని కలెక్టర్ సూచించారు.

ABOUT THE AUTHOR

...view details