Gayatri Ravi Nomination: తెరాస రాజ్యసభ అభ్యర్థుల జాబితాలో ఖమ్మం జిల్లాకు బంపర్ ఆఫర్ దక్కింది. ప్రకటించిన ముగ్గురు అభ్యర్థుల జాబితాలో ఖమ్మం జిల్లా నుంచే ఇద్దరికి చోటు దక్కింది. ప్రముఖ హెటిరో డ్రగ్స్ అధినేత, బండి పార్థసారథిరెడ్డి, గాయత్రి గ్రానైట్స్ గ్రూప్ ఆఫ్ కంపెనీస్ అధినేత వద్దిరాజు రవిచంద్రను... తెరాస రాజ్యసభ అభ్యర్థులుగా ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రకటించారు. అందులో వద్దిరాజు రవిచంద్ర ఇవాళ నామినేషన్ దాఖలు చేయనున్నారు. గాయత్రి రవి ప్రముఖ గ్రానైట్ వ్యాపారిగా కాకుండా రాజకీయంగా బలమైన బీసీ సామాజిక వర్గానికి చెందిన నేతగా పేరుంది. గాయత్రి గ్రానైట్స్ గ్రూప్ ఆఫ్ కంపెనీస్ అధినేతగా ఉన్న ఆయన.. తెలంగాణ గ్రానైట్ క్వారీ ఓనర్స్ అసోసియేషన్ రాష్ట్రఅధ్యక్షుడిగా పనిచేస్తున్నారు. సీఎం కేసీఆర్‌తో ఉన్న ప్రత్యేక అనుబంధంతో గ్రానైట్ పరిశ్రమల సమస్యల పరిష్కారంలో కీలక పాత్ర పోషించారు. గత ఎన్నికల్లో వరంగల్ తూర్పునియోజకవర్గంలో కాంగ్రెస్ నుంచి పోటీ చేసి ఓడిపోయారు. ఆ తర్వాత తెరాసలో చేరారు. గాయత్రి రవి సామాజికసేవలోనూ ముందుంటారు. మేడారం జాతరకు ఏటా ప్రత్యేక విరాళాలుప్రకటిస్తారు. ప్రభుత్వ పాఠశాలలు, దేవాలయాల నిర్మాణాలకు తనవంతు విరాళం అందించారు.
ఖమ్మం జిల్లాతో సుదీర్ఘ అనుబంధం:వద్దిరాజు రవిచంద్ర మహబూబాబాద్ జిల్లా కేసముద్రం మండలం ఇనుగుర్తిలో 1964లో జన్మించారు. వద్దిరాజు నారాయణ, వెంకటనర్సమ్మ. ఇద్దరు పిల్లలు నిఖిల్, గంగాభవాని. గాయత్రి రవి మహబూబాబాద్ జిల్లాలో పుట్టినప్పటికీ.. ఖమ్మం జిల్లాతో సుదీర్ఘ అనుబంధం ఉంది. ఖమ్మం జిల్లా నుంచే గాయత్రి రవి ప్రముఖ వ్యాపార వేత్తగా గుర్తింపు పొందారు. బీకామ్ వరకు చదువుకున్నారు. ప్రస్తుతం గాయత్రి గ్రానైట్స్ గ్రూప్ ఆఫ్ కంపెనీస్ అధినేతగా ఉన్నారు. జాతీయ అంతర్జాతీయంగా గ్రానైట్ ఎగుమతులతో ప్రత్యేకత సాధించారు. వ్యాపారవేత్తగా, సామాజిక సేవకుడిగా, రాజకీయనాయకుడిగా ఉమ్మడి ఖమ్మం జిల్లా సుదీర్ఘ అనుభవం ఉంది. జిల్లాలో ప్రముఖ బీసీ నేతగా గుర్తింపు తెచ్చుకున్నారు. 2014 ఎన్నికల్లో వరంగల్ జిల్లాలో కాంగ్రెస్ పార్టీ నుంచి పోటీ చేసి ఓడిపోయారు.
ఆ తర్వాత సీఎం కేసీఆర్ సమక్షంలో రవి తెరాసలో చేరారు. అప్పటి నుంచి ఖమ్మం జిల్లా తెరాస నేతగానే కొనసాగుతున్నారు. గతంలో కొన్ని పదవులు ఆశించినప్పటికీ సామాజిక సమీకరణాల నేపథ్యంలో దక్కలేదు. ఖమ్మం స్థానిక సంస్థల కోటా ఎమ్మెల్సీ అభ్యర్థిత్వం ఆశించారు. రాష్ట్రస్థాయి కార్పొరేషన్ పదవి కట్టబెడతామని సీఎం హామీ ఇస్తే సున్నితంగా తిరస్కరించారు. రాష్ట్రంలో పలుచోట్ల జరిగిన ఉప ఎన్నికల్లో తెరాస తరపున బీసీ కులాలను ఏకం చేసి ముఖ్యమంత్రి కేసీఆర్ నుంచి అభినందనలు సంపాదించారు. గాయత్రి రవి సామాజిక సేవలోనూ ముందుంటారన్న పేరుంది. మేడారం జాతరకు ఏటా ప్రత్యేక విరాళాలు ప్రకటించి సేవా గుణాన్ని చాటుకుంటారు. తలసేమియా చిన్నారులకు అవసరం వచ్చినప్పుడల్లా తన వంతు ఆర్థిక సహకారం అందిస్తున్నారు. ప్రభుత్వ పాఠశాలలు, దేవాలయాల నిర్మాణాలకు తనవంతు విరాళం అందజేశారు. వద్ధిరాజు రవిచంద్రకి రాజ్యసభ అవకాశ దక్కడంపై ఖమ్మంలో అభిమానులు వేడుకలు చేసుకున్నారు. బుర్హాన్‌పురంలోని ఆయన నివాసం వద్ద బాణాసంచా కాల్చి... శుభాకాంక్షలు చెప్పుకున్నారు. ఖమ్మంలో బైక్ ర్యాలీ నిర్వహించారు..