Ganesh chathurthi 2022 సికింద్రాబాద్ మరకత గణపతి ఆలయంలో గణేశ్ చతుర్థి పురస్కరించుకొని ప్రత్యేక పూజలు నిర్వహించారు . మరకత శ్రీ లక్ష్మీ గణపతి స్వామి వారికి అభిషేకంతో పాటు యజ్ఞ హోమాధి కార్యక్రమాలు నిర్వహించారు. సికింద్రాబాద్ గణేశ్ దేవాలయంలో పశుసంవర్ధక శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్, కార్మిక శాఖ మంత్రి మల్లారెడ్డి కుటుంబసమేతంగా ప్రత్యేక పూజలు నిర్వహించారు.
చారిత్రక ఓరుగల్లు వేయిస్తంభాల గుడిలో నవరాత్రి ఉత్సవాలను ప్రారంభించిన పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు ప్రత్యేక పూజలు నిర్వహించారు. మట్టి గణపతిని పూజించి పర్యావరణాన్ని కాపాడాలని ఆయన కోరారు. భక్తుల దర్శనార్థం సౌకర్యాలు ఏర్పాటు చేశామని నిర్వాహకులు తెలిపారు. హనుమకొండ జిల్లా కాజీపేట శ్వేతార్క గణపతి ఆలయంలో వినాయక చవితి పర్వదిన వేడుకలు ఘనంగా జరిగాయి. స్వామివారికి సప్త వర్ణాలతో, పంచామృతాలతో అర్చకులు అభిషేకాలు నిర్వహించారు. గణనాథుడికి పట్టు వస్త్రాలు సమర్పించి వెండి కవచాలతో ప్రత్యేక అలంకరణ చేశారు. భక్తులు గణేశుడిని దర్శించుకుని తీర్థప్రసాదాలు స్వీకరించారు.
యాదాద్రి శ్రీలక్ష్మీ నరసింహ స్వామి సన్నిధిలో లంబోదరుడి వేడుకలు ఘనంగా నిర్వహించారు. శివాలయంలో ఏకదంతుడి విగ్రహాన్ని ప్రతిష్ఠించారు. నవరాత్రులు పూజలు చేపడతామని అర్చకులు తెలిపారు. నిర్మల్ పోతులూరి వీరబ్రహ్మేంద్రస్వామి ఆలయంలో కర్ర వినాయకుడికి దేవాదాయశాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి తొలిపూజ నిర్వహించారు . విఘ్నేశ్వరుని కృపతో ప్రజలందరూ సుభిక్షంగా ఉండాలని వేడుకున్నట్లు మంత్రి తెలిపారు. ఆదిలాబాద్‌లో హిందూ ఉత్సవ సమితి ఆధ్వర్యంలో ప్రతిష్ఠించిన మట్టి వినాయకుడికి మున్సిపల్ చైర్మన్ జోగు ప్రేమేందర్ తొలి పూజ చేశారు. ఎమ్మెల్యే జోగు రామన్న మట్టి వినాయకులను పంపిణీ చేశారు . భద్రాద్రి జిల్లా ఇల్లందు మండలం సుభాష్ నగర్ శ్రీ కోదండ రామాలయంలో...ఓ భక్తుడు 151 కేజీల లడ్డూను సమర్పించారు .