తెలంగాణ

telangana

ETV Bharat / state

మృత్యువుతో పోరాడి ఓడిన బాలిక... ఖమ్మంలో అంత్యక్రియలు పూర్తి - khammam girl

పేదరికమే ఆ బంగారు తల్లి పాలిట శాపమైంది. కరోనా కాటులో తల్లిదండ్రులకు తనవంతు సాయం చేసేందుకు ఓ ఇంట్లో పనికి చేరగా.. నూరేళ్ల బంగారు భవిష్యత్‌ 13 ఏళ్లకే ముగిసింది. ఇంటి యజమాని కొడుకు రూపంలో ఉన్న మృగాడి పైశాచిక దాడిలో తీవ్రంగా గాయపడ్డ ఖమ్మం బాలిక.. 27 రోజుల పాటు మృత్యువుతో పోరాడి తనువు చాలించింది. బాలిక క్షేమంగా తిరిగి వస్తుందనుకున్న తల్లిదండ్రుల ఆశలు అడియాశలయ్యాయి.

Funeral for girl's dead body completed in Khammam
మృత్యువుతో పోరాడి ఓడిన బాలిక... ఖమ్మంలో అంత్యక్రియలు పూర్తి

By

Published : Oct 16, 2020, 5:07 PM IST

మృత్యువుతో పోరాడి ఓడిన బాలిక... ఖమ్మంలో అంత్యక్రియలు పూర్తి

ఖమ్మం నగరానికి చెందిన అల్లం మారయ్య అనే మృగాడి పైశాచిక దాడిలో తీవ్రంగా గాయపడ్డ 13 ఏళ్ల చిన్నారి చివరకు మృత్యువుతో పోరాడలేక తనువు చాలించింది. ఒంటి నిండా 70 శాతం కాలిన గాయాలతో బతుకు పోరాటం చేసిన బాలిక చివరకు.. మృత్యుఒడికి చేరింది. ఆస్పత్రిలో చికిత్స పొందుతూ.. తల్లిదండ్రులకు ధైర్యం చెప్పిన ఆ 13 ఏళ్ల బాలిక 27 రోజుల పోరాటం ముగించి కన్నవారికి తీరని శోకాన్ని మిగిల్చింది. సెప్టెంబర్ 18న ఖమ్మం నగరంలో పైశాచిక దాడి ఘటన 17 రోజుల తర్వాత వెలుగులోకి వచ్చింది. ఇంట్లో పనికి కుదిరిన బాలికపై యజమాని కుమారుడు మారయ్య అత్యాచారయత్నానికి పాల్పడ్డాడు. ప్రతిఘటించిన బాలికపై పెట్రోల్ పోసి నిప్పంటించాడు. గుట్టుచప్పుడు కాకుండా ఖమ్మంలోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చికిత్స అందించారు. అక్టోబర్ 5న ఈ అమానుష ఘటన బయటపడింది. స్పందించిన అధికారులు బాలికకు మెరుగైన వైద్యం కోసం వివిధ ఆస్పత్రులకు తరలించి చికిత్స అందించినా ఫలితం లేకుండా పోయింది.

అంజలి ఘటించిన మంత్రి

బాలిక స్వగ్రామానికి మృతదేహం చేరగా.. విగత జీవిగా పడి ఉన్న కూతురి మృతదేహం చూసి తల్లిదండ్రులు బోరున విలపించారు. మంత్రి పువ్వాడ అజయ్​కుమార్​, ఎమ్మెల్యే ఉపేందర్‌రెడ్డి, కలెక్టర్ ఆర్వీ కర్ణన్, పోలీస్ కమిషనర్ తఫ్సీర్ ఇక్బాల్ బాలిక మృతదేహానికి అంజలి ఘటించారు. ప్రభుత్వం తరపున 2 లక్షల చెక్కును మంత్రి పువ్వాడ అజయ్‌ బాలిక తల్లిదండ్రులకు అందజేశారు.

కఠినంగా శిక్షించాలి..

కడసారి చూసేందుకు తరలివచ్చిన గ్రామస్థులు, మహిళా సంఘాలు బాలిక మృతదేహాన్ని చూసి కన్నీటి పర్యంతమయ్యారు. పైశాచిక దాడికి పాల్పడ్డ మృగాడిని కఠినంగా శిక్షించాలని మహిళా సంఘాలు డిమాండ్ చేశాయి.

అశ్రునయనాల మధ్య అంత్యక్రియలు

కుటుంబసభ్యులు, బంధువులు, గ్రామస్థుల అశ్రునయనాల మధ్య బాలిక అంత్యక్రియలు నిర్వహించారు. బతుకమ్మ పండుగ రోజే బాలిక అనంతలోకాలకు వెళ్లిపోయిందని మహిళలు కన్నీటిపర్యంతమవడం అందరినీ కంటతడి పెట్టించింది.

ఇవీ చూడండి: యజమాని కుమారుడి చేతిలో కిరాతకానికి గురైన బాలిక మృతి

ABOUT THE AUTHOR

...view details