భారీ వర్షాలతో పూర్వ ఖమ్మం జిల్లా తడిసి ముద్దయింది. ఎడతెరిపి లేని వర్షంతో వాగులు వంకలు పొంగిపొర్లుతున్నాయి. సింగరేణి మండలంలో అత్యధికంగా 28.2 మి.మీ. వర్షపాతం నమోదైంది. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో 30.3మి.మి. సగటు వర్షపాతం నమోదైంది. జిల్లాలో అత్యధికంగా చర్ల మండలంలో 68.4మి.మీల వర్షపాతం నమోదైంది. జిల్లాలోని 12 మండలాల్లో సాధారణ వర్షం కురవగా 4 మండలాల్లో భారీ వర్షం కురిసింది.
భద్రాచలం వద్ద గోదావరి పరవళ్లు
ఎడతెరిపిలేని వర్షాలతో ప్రధాన జలాశయాలకు వరద పోటెత్తుతోంది. మూడురోజులుగా కురుస్తున్న వర్షాలతో పాటు ఎగువ నుంచి వచ్చి చేరుతున్న భారీ వరదతో భద్రాచలం వద్ద గోదావరి గోదావరి పరవళ్లు తొక్కుతోంది. గురువారం సాయంత్రం 35.5 అడుగుల నీటి మట్టం ఉండగా.. శుక్రవారం సాయంత్రం 37.3 అడుగులకు చేరింది. ఎగువ ప్రాంతం నుంచి వరద ప్రవాహం కొనసాగుతుండటంతో నీటి మట్టం ఇంకా పెరిగే అవకాశం ఉందని అధికారులు భావిస్తున్నారు.
ముంపు ప్రాంతాలు అప్రమత్తం
గోదావరి వరద పోటుతో ముంపునకు గురయ్యే తోలట్టు ప్రాంతాల ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించాలని సెక్టోరియల్ అధికారులు, మండల అధికారులను జిల్లా కలెక్టర్ ఎంవీ రెడ్డి ఆదేశించారు. గోదావరి వద్ద గజ ఈతగాళ్లను అందుబాటులో ఉంచాలని ఆదేశాలు జారీచేశారు. గోదావరి ప్రవాహానికి పర్ణశాల వద్ద సీతమ్మ నారచీరల ప్రాంతం వరద నీటిలో మునిగిపోయింది.