ముగిసిన ఎఫ్ఆర్ఓ శ్రీనివాసరావు అంత్యక్రియలు.. పాడె మోసిన మంత్రులు FRO Srinivasa Rao Funeral : ఎఫ్ఆర్ఓ శ్రీనివాసరావు అంత్యక్రియలు ఖమ్మం జిల్లా రఘునాథపాలెం మండలం ఈర్లపూడిలో పూర్తయ్యాయి. సీఎం ఆదేశాల మేరకు ప్రభుత్వ లాంఛనాలతో జరిగిన అంతిమ సంస్కారాల్లో మంత్రులు ఇంద్రకరణ్ రెడ్డి, పువ్వాడ అజయ్ కుమార్ సహా.. ఎంపీ రవిచంద్ర, ఎమ్మెల్సీ తాత మధు ఎమ్మెల్యే రేగా కాంతారావు పాల్గొన్నారు. విధుల్లో అమరుడైన అటవీ అధికారికి అంజలి ఘటించారు.
అంతిమయాత్రలో టీఆర్ఎస్ మంత్రులు.. ఎఫ్ఆర్ఓ శ్రీనివాసరావు పాడె మోశారు. ఖమ్మం, భద్రాద్రి జిల్లాల కలెక్టర్లు, ఎస్పీలతో సహా.. అటవీశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ శాంతకుమారితోపాటు పలువురు అటవీ అధికారులు అంతిమ సంస్కారాల్లో పాల్గొన్నారు. శ్రీనివాసరావు కుటుంబ సభ్యులు, తోటి అధికారుల రోదనలతో ఈర్లపూడిలో విషాయఛాయలు అలముకున్నాయి. మరోపక్క పోడు భూముల విషయంలో తాము తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని అటవీ అధికారులు ఆందోళనకు దిగారు.
మంగళవారం రోజున ఎఫ్ఆర్ఓ శ్రీనివాసరావుపై జరిగిన దాడిపై తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేసిన సీఎం.. దోషులకు కఠినంగా శిక్షలు పడేలా చట్టపరమైన చర్యలు తీసుకోవాలని డీజీపీ మహేందర్ రెడ్డిని ఆదేశించారు. శ్రీనివాసరావు కుటుంబానికి 50 లక్షల రూపాయల పరిహారాన్ని ప్రకటించారు. డ్యూటీలో ఉన్నప్పుడు శ్రీనివాసరావుకు అందే జీతభత్యాలన్నీ పదవీవిరమణ వయస్సు వచ్చేవరకూ ఆయన కుటుంబానికి అందేలా చర్యలు తీసుకోవాలని అధికారులను ముఖ్యమంత్రి ఆదేశించారు. కారుణ్య నియామకం కింద కుటుంబ సభ్యుల్లో అర్హులైన వారికి ప్రభుత్వ ఉద్యోగం ఇవ్వాలని చెప్పారు. ఉద్యోగులకు ప్రభుత్వం అండగా ఉంటుందని.. ఎలాంటి జంకూ లేకుండా విధులు నిర్వర్తించాలని సీఎం కేసీఆర్ భరోసా ఇచ్చారు.
"ఇలాంటి సంఘటనల ద్వారా సిబ్బంది ఆత్మ స్థైర్యాన్ని దెబ్బతీయడం ఎవరి వల్ల కాదు. పోడు సమస్యకు శాశ్వత పరిష్కారాన్ని చూపించడంతో పాటు అడవులను పరిరక్షించే చర్యలపై సీఎం సమీక్షిస్తున్నారు. ప్రత్యేకంగా గుత్తికోయలు పక్క రాష్ట్రాల నుంచి ఇక్కడకు వచ్చి ఇలాంటి దాడులకు పాల్పడాలని చూస్తే మాత్రం రాష్ట్ర ప్రభుత్వం చూస్తూ ఊరుకోదు’' - పువ్వాడ అజయ్ కుమార్, మంత్రి
"వచ్చే డిసెంబరు నాటికి పోడు భూములకు సంబంధించి నెలకొన్న సమస్యలను పరిష్కరించేందుకు సీఎం కేసీఆర్ కృషి చేస్తున్నారు. అర్హులకు ఆర్‌వోఎఫ్‌ఆర్ పట్టాలు అందించేందుకు అన్ని చర్యలు తీసుకుంటున్నారు. దీనిపై ఎక్కడా ఎలాంటి వ్యతిరేకత లేదు. అక్రమంగా తెలంగాణకు వలసవచ్చిన గుత్తికోయలు ఇలాంటి దారుణానికి పాల్పడటం సరైంది కాదు. గత కొన్నేళ్లుగా ఆయుధాలు ఇవ్వాలని అటవీ శాఖ అధికారులు ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నారు. చట్టపరంగా ప్రస్తుతం ఇది సాధ్యం కాదు. ప్రస్తుత చట్టాల్లో సవరణలు చేసి అటవీ శాఖ అధికారులకు ఆయుధాలు కేటాయించాలని ఎంతో మంది ఫోన్లు చేసి చెబుతున్నారు. ఇలాంటి ఘటనలు జరగకుండా అన్ని చర్యలు తీసుకుంటాం."- ఇంద్రకరణ్‌రెడ్డి, మంత్రి