ponguleti srinivas reddy meets YS Sharmila : మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస రెడ్డి వైఎస్సార్టీపీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిలతో భేటీ అయ్యారు. కొంతకాలంగా బీఆర్ఎస్ అధిష్ఠానంపై అసంతృప్తిగా ఉన్న ఆయన షర్మిలతో భేటీ కావడం ప్రాధాన్యం సంతరించుకుంది. చాలా రోజులుగా పొంగులేటి బీఆర్ఎస్ కార్యక్రమాలకు దూరంగా ఉంటున్నారు. అంతేకాకుండా పొద్దు ముగిసిన తర్వాత ఏ గూటి పక్షి ఆ గూటికి వస్తుందన్నది వాస్తవమని ఇటీవల ఆయన ఆత్మీయ సమ్మేళనంలో వ్యాఖ్యలు చేశారు. ఈ వ్యాఖ్యలతో ఆయన సొంతగూటికి చేరతారన్న ప్రచారం రాజకీయ వర్గాల్లో నడుస్తోంది. ఈ క్రమంలోనే ఆయన షర్మిలతో భేటీ కావడంతో ఆయన వైఎస్సార్టీపీలో చేరతారని రాజకీయ వర్గాల్లో టాక్ నడుస్తోంది.
Ponguleti Srinivas Reddy: వైఎస్ షర్మిలతో పొంగులేటి భేటీ
11:31 January 24
వైఎస్ షర్మిలతో మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి రెడ్డి భేటీ
ponguleti meets YS Sharmila : ముఖ్యమంత్రి కేసీఆర్ తనకిచ్చిన మాట తప్పారని.. ఇన్నేళ్లు ఆయన మాటకు కట్టుబడి ఉన్నానని పొంగులేటి అన్నారు. గత ఎన్నికల్లో ఇండిపెండెంట్‌గానైనా పోటీ చేయాలని ఎంతోమంది కోరినా తాను నిరాకరించానని ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. సీఎం కేసీఆర్ చెప్పిన మాటలతో పార్టీ నియమాలకు కట్టుబడి ఉన్నానని పేర్కొన్నారు. అనేక కారణాలు చూపుతూ తన ఎంపీ స్థానానికి కూడా పోటీ చేసే అవకాశం ఇవ్వకుండా మరో పార్టీకి చెందిన వ్యక్తిని పోటీలో నిలిపారని గుర్తు చేసిన ఆయన.. నాలుగేళ్లుగా తనను నమ్ముకున్న వారికి ఏమీ చేయలేకపోయానని వాపోయారు.
నాలుగేళ్లుగా తనకు ఏ పదవీ ఇవ్వకపోయినా ఆత్మగౌరవంతో ఉంటూ అనేక కార్యక్రమాల్లో పాల్గొంటూ వస్తున్నానని పొంగులేటి పేర్కొన్నారు. కష్టాలను ఎదుర్కొంటూ తనతో పాటు ప్రయాణిస్తున్న ప్రతి ఒక్కరికి ఈ సందర్భంగా ధన్యవాదాలు తెలిపారు. ఇల్లందు ఆత్మీయ సమ్మేళనానికి రాకుండా అభిమానులకు అనేక అడ్డంకులు సృష్టించారని ఆరోపించిన ఆయన.. రాబోయే రోజుల్లో నియోజకవర్గంలో ఏ అధికారి కానీ, ప్రజా ప్రతినిధి కానీ అభిమానులను ఇబ్బందులు పెడితే శీనన్న ప్రత్యక్షమవుతాడని హెచ్చరించారు. పొద్దు ముగిసిన తర్వాత ఏ గూటి పక్షి ఆ గూటికి వస్తుందన్నది వాస్తవమని.. ఎలాంటి అడ్డంకులు దీని ముందు చెల్లవని వ్యాఖ్యానించారు.
రాబోయే కురుక్షేత్రంలో తాను కచ్చితంగా యుద్ధంలో పాల్గొనబోతున్నానని స్పష్టం చేశారు. గత నాలుగేళ్లుగా ఏ పదవిలో లేకపోయినా.. ప్రజలతోనే మమేకమవుతూ వచ్చానని తెలిపారు. జిల్లా ప్రజలు కోరుకున్నట్లు ముందుకెళ్తానని పేర్కొన్నారు. "రాజకీయ నాయకుడు ప్రజల దీవెనలు, అభిమానులు పొందిన నాడే రాజకీయాల్లో రాణిస్తాడు. ఉమ్మడి ఖమ్మం జిల్లా ప్రజలు కోరుకున్నట్లు ముందుకెళ్తాను. రాబోయే ఎన్నికల్లో, కురుక్షేత్రంలో కచ్చితంగా యుద్ధంలో పాల్గొంటా అని ప్రకటించారు.