Ponguleti On Telangana Govt: కరోనా కారణంగా రాష్ట్ర రైతాంగానికి రుణమాఫీ చేయలేదని చెబుతున్న ప్రభుత్వం.. మరి వందల కోట్లు ఖర్చు చేసి కొత్త సచివాలయం ఎందుకు నిర్మిస్తోందని మాజీ ఎంపీ, బీఆర్ఎస్ అసమ్మతి నేత పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి ప్రశ్నించారు. గొప్పలకు పోయే బదులు.. కష్టకాలంలో ఉన్న రైతులను ఆదుకునేందుకు ఆ డబ్బు ఎందుకు రుణమాఫీకి ఖర్చు చేయడం లేదన్నారు.
పేరు బ్రాండ్, నామస్మరణ కోసం తప్ప తెలంగాణ బిడ్డల బాగోగులపై పాలకులు ఆలోచించడం లేదని విమర్శించారు. ఖమ్మం జిల్లా వైరాలో రాష్ట్ర మార్క్ ఫెడ్ వైస్ ఛైర్మన్ బొర్రా రాజశేఖర్ అధ్యక్షతన నిర్వహించిన నియోజకవర్గ కార్యకర్తల ఆత్మీయ సమ్మేళనంలో పొంగులేటి మట్లాడారు. పాలకుల విధానాలు, ప్రభుత్వ పథకాలపై విమర్శలు చేశారు. కేవలం గొప్పలు, నామస్మరణ కోసం తప్పా తెలంగాణ బిడ్డల బాగోగులను పాలకులు ఆలోచించడం లేదన్నారు.
గడిచిన 9 ఏళ్లలో తెలంగాణ బిడ్డలు కన్నకలలను ఏ మేర నెరవేర్చామన్నది, అధికారంలో ఉన్నవారు ఆత్మపరిశీలన చేసుకోవాలని సూచించారు. రాష్ట్రంలో ఒక్క నెలలోనే ధరణిని క్రమపద్ధతిలో పెడతామని ప్రభుత్వం చెప్పినా, ఏడాదిన్నరగా రైతులు, ప్రజలు ఇబ్బందులు పడుతున్నారన్నారు. 16 నెలలు దాటినా ధరణిలో పరిష్కారానికి నోచుకోని అంశాలు పదికిపైనే ఉన్నాయన్నారు.