తెలంగాణ

telangana

ETV Bharat / state

Bio Diversity: జీవ వైవిధ్యానికి ఆకుపచ్చ బాట - మణుగూరు అటవీ ప్రాంతంలో జీవ వైవిధ్యం

Biodiversity In Manuguru Forest: అడవి అంటే జంతు ఒడి. పచ్చని చెట్లతో మనసును మురిపించే బృందావనమది. పక్షుల కిలకిలారావాలకు.. క్రిమికీటకాదుల స్వేచ్ఛా సంచారానికి అరణ్యమే శరణ్యం. మనిషి అవసరాలు శ్రుతిమించి.. విలాసాలుగా మారడంతో అడవి చిన్నబోతోంది. జీవావరణం దెబ్బతింటోంది. పోయిన చోటే వెతుక్కుంటూ.. కోల్పోయిన ప్రకృతిసంపదను పరిరక్షించే ప్రయత్నం చేస్తోంది భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మణుగూరు అటవీ యంత్రాంగం. వినూత్న పద్ధతుల్లో ప్రయోజనాలు ఒనగూరేలా ప్రయత్నంచేస్తూ.. శభాష్ అనిపించుకుంటోంది.

forest
forest

By

Published : May 4, 2023, 9:46 AM IST

జీవవైవిధ్యానికి ఆకుపచ్చ బాట పట్టిన.. రాష్ట్ర ప్రభుత్వం

Biodiversity In Manuguru Forest: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మణుగూరు అటవీ డివిజన్‌లో పలు రకాల వృక్షాలతో పాటు.. పెద్దసంఖ్యలో వనజీవులున్నాయి. బొగ్గు గనులు, గోదావరిపై ఆనకట్టల నిర్మాణాలు, విద్యుత్‌ కేంద్రాలకు రైల్‌ మార్గం అలా అన్నీ అటవీ భూభాగం మీదుగానే విస్తరించాయి. ఇంకా విస్తరిస్తుండటంతో.. అడవి, వన్యప్రాణుల ఉనికికి ప్రమాదం ఏర్పడుతోంది. ఈ తరుణంలో వన్యప్రాణుల సంతతిని పెంచేందుకు.. అధికార యంత్రాంగం రాష్ట్రంలో ఎక్కడా లేనివిధంగా వినూత్న పద్ధతులను తెరపైకి తెచ్చింది. గడ్డిజాతి ప్రాణులు, పక్షి జాతుల వృద్ధిపై ప్రత్యేక దృష్టిసారించారు. 6 నెలలుగా ప్రత్యేక కార్యక్రమాలు అమలు చేస్తూ సానుకూల ఫలితాలు సాధిస్తున్నారు.

అడవిలో గడ్డి పెంపకం: అటవీ డివిజన్‌లో మూడుచోట్ల సోలార్‌ వ్యవస్థ ఏర్పాటు చేశారు. 6 బోర్లు వేసి.. కొలనులు నిర్మించారు. నిరంతరాయంగా ఆ బోరు నీరు కొలనులో చేరుతోంది. అదేచోట ఫైబర్ ఎక్కువగా.. ఉండే గడ్డి విత్తనాలు చల్లారు. నీరు అందడం వల్ల గడ్డి ఏపుగా పెరిగింది. ఆ గడ్డిని తిని నీరుతాగి జంతువులు ముందుకెళ్తున్నాయి. వేసవిలో జంతువుల అలసట తీర్చడంలో భాగంగా గడ్డి విస్తరించిన ప్రాంతాల్లో ఉప్పుతో కలిపిన రేగడి మట్టి గుంతలు ఏర్పాటు చేశారు. తద్వారా జంతువులకు లవణాలు అందుతున్నాయి. మార్చి నుంచి గడ్డి ఎండిపోతుండటంతో ఆహారం లభించక.. చాలా ప్రాణులు చనిపోతున్నాయి. ఆ విషయాన్ని గుర్తించిన అధికారులు ఫిబ్రవరి నుంచి జూన్‌ వరకు వాటికి ఆహారం అందించేందుకు గడ్డి పెంపకం చేపట్టారు.

పక్షిజాతుల కోసం కొలను ఏర్పాటు చేశారు. వెదురుజాతి చెట్లున్న చోట సుమారు 10 హెక్టార్ల విస్తీర్ణంలో అందుబాటులోకి తెచ్చారు. కొలను చుట్టూ గడ్డి పెంచి పురుగులు, పాముల సంచారం పెరిగేలా చర్యలు చేపట్టారు. పురుగులు వస్తే తొండలు, కప్పలు చేరతాయి. వాటికోసం పక్షులు వచ్చి వాలుతాయి. వచ్చిన పక్షులు గూళ్లు పెట్టుకునేందుకు వీలుగా వెదురు కర్రలు ఉపయోగపడుతున్నాయి. నేలపై పడిన విత్తనాలు అగ్గికి కాలిపోకుండా కాపాడి మొక్కలు సంరక్షించారు. ఆ మొక్కలు జంతువులకు ఆహారంగా మారాయి.

ఆ విధంగా వాటి సంరక్షణకు శ్రీకారంచుట్టినట్లు అటవీ అధికారులు చెబుతున్నారు. అటవీ సంరక్షణకు మణుగూరు అటవీ అధికారులు, సిబ్బంది చేస్తున్న కృషిపై ప్రశంసలు వస్తున్నాయి. రాష్ట్రవ్యాప్తంగా అన్నీ అటవీ డివిజన్ల పరిధిలో ఈ తరహా కార్యక్రమాలు చేపడితే అడవులు పది కాలాల పాటు పచ్చగా కళకళలాడుతుందనడంలో ఏమాత్రం సందేహం లేదు.

"బుగ్గ ఈస్ట్​ ఫారెస్ట్​ను ఎందుకు సెలక్ట్​ చేసుకున్నామంటే.. ఇక్కడ మనుషుల సంచారం ఎక్కువగా లేదు. ఈ ప్రాంతంలో చెక్​పోస్ట్​ ఉండడం వల్ల మనుషులు సంచారం అంతగా లేదు. రాబోయే రోజుల్లో వన్య ప్రాణులకు కావాల్సిన అన్ని వసతులను కల్పిస్తాం. పర్యాటకులు వీక్షించడానికి వ్యూ పాయింట్​ కూడా ఏర్పాటు చేయబోతున్నాము." - మక్సూద్ మొయినుద్దీన్, ఫారెస్ట్‌ డివిజన్ అధికారి

ఇవీ చదవండి:

ABOUT THE AUTHOR

...view details