Annam Foundation Women in Social Service: సరస్వతి, ఈశ్వరమ్మ, భూమా, దేవిశ్రీ, అనూష.. ఖమ్మం జిల్లా సేవామూర్తులు.! జిల్లా పరిసరాల్లో రోడ్లు, రైలు పట్టాలపై గుర్తుతెలియని మృతదేహాలు కనిపించినా.. చెరువులు, కుంటల్లో పడి చనిపోయిన వారి దేహాలు బయటపడినా.. మొదట వినిపించేది వీరి పేరే..! ఈ ఐదుగురే ఆ నలుగురై ముందుంటారు. అందరూ వెనకడుగు వేసినా... ధైర్యంగా ముందుకొచ్చి మృతదేహాలను శవాగారాలకు తరలిస్తారు. అనాథ శవాలకు అంతిమ సంస్కారాలూ నిర్వహిస్తారు.
దిక్కు తోచని స్థితి నుంచి
ఖమ్మంలోని 'అన్నం ఫౌండేషన్'.. ఎన్నోఏళ్లుగా అన్నార్థులు, అభాగ్యుల పాలిట ఆశాదీపంగా నిలుస్తోంది. అన్నం శ్రీనివాసరావు ప్రారంభించిన ఆశ్రమం.. ప్రస్తుతం 400 మందిని కంటికి రెప్పలా కాపాడుతోంది. శ్రీనివాసరావు స్ఫూర్తితో సేవ చేయగలమంటూ.. స్వచ్ఛంద సంస్థలో చేరారు.. సరస్వతి, ఈశ్వరమ్మ, భూమా..! అనాథలు, మానసిక వికలాంగులు అన్నీ తామై సేవలు అందిస్తున్న వీరికి తోడుగా రెండేళ్ల క్రితం దేవిశ్రీ, అనూష అనే యువతులు ఇద్దరూ చేరారు. రోడ్డు, రైలు ప్రమాదాలు, ఆత్మహత్యల సందర్భాల్లో వీరు ధైర్యంగా ముందడుగు వేస్తూ.. మృతదేహాలను శవాగారాలకు తరలిస్తారు. మగవారు సైతం సాహసం చేయలేని పరిస్థితుల్లోనూ ఈ మహిళలు.. ఏమాత్రం జంకులేకుండా ముందగుడు వేస్తున్నారు. ఫౌండేషన్ సాయంతో దిక్కుతోచని స్థితి నుంచి బయటపడిన తాము.. దిక్కుమొక్కూ లేని వారికి అండగా నిలవాలనే ఈ సేవ చేస్తున్నామని మహిళలు చెబుతున్నారు.
అనాథ మృతదేహాలకు అంత్యక్రియలు