మక్కకు దొరక్కపాయే మద్ధతు ధర...! Low Maize Prices In Khammam : ఉమ్మడి ఖమ్మం జిల్లాలో అకాల వర్షాల ప్రభావం అత్యధికంగా మొక్కజొన్న రైతులపైనే పడింది. 25 వేల 603 ఎకరాల్లో పంట దెబ్బతినగా 13 వేల 404 మంది రైతులు పంట నష్టపోయారు. చేతికందే దశలో వర్షార్పణం అవటంతో కోట్ల రూపాయల పెట్టుబడులు కోల్పోయారు. జిల్లా వ్యాప్తంగా గడచిన సీజన్‌లో 90 వేల 709 ఎకరాల్లో మొక్కజొన్న సాగైంది. ఎకరానికి సుమారు 40 క్వింటాళ్ల దిగుబడి రావాల్సి ఉన్నప్పటికీ ప్రకృతి ప్రకోపంతో 25 క్వింటాళ్లు మించదని ప్రభుత్వం అంచనా వేసింది.
దళారులు దోచుకుంటున్నారు: ఎన్నో ఆటుపోట్ల నుంచి పంటను కాపాడుకున్న రైతులకు అమ్ముకోవటంలో అవస్థలు ఎదురవుతున్నాయి. ఖమ్మం జిల్లాలో 2 లక్షల 43వేల మెట్రిక్ టన్నుల దిగుబడి అంచనా వేయగా మార్క్‌ఫెడ్ ద్వారా 60 వేల 775 మెట్రిక్ టన్నులు సేకరించాలని ప్రభుత్వం నిర్ణయించింది. భద్రాద్రి జిల్లాలో 28 వేల 480 ఎకరాల్లో సాగైన మొక్కజొన్న పంట నుంచి 76 వేల 326 మెట్రిక్ టన్నుల దిగుబడి వస్తుందని అంచనా వేస్తున్నారు. ప్రభుత్వం కొనుగోళ్లు ప్రారంభించకపోవటంతో దళారులు అందినకాడికి దోచుకుంటున్నారని అన్నదాతలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
ప్రకటన ఇచ్చారు కానీ ఎప్పుడు కొంటారు: మక్క రైతులకు అండగా ఉండేందుకు ఏప్రిల్ నెలాఖరు నుంచి ఉభయ జిల్లాల్లో మార్క్‌ఫెడ్ కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ప్రకటన వెలువడి 10 రోజులు దాటుతున్నా మార్క్‌ఫెడ్ కేంద్రాల జాడ లేకపోవటంతో రైతులకు ఎదురుచూపులు తప్పటం లేదు. మరో వైపు అకాల వర్షాల నుంచి ధాన్యం మొలకెత్తుతూ రైతుకు కంటి మీద కునుకు లేకుండా చేస్తోంది. ఇదే అదనుగా భావించిన దళారులు అన్నదాతలను నిలువు దోపిడికి యత్నిస్తున్నారు. ప్రభుత్వం మక్కలకు రూ.1962 మద్దతు ధర ప్రకటించినా రూ.1600 నుంచి రూ.1800లకే కొనుగోలు చేస్తున్నారు. నాణ్యత పేరుతో, తడిచిందన్న సాకుతో కొన్ని చోట్ల రూ.1500 అడుగుతున్నారు. ప్రభుత్వ కొనుగోళ్లపై ఆశలు వదులుకున్న అన్నదాతలు తప్పనిసరి పరిస్థితులలో ప్రైవేటు వ్యాపారుల వైపు మొగ్గు చూపుతున్నారు.
నష్టాలు ముఖ్య కారణం ప్రభుత్వమే: దళారులు అడిగిన ధరకే అమ్మితే రైతులు భారీ నష్టాలు మూటగట్టుకోవాల్సి వస్తోంది. మార్క్‌ఫెడ్ కేంద్రాలు ఏర్పాటయ్యే నాటికి రైతుల వద్ద మక్కలు ఖాళీ అయ్యే పరిస్థితి నెలకొంది. ఇప్పటికైనా త్వరితగతిన ప్రభుత్వ కొనుగోలు కేంద్రాలు ప్రారంభించాలని రైతులు డిమాండ్ చేస్తున్నారు.
ఇవీ చదవండి: