ఖమ్మం దేవరపల్లి గ్రీన్ ఫీల్డ్ జాతీయ రహదారి నిర్మాణానికి జిల్లాలో చేపట్టిన భూసేకరణ కార్యక్రమంలో రైతులు, అధికారులకు నడుమ ఘర్షణ నెలకొంది. భూసేకరణ కోసం కేంద్ర ప్రభుత్వం నోటిఫికేషన్ జారీచేసింది. 22 గ్రామాల్లో భూములు కోల్పోతున్న రైతుల వివరాలు, భూమి విస్తీర్ణం ప్రకటించారు. అభ్యంతరాల కోసం సత్తుపల్లి మండలం తుమ్మూరు గ్రామానికి చెందిన 113 మంది రైతులను పిలిచి... 41ఎకరాలు సేకరించేందుకు అదనపు కలెక్టర్ మధుసూదన్ బహిరంగ విచారణ నిర్వహించారు.
అరవై లక్షల భూమి ఇరవై లక్షలకు...
అధికారులు తొలుత ఎకరాకు రూ.15 లక్షలు ఇస్తామని అన్నారు. ఆగ్రహానికి గురైన అన్నదాతలు తమ భూములు ఇచ్చేది లేదంటూ అధికారులకు తేల్చి చెప్పారు. భూముల్లో ఉన్న చెట్లు, బోర్లకు అన్నింటికీ కలిపి పరిహారం చివరగా రూ.23లక్షలు ప్రకటించారు. రూ.అరవై లక్షలకు పైగా విలువ చేసే భూమిని తక్కువ ధరకు అధికారులు అడుగుతున్నారు అంటూ రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. ఆ ధరకు తమ భూములు ఇచ్చేది లేదంటూ రైతులు అక్కడి నుంచి వెళ్లిపోయారు.
రైతుల ఆందోళన
గ్రీన్‌ఫీల్డ్ హైవే భూ సేకరణలో భాగంగా బాధిత రైతులు నోటిఫికేషన్ ప్రకారం అభ్యంతరం తెలియ జేయడానికి సత్తుపల్లి రైతులు వచ్చారు. భూములు కోల్పోతున్న మిగతా మండలాల రైతులు రావడంతో పోలీసులు ఆరుగురిని కల్లూరు పోలీస్ స్టేషన్‌కు తరలించారు. ఆగ్రహించిన రైతులు తహసీల్దార్ కార్యాలయం ఎదుట జాతీయ రహదారిపై బైఠాయించారు. అరెస్ట్ చేసిన రైతులను విడిచిపెట్టాలని ఆర్డీవో సూర్యనారాయణకు విజ్ఞప్తి చేశారు. ఒక రైతు పెట్రోల్ ఆత్మహత్యా యత్నం చేయబోయారు. వెంటనే పోలీసులు అప్రమత్తమై బాటిల్ లాక్కున్నారు.
చివరకు...
అనంతరం రైతులను అదనపు కలెక్టర్ దగ్గరకు తీసుకెళ్లారు. ఈ బహిరంగ విచారణ సత్తుపల్లి మండలం తుమ్మూరు రైతుల కోసం నిర్వహించామని... ఇతర గ్రామాల రైతులు ఎక్కువ సంఖ్యలో రావడంతో పోలీసులు బందోబస్తు చేశామని తెలిపారు. అరెస్ట్ చేసిన వారిని విడిచిపెట్టారు. రైతులు ధర్నా విరమించి అదనపు కలెక్టర్ ఆధ్వర్యంలో జరుగుతున్న విచారణకు హాజరయ్యారు.
ఇదీ చదవండి:గ్రీన్‌ఫీల్డ్ రహదారి నిర్మాణానికి భూములిచ్చేది లేదు