తెలంగాణ

telangana

ETV Bharat / state

Farmers Problems: రైతుల అవస్థలు... మందకొడి విక్రయాలతో పోగవుతున్న ధాన్యం - farmer laws news

అన్నదాతకు కాలం పరీక్ష పెడుతూనే ఉంది. ఆరుగాలం చెమటోడ్చి పండించిన రైతు... ఆ పంటను అమ్ముకునేందుకు అనేక ఆగచాట్లు పడాల్సి వస్తోంది. కమ్మేస్తున్న మబ్బులతో కర్షకుల గుండెలు గుబేలుమంటుండగా... పూర్తిస్థాయిలో కొనుగోలు కేంద్రాలు ప్రారంభం కాకపోవడం మరింత ఆందోళనకు గురవుతున్నారు. ఉమ్మడి ఖమ్మం జిల్లాలో ధాన్యం రైతుల కష్టాలు వర్ణణాతీతంగా మారాయి.

Farmers Problems for paddy procurement in khammam
Farmers Problems for paddy procurement in khammam

By

Published : Nov 20, 2021, 5:16 AM IST

ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాల్లో ధాన్యం రైతుల పరిస్థితి అగమ్యగోచరంగా మారింది. ఉభయ జిల్లాల్లోనూ వరి కోతలు ముమ్మరంగా సాగుతూ ధాన్యం రైతుల చేతికి వస్తున్నా.. అమ్ముకునే దారిలేక అన్నదాతలకు ఎదురుచూపులు తప్పడం లేదు. ఉభయ జిల్లాల్లోనూ ఈ నెల 8 నుంచి కొనుగోలు కేంద్రాలు ప్రారంభించారు. ప్రజాప్రతినిధులు, అధికారులు ఉభయ జిల్లాల్లో ఆర్భాటంగా ధాన్యం కొనుగోలు కేంద్రాలు ప్రారంభించారు. కొబ్బరికాయలు కొట్టి మరీ కేంద్రాలు ప్రారంభించారు. కానీ..రెండు జిల్లాల్లోనూ ఆ స్థాయిలో కొనుగోళ్ల ప్రక్రియ మాత్రం ఊపందుకోలేదు సరికదా.. అంతంతమాత్రంగానూ సాగడం లేదు.

ఖమ్మం జిల్లాలో 179 కేంద్రాలు ఏర్పాటు చేయగా.. ఇప్పటి వరకు 129 కేంద్రాలు ప్రారంభించారు. జిల్లాలో పౌరసఫరాల శాఖ 4.50 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోళ్ల లక్ష్యం పెట్టుకుంది. కానీ.. ఈ పదిరోజుల్లో కేవలం 30 మెట్రిక్ టన్నుల ధాన్యం మాత్రమే కొనుగోలు చేశారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోనూ రైతులది ఇదే దయనీయ పరిస్థితి. జిల్లాలో మొత్తం 154 కేంద్రాలు ఏర్పాటు చేయగా.. అన్నింటినీ ప్రారంభించారు. ఈ సారి సుమారు 2.50 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం సేకరణ లక్ష్యంగా పెట్టుకోగా.. ఇప్పటి వరకు సేకరించింది కేవలం 600 టన్నుల ధాన్యం మాత్రమే. ఇలా ఉభయ జిల్లాల్లో ఎక్కడా కొనుగోళ్ల ప్రక్రియ సక్రమంగా సాగడం లేదు. కొనుగోలు కేంద్రాలు ప్రారంభించినప్పటి నుంచీ రోజువిడిచి రోజు వర్షం కురవడం, ధాన్యంలో తేమ శాతం ఎక్కువగా ఉందన్న కారణాలతో కొనుగోళ్లు చేయడం లేదు. ఫలితంగా రైతాంగం తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు.

ఓవైపు మేఘామృతమై పేరుకు వస్తున్న మబ్బులు రైతుల గుండెల్లో గుబులు పుట్టిస్తున్నాయి. ఉభయ జిల్లాల్లాలోనూ తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తూనే ఉన్నాయి. తెరిపిలేకుండా వానలు కురవడం, లేకపోతే వాతావరణం చల్లగా మారిపోతుండటం రైతులను ఆందోళనకు గురవుతున్నారు. ఇప్పటికే ధాన్యం చేతికొచ్చిన రైతులు కేంద్రాలకు తరలించారు. ఎక్కడికక్కడ కేంద్రాలన్నీ ధాన్యం రాసులతో నిండిపోయాయి. స్థలం లేకపోవడం వల్ల కొంతమంది వ్యవసాయ కల్లాల్లోనే నిల్వ చేసుకున్నారు. ఇంకొందరు రహదారుల వెంట, ఇళ్లల్లో ఉంచి ఆరబెట్టుకున్నారు. తీరా ఆరబెట్టిన తర్వాత వర్షం కురవడం, ధాన్యం తడిసిపోవడం వల్ల మళ్లీ ఆరబెట్టాల్సి వస్తోంది. ఇలా ఇప్పటికే పెట్టుబడుల రూపంలో పెట్టుబడులు పెట్టిన రైతులు.. పంటను కాపాడుకునేందుకు మరింత పెట్టుబడి పెట్టాల్సి వస్తోంది. ధాన్యం తూర్పార బట్టేందుకు రోజుకు ఒక్కో కూలీకి 500, తూర్పార మిషన్ గంటకు 1000 వరకు ఖర్చు చేయాల్సి వస్తుంది.

మబ్బులు కమ్ముకుంటే టార్పాలిన్లు కప్పుకొని ధాన్యం కాపాడుకుంటున్నారు. తెరిపినిస్తే మళ్లీ ధాన్యాన్ని ఆరబెడుతున్నారు. ఇలా వారం రోజుల నుంచి అన్నదాతలకు ఇది పరిపాటిగా మారింది. కేంద్రాల్లో మాయిశ్చర్ చూసే యంత్రాలు సరిగా లేకపోవడం శాపంగా మారిందని రైతులు వాపోతున్నారు. ఉభయ జిల్లాల్లో వారం, పది రోజులకు పైబడి కొనుగోళ్ల కోసం ఎదురుచూస్తున్న రైతులు ఉన్నారు. వీరి పరిస్థితి ఇలా ఉంటే కోతకు వచ్చిన వరిని కోయాలా..? వద్దా అన్నది రైతుల్ని సందిగ్ధంలోకి నెట్టింది. ఓవైపు వర్షాలు పడుతున్నాయి.ఇంకో వైపు కేంద్రాల్లో కొనుగోళ్లు సాగకపోవడంతో వరి కోసి ఏం లాభమన్న మీమాంస రైతుల్ని వెంటాడుతోంది. ఇలా అనేక సవాళ్ల మధ్య అన్నదాతలు అగ్నిపరీక్ష ఎదుర్కొంటున్నారు. త్వరితగతిన కొనుగోళ్లు ముమ్మరం చేస్తేనే రైతులకుకొంత ఊరట ఉంటుంది. లేకపోతే ఉభయ జిల్లాల రైతాంగానికి మళ్లీ నష్టాల దిగుబడులు తప్పేలా లేవు

ఇదీ చూడండి:

ABOUT THE AUTHOR

...view details