Delay in Grain Purchase in Telangana : ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాల్లో ధాన్యం రైతుల వెతలు తీరడం లేదు. ఓవైపు భానుడి భగభగలతో అల్లాడుతూ పంటను అమ్ముకునేందుకు కేంద్రాల్లోనే రోజుల తరబడి పడిగాపులు పడుతున్నారు. రైతులకు ఒకటి మీద ఒకటి అన్నట్లు కష్టాలు వెంటాడుతున్నాయి. కేంద్రాల్లో కొనుగోళ్లు సజావుగా సాగక.. వడ్లు అమ్ముకునేందుకు కేంద్రాలకు వచ్చిన రైతులు.. వారాల తరబడి ఎదురు చూడాల్సి వస్తోంది. హమాలీలు, లారీల కొరతతో కాంటాలు పూర్తయినా రవాణా సాగడం లేదు. కాంటాలు వేసే సమయంలో మిల్లర్లు పెడుతున్న కొర్రీలతో ధాన్యం రైతు దగా పడుతున్నాడు.
కొనుగోలు కోసం ఎదురుచూస్తున్న రైతులు:తరుగు పేరిట నిలువు దోపిడీ చేస్తున్న మిల్లర్ల తీరుతో అన్నదాతలు నష్టాల పాలవుతున్నారు. మిల్లర్లు భారీగా తరుగు పేరిట దోపిడీకి దిగుతుండటంతో రైతులు పడరాని పాట్లు పడుతున్నారు. ఖమ్మం జిల్లాలో ధాన్యం సేకరణ లక్ష్యం 4 లక్షల మెట్రిక్ టన్నులు ఉంటే.. ఇప్పటి వరకు 90,000 మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోళ్లు మాత్రమే పూర్తయ్యాయి. భద్రాద్రి జిల్లాలో 1.50 మెట్రిక్ టన్నుల ధాన్యం సేకరణ లక్ష్యం ఉంటే.. 18,500 మెట్రిక్ టన్నులు కొనుగోలు చేశారు.
మొక్కజొన్న రైతుల పరిస్థితి మరింత దయనీయంగా ఉంది. మార్క్ఫెడ్ కేంద్రాల ద్వారా మక్కలు కొనుగోలు చేసేందుకు ఇటీవలే ప్రభుత్వం కేంద్రాలు ప్రారంభించింది. కానీ చాలా వరకు కేంద్రాలు అలంకార ప్రాయంగానే ఉన్నాయి. ఖమ్మం జిల్లాలో 60,000 మెట్రిక్ టన్నులు.. భద్రాద్రి జిల్లాలో 19,082 మెట్రిక్ టన్నులు సేకరించాలన్న లక్ష్యం పెట్టుకున్నా.. ఇప్పటి వరకు కేవలం దాదాపు 6,000 మెట్రిక్ టన్నులు మాత్రమే సేకరించారు. అంటే.. కనీసం 10 శాతం కొనుగోళ్లు జరగకపోవడం మార్క్ఫెడ్ నిర్లక్ష్యానికి అద్దం పడుతోంది.