కరోనా నిర్మూలనలో భాగంగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు విధించిన లాక్‌డౌన్ ఖమ్మం జిల్లాలో వ్యవసాయ రంగంపై తీవ్ర ప్రభావాన్ని చూపింది . మిరప సాగు చేసిన రైతుల పరిస్థితి అత్యంత దారుణంగా మారింది. మిరప ధర ఈ ఏడాది ధర ఆశాజనకంగా ఉందనే ఆనందంలో ఉన్న కర్షకులకు చివరకు నిరాశే మిగిలింది. తొలి కోత పూర్తై మంచి గిరాకీ వస్తుందని ఆశించిన సమయంలో కరోనా లాక్ డౌన్ ప్రకటన వెలువడింది. దీంతో అమ్ముకునే వీలు లేక ఏమి చేయాలో తెలియక రైతు పరిస్థితి అగమ్యగోచరంగా తయారైంది.
లాక్‌డౌన్ ఎత్తేసే వరకు శీతల గిడ్డంగుల్లో భద్రపరుచుకుందామంటే అక్కడ కూడా ఇబ్బందులే తలెత్తున్నాయి. గిడ్డంగుల వద్ద హమాలీలు తక్కువగా ఉండటంతో రోజుల తరబడి బారులు తీరిన వాహనాలతో పడిగాపులు కాయాల్సి వస్తోంది. జిల్లాలో ఎక్కడ చూసినా గిడ్డంగుల వద్ద వందల సంఖ్యలో ట్రాక్టర్లు, మినీ వ్యాన్లు కనిపిస్తున్నాయి. మరో వైపు రెండో కోత కోసేందుకు కూలీలు దొరక్క ఆందోళన చెందుతున్నారు. ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన కూలీలు స్వస్థలాకు తిరిగి వెళ్లి పోయారు. స్థానికంగా ఉన్న కూలీలను ఆటోలలో మిరప కోతకు తీసుకెళ్లేందుకు అనుమతించకపోవడంతో పొలాల్లోనే మిరప పంట ఎర్రబారుతోంది. గత నెలలో కురిసిన అకాల వర్షం కొంత దెబ్బతీయగా కరోనా లాక్ డౌన్ ప్రభావం పుండు మీద కారం చల్లినట్లు కుంగదీసింది.