తెలంగాణ

telangana

ETV Bharat / state

Land Pooling: ల్యాండ్‌ పూలింగ్‌పై భిన్నాభిప్రాయాలు.. వాటా తేల్చాకే నిర్ణయమన్న రైతులు - ఖమ్మంలో ల్యాండ్ పూలింగ్

Land Pooling: ప్రభుత్వ అసైన్డు, సీలింగు భూముల్లో స్థిరాస్తి వ్యాపారం దిశగా అడుగులు వేస్తున్న సర్కారు నిర్ణయంపై రైతుల నుంచి భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఇప్పటికే 5 మండలాల్లో గుర్తించిన భూముల్లో అధికార యంత్రాంగం సర్వేలు చేస్తూ... స్థానిక రైతులకు అవగాహన కల్పిస్తోంది. అయితే జీవనోపాధిగా ఉన్న భూమిని... తమకు న్యాయం జరిగేలా ఉంటేనే ఇస్తామని రైతులు స్పష్టం చేస్తున్నారు.

Land Pooling
5 మండలాల్లో భూములు గుర్తించి సర్వే

By

Published : Mar 21, 2022, 9:12 AM IST

అసైన్డ్‌, సీలింగ్‌ భూముల్లో సర్కారు స్థిరాస్తి వ్యాపారం

Land Pooling: ఖమ్మం జిల్లాలోని 5 మండలాల్లో ల్యాండ్ పూలింగ్ ద్వారా ప్రభుత్వ అసైన్డు, సీలింగు భూముల్లో స్థిరాస్తి వ్యాపారం చేసేందుకు సర్కారు పైలట్ ప్రాజెక్టు చేపట్టింది. ప్రధాన రహదారికి సమీపంలో , స్థిరాస్తి వ్యాపారానికి అనుకూలంగా ఉన్న భూములను ఎంపిక చేసింది. ఖమ్మం గ్రామీణం, రఘునాథపాలెం, కొణిజర్ల, వైరా, సత్తుపల్లి మండలాల్లో మొత్తం 864 ఎకరాల భూమిని గుర్తించారు. ఇప్పటికే సర్వే ప్రక్రియ పూర్తి చేశారు.

సాగు భూములు ఇవ్వబోమంటున్న రైతులు

ప్రస్తుతం ఎవరి ఆధీనంలోఎంత భూమి ఉంది. భూములు చేతులు మారాయా?. అసైన్డు, సీలింగు భూముల్లో ఎస్సీ, ఎస్టీ కుటుంబాలు కాకుండా మరెవరైనా ఉన్నారా అన్న వివరాలు ఆరా తీస్తున్నారు. సదరు భూముల్లో ఏయే పంటలు సాగు చేస్తున్నారనే వివరాలు సేకరిస్తున్నారు. లబ్ధిదారులుగా ఉన్న రైతులకు అవగాహన కల్పిస్తున్నారు. అయితే సాగుచేసుకుంటున్న భూములు ఎట్టి పరిస్థితుల్లో ఇవ్వబోమని రైతులు స్పష్టం చేస్తున్నారు.

వాటా తేల్చాకే నిర్ణయిస్తామంటున్న రైతులు

లే అవుట్ చేసేందుకు ప్రభుత్వం గుర్తించిన వాటిలో ఎక్కువ భాగం సాగుభూములే ఉన్నాయి. తీర్థాల రెవెన్యూలో 320 ఎకరాలు ఉంటే..దాదాపు 200 ఎకరాలు సాగులోనే ఉన్నాయి. మంచుకొండ రెవెన్యూలోని 212 ఎకరాల్లో 150 ఎకరాలు పంటకు అనుకూలమైన భూములే ఉన్నాయి. తనికెళ్లలో 86 ఎకరాల్లో దాదాపు అంతా సాగు భూమిగానే ఉంది. సోమవరంలో 150 ఎకరాల్లో 100 ఎకరాలకుపైనే సాగు భూమి ఉంది. బేతుపల్లి రెవెన్యూ పరిధిలోని 96 ఎకరాల మొత్తం పంటలు పండుతున్న భూమే ఉంది. ప్రభుత్వం గుర్తించిన భూముల విలువ ఒకటిన్నర కోట్ల నుంచి దాదాపు 2 కోట్ల వరకు ధర అనధికారికంగా పలుకుతోంది. ప్రభుత్వం తమ వాటాపై స్పష్టత ఇచ్చాకనే భూములు ఇస్తామని రైతులు స్పష్టం చేస్తున్నారు. తమకు 70శాతం వాటా ఇవ్వాలని రైతులు కోరుతుండగా.. సర్వే పూర్తయ్యాకనే ప్రభుత్వం నుంచి విధివిధానాలు వస్తాయని అధికారులు చెబుతున్నారు.

ABOUT THE AUTHOR

...view details