తెలంగాణ

telangana

ETV Bharat / state

పామాయిల్ పంట సాగుపై రైతులు మొగ్గు.. అధికారుల అడ్డంకులు - palm oil crop growth time

palm oil crop in Telangana: రాష్ట్రంలో ఆయిల్ ఫాం విస్తరణకు ప్రభుత్వం సన్నాహాలు చేస్తోంది. రైతులకు రాయితీలు, ప్రోత్సాహకాలు ప్రకటిస్తోంది. సాగుకు రైతులు సమాయత్తమవుతున్నా క్షేత్రస్థాయిలో తలెత్తుతున్న అడ్డంకులతో వెనకడుకు వేయక తప్పడం లేదు. పట్టా, పాసుపుస్తకాలు లేని రైతులకు మొక్కలు ఇచ్చేది లేదంటూ ఆయిల్ ఫెడ్, ఉద్యానశాఖ కొర్రీలు విధిస్తుండటంతో అసలు లక్ష్యం నీరు గారుతోంది. రైతాంగంలో తీవ్ర నైరాశ్యం అలుముకుంటోంది.

Farmers showing interest in palm oil cultivation
పామాయిల్ సాగుపై ఆశక్తి చూపుతున్న రైతులు

By

Published : Feb 25, 2023, 1:32 PM IST

palm oil crop in Telangana: సంప్రదాయ పంటల నుంచి రైతాంగాన్ని వినూత్న పంటల వైపు మళ్లించడమే లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం కొత్త తరహా పంటల సాగులో రైతుల్ని ప్రోత్సహిస్తోంది. దీర్ఘకాలిక పంటల వైపు మొగ్గుచూపే రైతాంగానికి అవసరమైన సబ్సిడీలు, ప్రోత్సాహకాలు అందిస్తోంది. ఇందులో భాగంగా రాష్ట్ర వ్యవసాయ, ఉద్యానశాఖలు రైతాంగాన్ని ఆయిల్ ఫాం సాగువైపు మళ్లించేందుకు అనేక అవగాహన కార్యక్రమాలు చేపడుతున్నారు. ఈ ఏడాదికి రాష్ట్రంలో పామాయిల్ సాగును 2 లక్షల ఎకరాలకు విస్తరించాలని ప్రభుత్వం నిర్దేశించుకుంది. అందుకు అనుకూలమైన జిల్లాలను ఎంపిక చేసి రైతుల్ని ప్రోత్సహిస్తోంది.

15వేల ఎకరాల్లో ఆయిల్ ఫాం సాగు చేస్తున్నారు: సాగులో ఖమ్మం జిల్లా మెుదటి స్థానంలో ఉంది. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో సుమారు 50వేల ఎకరాల్లో ప్రస్తుతం పామాయిల్ సాగవుతోంది. ఖమ్మం జిల్లాలో సుమారు 15వేల ఎకరాల్లో ఆయిల్ ఫాం పంటను రైతులు సాగు చేస్తున్నారు. ఈ విస్తీర్ణం మరింత పెంచాలన్నది ప్రభుత్వ లక్ష్యం. మొత్తంగా భవిష్యత్తులో రాష్ట్రంలోని మొత్తం 25 లక్షల ఎకరాలకు విస్తరించాలని ప్రభుత్వం లక్ష్యం నిర్దేశించుకుంది.

దీర్ఘకాలిక పంట పామాయిల్​పై రైతాంగం మొగ్గుచూపుతున్నారు: ప్రభుత్వ లక్ష్యం బాగానే ఉన్నా దశాబ్దాల పాటు పత్తి, మిర్చి, ఇతర సంప్రదాయ పంటలను సాగు చేసిన రైతాంగం ఇప్పుడిప్పుడే క్రమంగా పామాయిల్ సాగు వైపు మళ్లుతోంది. ఒక్కసారి పంటను సాగు చేస్తే సుమారు 30 ఏళ్లపాటు దిగుబడులు ఇచ్చే దీర్ఘకాలిక పంటగా ఉన్న పామాయిల్‌ను సాగు చేసేందుకు రైతాంగం మొగ్గుచూపుతోంది. ముఖ్యంగా ఏజెన్సీ ప్రాంత రైతాంగం పామాయిల్ సాగుపైనా ప్రత్యేక దృష్టి సారిస్తోంది. కానీ ఉద్యానశాఖ అధికారులు విధిస్తున్న ఆంక్షలు పామాయిల్ సాగుపై తీవ్ర ప్రభావమే చూపుతున్నాయి.

అడ్డంపడుతున్న అధికారులు: హక్కుపత్రాలు చేతిలో ఉన్నప్పటికీ.. ఆర్వోఎఫ్ఆర్ భూముల్లో సాగుకు ఆయిల్ పాం మొక్కలు ఇచ్చేది లేదంటూ ఆంక్షలు విధిస్తుండటంతో సాగుకు ముందుకొస్తున్న రైతాంగానికి నిరాశే ఎదురవుతోంది. ఫలితంగా అటవీ హక్కుల చట్టం పరిధిలో హక్కు పత్రాలున్నా గిరిజనులు అభివృద్ధికి నోచుకోని దుస్థితి మన్యంలో నెలకొంది. ఇవేకాకుండా పోడు భూముల్లో బోర్లు వేయొద్దని, వేసినా వాటికి విద్యుత్తు కనెక్షన్లు ఇవ్వొద్దని అటవీ అధికారులు అడ్డుతగులుతున్నారని సాగుదారులు వాపోతున్నారు. పామాయిల్ సాగులో ఘనమైన లక్ష్యాలు నిర్దేశించుకున్న ప్రభుత్వం ఆ దిశగా సాగుదారులను ప్రోత్సహించాలని గిరిజన రైతాంగం కోరుతోంది.

ఇవీ చదవండి:

ABOUT THE AUTHOR

...view details