ఈ ఏడాది ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాల్లో లోటు వర్షపాతంతో వ్యవసాయ పనులు కుంటుబడ్డాయి. వ్యవసాయ కూలీలతో పాటు సొంతంగా భూమి కలిగి ఉన్న రైతులు సైతం పనుల కోసం పట్టణాల బాట పడుతున్నారు. సాధారణంగా అయితే ఈ సమయానికి మెట్ట పైర్లు పచ్చగా... మాగాణి భూములు దమ్ముకు సిద్ధంగా ఉండాల్సి ఉండగా ఎటు చూసినా వ్యవసాయ భూములు బీళ్లుగానే దర్శనమిస్తున్నాయి. వర్షాభావం వల్ల వ్యవసాయం ముందుకు సాగే పరిస్థితి కనిపించడం లేదు. అన్నదాతల జీవన విధానమే పూర్తిగా మారిపోయింది.
ఆర్థిక పరిస్థితి అతలాకుతలం
వరుణుడు ముఖం చాటేయడం వల్ల అన్నదాత ఆర్థిక పరిస్థితి అతలాకుతలంగా మారింది. చేతిలో చిల్లిగవ్వలేదు. ఉన్న కొద్ది మొత్తాన్ని దుక్కి, విత్తనాలు, ఇతర ఖర్చులకు వినియోగించాడు. వాన జాడ లేకపోవడం వల్ల వ్యాపారులు కూడా రైతులకు అప్పు ఇవ్వడానికి వెనకాడుతున్నారు. మరోవైపు పిల్లల చదువులు, ఇంటి ఖర్చులు, కుటుంబం ముందుకు నడపడానికి అన్నదాత కూలీ అవతారమెత్తుతున్నాడు..
నగరానికి రోజుకు 1500 మంది