తెలంగాణ

telangana

By

Published : Oct 27, 2021, 5:15 AM IST

ETV Bharat / state

Farmer problems: విద్యుత్​శాఖ అధికారుల నిర్లక్ష్యం.. రైతన్నకు శాపం

విద్యుత్​శాఖ అధికారుల నిర్లక్ష్యం రైతుల పాలిట శాపంగా మారింది. పొలాల్లో విద్యుత్​ తీగలు వేలాడుతున్నా పట్టించుకునే నాథుడే కరువయ్యాడు. తన పొలం మీదుగా వెళ్తున్న విద్యుత్ తీగలు ప్రమాదకరంగా ఉన్నా అధికారులు స్పందించడం లేదని వాపోయారు. పలుమార్లు విజ్ఞప్తి చేసినా ఎలాంటి ప్రయోజన లేదని ఖమ్మం జిల్లా కామేపల్లి మండలం సాతానిగూడెంకి చెందిన రైతు వెంకటేశ్వర్లు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

Farmer problems
పొలాల్లో వేలాడుతున్న విద్యుత్​ తీగలు

విద్యుత్ శాఖ అధికారుల తీరుతో రైతులకు కంటి మీద కునుకు లేకుండా పోతోంది. విద్యుత్ తీగలు పొలాల్లో ప్రమాదకర స్థాయిలో వేలాడుతున్నా నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తున్నారు. అధికారుల తీరుతో తాము తీవ్రంగా నష్టపోతున్నామని రైతన్న వాపోయారు. తన పొలం మీద నుంచి వెళ్తున్న విద్యుత్ తీగలు ప్రమాదకరంగా మారాయని చేతితో పట్టుకుని ప్రత్యక్షంగా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అధికారులకు పలుమార్లు విజ్ఞప్తి చేసిన స్పందించడం లేదని రైతు ఆవేదన వెలిబుచ్చారు. దయచేసి సామాజిక మాధ్యమాల్లోనైనా అధికారులు స్పందించే వరకు అన్ని గ్రూపులలో పంపాలని వేడుకుంటున్నారు. ఖమ్మం జిల్లా కామేపల్లి మండలం సాతానిగూడెంకి చెందిన రైతు వెంకటేశ్వర్లు ఆవేదన ఇది.

ఆరు నెలలుగా అధికారులకు ఎన్నిసార్లు విన్నవించినా చెప్పినా పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. కిందికి ఉన్న విద్యుత్ తీగల కారణంగా రైతులకు, పశువులకు ప్రమాదకరంగా మారిందని.. విద్యుత్ తీగలు కిందకు రావడం వలన పొలానికి నీళ్లు పెట్టాలంటే భయమేస్తోందని వాపోయారు. విద్యుత్ తీగలకు రక్షణ వైరు ఏర్పాటు చేయాలని అధికారులకు చెపితే.. తననే డబ్బులు అడుగుతున్నారని ఆరోపించారు. ఇప్పటికే నాలుగు సార్లు విద్యుత్ నియంత్రిక మరమ్మతులు కోసం డబ్బులు చెల్లించాల్సిన పరిస్థితి ఏర్పడిందని అన్నారు. ఇప్పటికైనా ఈ వీడియోతో అధికారులు స్పందించాలని వెంకటేశ్వర్లు కోరుతున్నారు.

ఇదీ చదవండి:

Corn Farmers: రోడ్డెక్కిన రైతన్నలు.. జాతీయ రహదారిపై బైఠాయింపు

ABOUT THE AUTHOR

...view details