తెలంగాణ

telangana

ETV Bharat / state

'డబుల్​' డొల్ల: పగిలిన గోడలు.. కాలిన విద్యుత్​వైర్లు... - ఖమ్మంలో డబుల్​బెడ్​రూం లబ్ధిదారుల ఆందోళన

దేవుడు వరమిచ్చినా పూజారి కరుణించలేదన్న చందంగా తయారైంది కారేపల్లిలోని గాంధీనగర్​లో డబుల్​బెడ్​రూం ఇళ్లు పొందిన లబ్ధిదారుల పరిస్థితి. ఇళ్లు వచ్చాయని సంతోష పడాలో... నాణ్యతలేని నిర్మాణాల్లో ఎలా గడపాలో తెలియని అయోయమ పరిస్థితి. సాక్షాత్తు మంత్రి ప్రారంభించిన ఇంటి పరిస్థితే ఇలా ఉందంటే.. మిగిలినవి ఎలా ఉంటాయో అర్థం చేసుకోవాలి.

పగిలిన గోడలు.. కాలిన విద్యుత్​వైర్లు... డబుల్​ బెడ్​రూం ఇళ్లు
పగిలిన గోడలు.. కాలిన విద్యుత్​వైర్లు... డబుల్​ బెడ్​రూం ఇళ్లు

By

Published : Sep 28, 2020, 10:23 AM IST

గూడు కోసం తమ గోడును ప్రభుత్వానికి విన్నవించుకున్న వారికి డబుల్​బెడ్​రూం ఇళ్లు మంజూరు చేశారు. ఇల్లు వచ్చిందనే సంతోషం వారికి ఎంతో కాలం లేదు.. నాణ్యత లోపంతో గృహాలు నిర్మించడం వల్ల కొన్ని రోజులకే గోడలు బీటలు వారాయి.. విద్యుత్​ వైర్లు కాలిపోయాయి. ఇళ్ల చుట్టూ నీరు చేరి అడుగు బయటపెట్టలేని పరిస్థితి. ఇప్పుడు తమ కష్టాలను ఎవరికి విన్నవించుకోవాలో తెలియడం లేదంటున్నారు లబ్ధిదారులు.

ఖమ్మం జిల్లా కారేపల్లి మండలం గాంధీనగర్​లో రెండు పడక గదుల ఇళ్లను మంత్రి పువ్వాడ ప్రారంభించారు. కానీ వాస్తవానికి కొందరు లబ్ధిదారులకు నాలుగైదు నెలల క్రితమే ఇళ్లను అనధికారికంగా అప్పగించారు. ఆ ఇళ్లనే మంత్రి ప్రారంభించారు. కానీ అప్పటికే ఇళ్ల నిర్మాణంలో నాణ్యతాలోపం కొట్టొచ్చినట్టు కనబడింది. గోడలు బీటలు వారి దర్శనమిచ్చాయి. సిమెంటు పూతలతో మెరుగులు దిద్దారు. విద్యుత్ పరికరాలు సైతం కాలిపోయాయని ఓ బాధితురాలు వాపోయింది. గుట్ట కింద భాగంలో గృహాలు నిర్మించడం వల్ల వర్షమొస్తే వీధుల్లో నీరు ఏరులై పారుతోంది. ప్రారంభ సమయంలో హడావుడిగా పనులు చేసి చేతులు దులుపుకున్నారని లబ్ధిదారులు వాపోతున్నారు. అధికారులు క్షేత్రస్థాయిలో పరిశీలించి తమ సమస్యకు శాశ్వత పరిష్కారం చూపించాలని లబ్ధిదారులు కోరుతున్నారు.

ఇదీ చూడండి:వినియోగం ప్రాతిపదికనే భూమి విలువ నిర్ణయం

ABOUT THE AUTHOR

...view details