Pensions Distribution: పేదలకు చేయూతనందించేందుకు ఆసరా ఫించన్లను పంపిణీ చేస్తున్నారు. సంగారెడ్డిలో పింఛనుదారులకు స్మార్ట్ కార్డులను ఆర్థికశాఖ మంత్రి హరీశ్‌రావు అందజేశారు. అర్హులైన ప్రతి ఒక్కరికీ పింఛన్లు ఇస్తామని స్పష్టం చేశారు. రైతులకు, నిరుపేదల కోసం రాష్ట్ర ప్రభుత్వం ఎన్నో సంక్షేమ పథకాలు అందిస్తుంటే కేంద్రం ఉచితాలు ఇవ్వొద్దని చెబుతుందని విమర్శించారు.
మేడ్చల్ మండల పరిధిలో 753 మంది లబ్ధిదారులకు కార్మిక శాఖ మంత్రి మల్లారెడ్డి ఫించన్లు అందజేశారు. ఇప్పటికే 36లక్షల మందికి ఫించన్లు అందిస్తుండగా... అదనంగా మరో పది లక్షల మందికి సర్కార్ ఆసరా సాయం చేస్తోందని వివరించారు. మునుగోడు పోరులోనే కాదు వచ్చే సాధారణ ఎన్నికల్లోనూ తెరాస గెలిచి తీరుతుందని మంత్రి మల్లారెడ్డి ధీమా వ్యక్తం చేశారు.
రాష్ట్రవ్యాప్తంగా ఫించన్ల పంపిణీ.. లబ్ధిదారులకు స్మార్ట్ కార్డులు ఖమ్మం జిల్లా సత్తుపల్లిలో పలు వార్డులలో కొత్త పింఛన్ల గుర్తింపు కార్డుల పంపిణీ కార్యక్రమాన్ని ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్య ప్రారంభించారు. లబ్ధిదారులతో కలిసి సండ్ర సహపంక్తి భోజనం చేశారు. పీడిత వర్గాలకు ఆసరా సాయం సర్కార్ అందిస్తుందన్నారు. గద్వాల జిల్లా ధరూర్‌లో ఆసరా ఫించన్ గుర్తింపు కార్డులను ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి లబ్ధిదారులకు అందించారు. అభివృద్ధి వైపు ప్రజలు ఉండాలని కోరారు. ఖమ్మం జిల్లా మధిర నియోజకవర్గం ముదిగొండలో ఫించన్ గుర్తింపు కార్డులను సీఎల్పీ నేత భట్టివిక్రమార్క పంపిణీ చేశారు. విభజన హామీలను నెరవేర్చడంలో కేంద్రం నిర్లక్ష్యం వల్ల తెలుగురాష్ట్రాల మధ్య వివాదాలు పెరుగుతున్నాయని వ్యాఖ్యానించారు. అభివృద్ధి విషయంలో రాజకీయాలకతీతంగా అందర్నీ కలుస్తానని భట్టి విక్రమార్క తెలిపారు.
ఇవీ చదవండి:'తెలంగాణలో పుట్టే ప్రతి పిల్లాడిపై రూ.1.25లక్షల అప్పు'
ఝార్ఖండ్ అసెంబ్లీ ప్రత్యేక సమావేశం.. సర్వత్రా ఉత్కంఠ!