ఖమ్మం జిల్లా కారేపల్లి ఎంపీడీవో కార్యాలయం.. ప్రజాప్రతినిధుల నిరసనలు, నినాదాలతో మారుమోగింది. ఏ సమాచారం ఇవ్వకుండా కేవలం కొంతమందితో కమిటీ ఏలా వేస్తారంటూ ఎంపీపీ దంపతులపై వారంతా విరుచుకుపడ్డారు. ఒకానొక దశలో గొడవ ఉద్ధృతంగా మారి.. కొట్టుకునే వరకు పరిస్థితి వెళ్లింది.
మండలంలో పలు అభివృద్ధి కార్యక్రమాలకు ఇటీవలే కేంద్రం నుంచి రూ.60 లక్షల నిధులు విడుదలయ్యాయి. వీటికి సంబంధించి.. ఎంపీపీ శకుంతల, సర్పంచ్ అయినటువంటి ఆమె భర్త కిశోర్.. ప్రజాప్రతినిధుల్లో అందరికీ సమాచారమివ్వకుండా కేవలం అయిదుగురు సర్పంచులు, ఆరుగురు ఎంపీటీసీలతో కమిటీ వేశారు. దీంతో మిగతా వారంతా ఆగ్రహానికి గురయ్యారు. తాము ప్రజాప్రతినిధులము కాదా అంటూ నిలదీశారు.
మాకు నచ్చిన వారితో మేము కమిటీ వేసుకున్నామన్న ఎంపీపీ భర్త వ్యాఖ్యలతో .. అక్కడ పరిస్థితి మరింత ఉద్రిక్తంగా మారింది. ఈ వ్యవహారంపై సమాచారం అందుకున్న పోలీసులు.. కార్యాలయానికి చేరుకుని గొడవను సద్దుమణిగించారు.